ఆదివారం 24 మే 2020
Hyderabad - Mar 05, 2020 , 01:27:56

చేతులపై వైరస్‌ ఉండేది.. 10 నిమిషాలే...

చేతులపై వైరస్‌ ఉండేది.. 10 నిమిషాలే...
 • దుస్తులపై 9 గంటలు
 • వస్తువులపై 12 గంటలు
 • బస్సులు, మెట్రో రైళ్ల శుద్ధి
 • విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
 • బడుల్లో ‘ప్రేయర్‌' సమయాల్లో అవగాహన
 • ఆ తర్వాత కరోనా వైరస్‌ మటుమాయం
 • 27 డిగ్రీలు దాటితే వైరస్‌ బతకదు
 • ఇప్పటికే మన వద్ద 35కు చేరిన గరిష్ఠ ఉష్ణోగ్రత
 • గంటకోసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి
 • మాస్కులు లేవని దిగులొద్దు
 • రుమాలు కట్టుకున్నా చాలు
 • కరోనా కొత్తదేం కాదు
 • జలుబు కూడా ఇదే వైరస్‌ నుంచి వస్తుంది
 • ఇది గాలి ద్వారా సోకదు
 • స్పష్టం చేస్తున్న నగర వైద్యులు
 • నగరంలో అన్నిచోట్లా కట్టడి చర్యలు

వాట్సాప్‌లో, సోషల్‌ మీడియాలో భయపెడుతున్నంతగా నగరవాసులెవ్వరూ కరోనా వైరస్‌పై ఆందోళన చెందనవసరం లేదని వైద్యులు, నిపుణులు పదే పదే సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ చేతులపై కేవలం 10 నిమిషాలే ఉంటుందని వెల్లడించారు. దుస్తులపై 9 గంటలు, వస్తువులపై 12 గంటలు మాత్రమే ఉనికిలో ఉండి ఆ తర్వాత మటుమాయమై పోతుందని చెప్పారు. కేవలం తుంపర్ల ద్వారా వ్యాపించే కొవిడ్‌ -19 వైరస్‌ ఉష్ణోగ్రత 27 డిగ్రీలు దాటితే బతకదన్నారు. పదే పదే చేతులు కడుక్కుంటే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని, మాస్కుల కోసం వెతుక్కోకుండా రుమాళ్లు కట్టుకోవచ్చని సలహానిచ్చారు. కాగా జీహెచ్‌ఎంసీ ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కోసం హోర్డింగులు ఏర్పాటు చేసింది. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ‘కరోనా వాష్‌' కార్యక్రమాన్ని  చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రార్థనా సమయాల్లో కరోనా నివారణ చర్యలను విద్యార్థులకు ప్రత్యేకంగా వివరిస్తున్నారు. 


కోవిడ్‌-19 వైరస్‌  రోగి మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతడి నోట్లోంచి వచ్చే తుంపర్లు గాలి ద్వారా అతడికి దగ్గరగా ఉన్న ఇతర వ్యక్తులకు కరోనా సోకే అవకాశమున్నది.  సాధారణంగా ఈ వైరస్‌ లోహపు వస్తువులపై 12 గంటలు, దుస్తువులపై 9 గంటలు, వ్యక్తుల చేతులపై కేవలం 10 నిమిషాలు మాత్రమే జీవించి ఉంటుంది. సాధారణంగా కోవిడ్‌-19 బాధితుడు తన చేతులను ఏదైనా వస్తువులను తాకినప్పుడు లేదా ఇతరులతో కరచాలనం చేసినప్పుడు వైరస్‌ రోగి నుంచి ఇతరులకు సోకే అవకాశాలు ఉంటుంది. కరోనా వైరస్‌లు ఊపిరితిత్తుల వ్యాధులకు దారి తీస్తాయి. సాధారణంగా కరోనాలో ఆరు రకాల వైరస్‌లు ఉన్నాయి. అందులో నాలుగు రకాలు  జలుబు, దగ్గు వచ్చిన వారిలో వచ్చిపోతుంటాయి. వీటికి ప్రత్యేక మందులేవి అవసరం లేదు. ఇవి ఏమాత్రం ప్రమాదకరం కాదు. కానీ..రెండు రకాల కరోనా వైరస్‌లు మాత్రం చాలా ప్రమాదకరమని వైద్యులు తెలిపారు. వాటిలో ఒకటి మెర్స్‌(మెడిలీ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) రెండోది సార్స్‌(సివియర్‌ ఎక్యూట్‌ రెస్పిరేటరీ సిస్టమ్‌).


ఎండలో ఉన్నా...

 • కరోనా అనేది కొత్త వైరసేమీ కాదు. జలుబు కరోనాతోనే వస్తుంది. ఈ వైరస్‌ జన్యుపరమైన మార్పులతో ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రభావం చూపుతుంది. 
 • చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. గంట గంటకూ కడుక్కోవాలి. దుస్తులు శుభ్రంగా ఉతుకుంటే వైరస్‌ వ్యాప్తి చెందదు.  
 • కొన్నిరోజులు ఐస్‌క్రీమ్‌లు వంటి చల్లని పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. 
 • గోరువెచ్చని నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్‌ క్రిములు నిర్మూలించవచ్చు. 
 • మాస్కులతో పనిలేదు. చేతి రుమాల్‌ను రెండు-మూడు మడతలు వేసి ముక్కుకి అడ్డుగా పెట్టుకుంటే సరిపోతుంది. 
 • 26-27డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ వైరస్‌ బతకదు. రాష్ట్రంలో ఇప్పటికే 30-34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నది. 
 • జంతువులతో వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా జంతువులను కోసేవారికి బ్యాక్తీరియా వ్యాపించే వీలుంది. 
 • జ్వరం, తలనొప్పి, జలుబు, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, పొడి దగ్గు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. 


డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కొనసాగుతుంది:  సీపీ అంజనీకుమార్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌  కొనసాగుతుందని, కరోనా వైరస్‌ నేపథ్యంలో వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ కోరారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ, శిక్షణ పొందిన సిబ్బంది పరిశుభ్రమైన వాతావారణంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తారన్నారు. వదంతులు నమ్మవద్దని సీపీ తన ట్విట్టర్‌లో వివరించారు.


logo