శనివారం 28 మార్చి 2020
Hyderabad - Mar 06, 2020 , 00:44:08

‘తరుణి’ సేవలు అభినందనీయం

‘తరుణి’ సేవలు అభినందనీయం

రవీంద్రభారతి : మహిళలకు భరోసానిచ్చేలా తరుణి స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో గురువారం ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థ 20వ వార్షికోత్సవం సందర్భంగా ‘తరుణి మిత్ర అవార్డ్స్‌-2019’ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేం దర్‌రెడ్డి మాట్లాడుతూ భరోసా కేంద్రాలను స్వచ్ఛంద సంస్థలా ఏర్పాటు చేయటానికి తరుణి వ్యవస్థాపకురాలు డా.మమత సుధీర్‌ ఆచంట కీలకమైన పాత్రపోషించారని, 2016 నుంచి తెలంగాణ పోలీస్‌శాఖకు సహకరిస్తూ టెక్నికల్‌ పార్టనర్‌గా, ఎక్స్‌పర్ట్‌గా భరోసా కేంద్రాల నిర్వహణకు తరుణి సంస్థ అందిస్తున్న సేవలను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. మహిళా సమస్యలు, నేరాలు అరికట్టే క్రమంలో పరిష్కారం సులువుగా సాధ్యంకాని ప్రవాసాంధ్ర మహిళల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఎన్‌ఆర్‌ఐ సెల్‌ పెడుతామంటే డా.మమతా సుధీర్‌ పూర్తి సహకారాన్ని అందించారన్నారు. తరుణి సంస్థ ద్వారా గత 20 ఏండ్లలో 17వేల మంది బాలికల జీవితాల్లో వెలుగులు నింపడంతోపాటు ఏ లక్ష్యం కోసం సంస్థ స్థాపించబడిందో ఆ లక్ష్యాన్ని సాధించేందుకు తరుణి నిరంతరం కృషి చేసిందని కొనియాడారు. బాలల, స్త్రీల అభివృద్ధి, హక్కుల సాధన కోసం ఎన్నో ఒడిదొడుకులు, అవమానాలు, ఆటుపోట్లు ఎదుర్కొంటూ ధైర్యంగా సంస్థను ముందుకు తీసుకువెళుతున్న డా.మమతా సుధీర్‌ అందరికీ రోల్‌మాడల్‌గా ఉన్నారన్నారు.  సంస్థ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అగ్రికల్చరల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డా.బి.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ బాలికలకు ఇంటా బయటా నేటికీ సమస్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 


గ్రామాల్లో, విద్యాలయాల్లో సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సాధికారత కోసం సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వరంగల్‌ జిల్లాలో కలెక్టర్‌గా తాను పని చేస్తున్నప్పుడు బాల్య వివాహాలను అరికట్టడం కోసం సంస్థ చేసిన కృషిని దగ్గర నుంచి చూశానన్నారు. ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ సి.పార్థసారథి మాట్లాడుతూ తరుణి మాసపత్రిక ద్వారా మహిళల్ని చైతన్యపరుస్తున్నారని, సమాజంలో పరివర్తన తీసుకురావటానికి భిన్నమైన ఆలోచనతో సంస్థను ముందుకు నడిపించటం అభినందనీయమన్నారు. రాష్ట్ర పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(ఉమెన్‌ సేఫ్టీ) స్వాతి లక్రా మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థల సహకారం లేనిదే నేరాలు అరికట్టడం సాధ్యం కాదన్నారు.  రాష్ట్ర మహిళా కమిషన్‌ పూర్వ అధ్యక్షురాలు డా.త్రిపురాన వెంకటరత్నం, బ్రిటిష్‌ హైకమిషనర్‌ ఆండ్రీవ్‌ ఫ్లెమింగ్‌ తదితరులు అతిథులుగా పాల్గొని అభినందనలు తెలియజేశారు. అంతకుముందు సంస్థ వ్యవస్థాపకురాలు డా.మమతా సుధీర్‌ స్వాగతం పలుకుతూ సంస్థ ఏర్పాటు చేసిన నేపథ్యంతోపాటు  20 ఏండ్ల ప్రస్థానం గురించి వివరించారు. ఈ సందర్భంగా సంస్థ చేస్తున్న కృషి, విజయాలు తదితర అంశాలతో కూడిన ‘మమతానురాగాల తరుణి’ అనే పుస్తకాన్ని సి.పార్థసారథి అతిథులతో కలిసి ఘనంగా ఆవిష్కరించారు. స్కూల్‌ డ్రాపవుట్స్‌ బాలికలను తిరిగి స్కూల్‌లో చేర్పించి వారికి స్కూల్‌కు వెళ్లడానికి తోడ్పడేలా సంస్థ ద్వారా  50 సైకిళ్లను దాతల సహకారంతో అందించారు. 


‘తరుణి మిత్ర’ పురస్కారాలు ప్రదానం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంస్థ మహిళల ఎదుగుదలకు తోడ్పడిన 17మంది పురుషులను ఘనంగా సత్కరించి ‘తరుణి మిత్ర పురస్కారాలు 2019’ ప్రదానం చేశారు. రాజేశ్‌ మిశ్రా’, లెఫ్టనెంట్‌ కర్నల్‌ వెంకటేశ్‌ అర్షద్‌'(వీరి తరఫున ఆయన సోదరి నీలోఫర్‌ పురస్కారం స్వీకరించారు), కిషన్‌ నాగోరి, సుభానీ, నవజ్యోతి సంస్థ వ్యవస్థాపకులు బొంపల్లి మనోహర్‌రావు, రామకృష్ణారావు, డి.నరేంద్ర, ఎల్‌.ఎస్‌.రమేశ్‌, శ్యామ్యూల్‌ సుశీల్‌, బొబ్బిలి రామారావు, జ్యోతిర్‌ విష్ణు భరద్వాజ్‌ తరుపున ఆయన తండ్రి పురస్కారం స్వీకరించారు. అనిల్‌గుప్తా, పసుమర్తి విశాల్‌, అమర్నేని హరికృష్ణ(ఈటీవీ)తరపున ప్రసన్న పురస్కారం స్వీకరించారు. ఉత్తమ టీచర్‌ వల్లంపట్ల నాగేశ్వరరావులను ఘనంగా సత్కరించి తరుణి మిత్ర పురస్కారాలు ప్రదానం చేశారు. 


logo