గురువారం 09 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 05, 2020 , 01:25:33

మన వాతావరణంలో మనలేదు...

మన వాతావరణంలో మనలేదు...
  • భయం వద్దు...కరోనాతో ముప్పులేదు
  • ఉష్ణోగ్రత ‘27’ దాటితే వైరస్‌ జీవించదు
  • రాష్ట్రంలో ఇప్పటికే 34 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత
  • వ్యాధి అరికట్టడంలో ప్రభుత్వానికి సహకరిస్తాం
  • ప్రైవేటు డాక్టర్ల సంఘం స్పష్టీకరణ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై బహుముఖ పోరుకు సిద్ధమైంది తెలంగాణ సర్కారు. ఈ మహమ్మారిపై భయం పోగొట్టేందుకు ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నది. ఎవరూ భయాందోళనలు చెందవద్దని.. జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని, మన ఉష్ణోగ్రతలో వైరస్‌ బతికే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నది.  


భయం లేదు...

‘మనకు కరోనా ముప్పులేదు. 26-27 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే ఈ వైరస్‌ జీవించే ఆస్కారం లేదు.  మన రాష్ట్రంలో ఇప్పటికే ఉష్ణోగ్రత 34 డిగ్రీలకు చేరుకుంది. మాస్కులు లేవని కంగారు పడాల్సిన అవసరం లేదు. చేతి రుమాల్‌ను మడతపెట్టి ముక్కుకు అడ్డుగా పెట్టుకుంటే సరిపోతుంది. విదేశాల నుంచి  వచ్చే వారి ద్వారానే ఈ వైరస్‌ వచ్చింది. వ్యాధిగ్రస్తులను వెంటనే విడిగా ఉంచి చికిత్స అందిస్తే..వ్యాప్తి చెందే అవకాశముండదు’. అని తెలంగాణ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌, నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. ఈ మేరకు అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ అల్వాల్‌రెడ్డి, శ్వాస ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ విష్ణురావు నేతృత్వంలో  వైద్యులు బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో సమావేశమయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రశంసించారు.  కరోనా వైరస్‌ కొత్తది కాదని, జలుబు ఇదే బ్యాక్టీరియా నుంచి వస్తుందన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఆలస్యం చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుకు పంపిస్తామన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అన్ని వైద్యశాలల్లో జాగ్రత్తలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.


కోవిడ్‌-19..

కరోనాలో ఆరు రకాల వైరస్‌లు ఉన్నట్లు వైద్యనిపుణులు వెల్లడించారు. వీటిలో నాలుగు వైరస్‌లు సాధారణంగా అందరికి వచ్చిపోతుంటాయన్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 వైరస్‌ మొట్టమొదటిసారిగా ఉత్పన్నమైందని, ఇది ఎలా ఉత్పన్నమైంది, దేనిద్వారా సంక్రమించిందనే దానిపై పరిశోధనలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ వైరస్‌ నివారణ కోసం ఇప్పటి వరకు ఖచ్చితమైన మందులు లేవు. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వైరస్‌ కావడంతో నిమోనియాకు సంబంధించిన ట్రీట్‌మెంట్‌తో పాటు స్పెషల్‌ కేర్‌, ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తారు.


వంద మందిలో...

హెచ్‌1ఎన్‌1(స్వైన్‌ఫ్లూ), కరోనా, కోవిడ్‌-19 వైరస్‌లు వేర్వేరు జాతులకు చెందిన వైరస్‌లైనప్పటికీ ఇవి ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. స్వైన్‌ఫ్లూ అరికట్టేందుకు ఫ్లవిట్‌-75 ఎంజీ తదితర మందులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రాణాంతకమైనప్పటికీ పూర్తిగా నివారించవచ్చు. కరోనాకు మందు లేదు. వ్యాధి వచ్చిన 100 మందిలో 80 మందికి స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మరో 20 మంది ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. కేవలం ఇద్దరికి మాత్రమే ప్రాణాపాయం కలిగే అవకాశాలున్నాయి. కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్న వారికి వెంటనే చికిత్స చేసి, తీవ్రమవ్వకుండా ఇప్పటికే ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.  1995, 2001లో ఈ వైరస్‌లు ఇండోనేషియా, థాయిలాండ్‌, కాంబోడియా వాటి పొరుగు దేశాలను వణికించాయి.  -ప్రొఫెసర్‌ రాజారావు (జనరల్‌ మెడిసన్‌ విభాగాధిపతి, గాంధీ దవాఖాన) logo