సోమవారం 30 మార్చి 2020
Hyderabad - Mar 05, 2020 , 01:19:14

సుద్దాలకు మఖ్దూమ్‌ అవార్డు

సుద్దాలకు మఖ్దూమ్‌ అవార్డు

చార్మినార్‌: మేరే ప్యారే మఖ్ద్దూమ్‌.. తుజే నహి భూలేంగే ఈ ధర్తీ అంటూ ఆనాటే సిని కవి సి.నారాయణరెడ్డి మఖ్ద్దూమ్‌ ఔనత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని సిటీకాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం సిటీకాలేజీలోని ఆజం గ్రేట్‌హాల్‌లో మ ఖ్ద్దూమ్‌ మోహినుద్దీన్‌ జాతీయ అవార్డు ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా మఖ్ద్దూమ్‌ మోహినుద్దీన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సుద్దాల అశోక్‌తేజ,నిర్మలకు అవార్డును ప్రదానం చేశారు. ఈ సం దర్భంగా డాక్టర్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ సాహితీవనంలో మఖ్ద్దూమ్‌ మోహినుద్దీన్‌ తెలియని వారంటూ ఉండరన్నారు. మఖ్ద్దూమ్‌ కవితోపాటు నాటకప్రియుడుగా రంగస్థలంపై అనేక నాటికలు వేసి అలరించారని చెప్పారు. తెలుగు అధ్యాపకుడు యాకుబ్‌ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే హాస్టల్లో ఉంటూ జీవనాధారం కోసం చిన్నచిన్న ఉద్యోగాలతోపాటు ట్యూషన్లు చెబుతూ విద్యార్థులను తీర్చిదిద్దారని తెలిపారు. మఖ్ద్దూమ్‌ మొహినుద్దీన్‌ జీవితమే ఓ పోరాటమని, బాల్యంలోనే అక్షరాలు దిద్దడానికి ఎన్నో కష్టాలు చూశారని తెలిపారు. నిజాంపాలనలో సాగిన సాయుధపోరాటంలో ముందస్తుగా తుపాకీని పట్టుకుని రావినారాయణరెడ్డితో కలిసి పోరాటం చేశారని కోయి కోటేశ్వర్‌రావు తెలిపారు. అనంతర కాలంలో మఖ్ద్దూమ్‌ కవితాలోకంలో విహరిస్తూ అనేక సాహిత్యాలను అందించారని తెలిపారు. సిటీ కాలేజీ అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తూనే తన రచనలు అం దిస్తూ సమాజంలో వెలుగులు నింపడానికి కృషి చేశారని తెలిపారు. అనంతరం సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజాతోపాటు ఆయన భార్య నిర్మలను తెలుగు అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. 


ఈ సందర్భంగా రూ.పది వేలనగదుతోపాటు దుశ్శాలువతో సన్మానించారు. అనంతరం సుద్దాల అశోక్‌తేజా మాట్లాడుతూ నేటి కాలాన్ని ముందస్తుగా ఆనాడే ఊహించిన మఖ్ద్దూమ్‌ నేటికాలానికి అనుగుణంగా తన రచనలను కొనసాగించారని తెలిపారు. ఒకానొక సందర్భంగా సూర్యాపేట ప్రాంతంలో వేసిన ఓ నాటకాన్ని వీక్షించిన మఖ్ద్దూమ్‌ భవిష్యత్తులో అత్యున్నత స్థానంలో నిలుస్తావని ఆశీర్వదించిన ఘడియలను ఈ సందర్భంగా అశోక్‌తేజా గుర్తు చేసుకున్నారు. మఖ్ద్దూమ్‌ మొహినుద్దీన్‌ గొప్ప హాస్యప్రియుడని, ఓ హోటల్‌కు వెళ్లిన సందర్భంలో ఆ సమయానికి అక్కడ ఏమి లేకపోవడంతో అరే భాయ్‌.. ఇది హోటలా ? మా ఇళ్లా అంటూ తనపై తానే జోకులు వేసుకుని చాతుర్యాన్ని ప్రదర్శించారని తెలిపారు. ఏ జంగ్‌ హైజంగే ఆజాదీతోపాటు హం హిందికే రహ్నేవాలో అనే కవితలు ప్రపంచానికి అందిస్తూ అనేక సద్విమర్శలను చూరగొన్నారని తెలిపారు. ఆయన గీతాలు హిందీ సినిమా సంగీతప్రియులను ఓలలాడించాయని తెలిపారు. మఖ్ద్దూమ్‌ పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డు అందుకోవడం నాకు లభించిన గొప్ప అవార్డుగా భావిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు సుజాత, విప్లవ్‌శర్మ, పాశం యాదగిరితోపాటు సిటీ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


logo