శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 05, 2020 , 01:20:17

అప్రమత్తమైన వైద్యశాలలు..

అప్రమత్తమైన వైద్యశాలలు..

తెలుగుయూనివర్సిటీ, సుల్తాన్‌బజార్‌: కరోనా కలకలంతో గాంధీ ,ఉస్మానియా, ప్రసూతి దవాఖాన, ప్రభుత్వ ఈఎన్‌టీ, యూపీహెచ్‌సీ, బస్తీ దవాఖాన వైద్యులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. అక్కడికి వచ్చే రోగులకు అవసరమైన వైద్య చికిత్సలు అందజేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎంఎన్‌జే క్యాన్సర్‌ దవాఖాన సిబ్బంది ప్రత్యేకంగా క్రిమి సంహారక మందులను పిచికారి చేశారు. ఓపీ బ్లాకు ఉన్న నూతన భవనంతో పాటు రోగులకు చికిత్సలు అందిస్తున్న పాత భవనంలోని వార్డుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ తదితర మందులను చల్లి పరిశుభ్రత చర్యలు చేపట్టారు.  డైరెక్టర్‌ డాక్టర్‌ జయలత, ఆర్‌ఎం శ్రీనివాస్‌, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ దుర్గాప్రసాద్‌ నేతృత్వంలో నాలుగో తరగతి ఉద్యోగులు 40 మందితో  కలిసి బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దవఖాన పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేయడంతో పాటు క్రిమి సంహారక మందులను చల్లి ప్రత్యేక చర్యలు చేపట్టారు. జనసంచారం ఉండే ప్రాంతాలను గుర్తించి ఎప్పటిప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా ప్రత్యేక సిబ్బందిని నియమించారు. కరోనా వైరస్‌ లక్షణాలపై కరత్రాలు, బ్యానర్లతో అవగాహన  కల్పిస్తున్నట్లు ఎంఎన్‌జే హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ దుర్గాప్రసాద్‌ తెలిపారు. కాగా, కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో నీలోఫర్‌ దవాఖానలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్యశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. 


ఉస్మానియాలోనూ...

కరోనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌  నాగేందర్‌ పేర్కొన్నారు . ఇప్పటికే ఓపీ విభాగంలో స్వైన్‌ ఫ్లూ వార్డు పక్కనే ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయడంతో పాటు ఈ వార్డుకు ప్రత్యేక వైద్యాధికారులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర వార్డుల్లో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఎన్‌-95 మాస్కులను అందిస్తున్నట్లు తెలిపారు. సాధారణ రోజుల కంటే ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో రోగుల సంఖ్య పెరిగిందని యూపీహెచ్‌సీల ఇన్‌చార్జి  క్లస్టర్‌ డాక్టర్‌ రవి కుమార్‌ చెప్పారు.logo