బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 04, 2020 , 04:38:42

కరోనాపై కంగారు వద్దు

కరోనాపై కంగారు వద్దు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :కరోనాపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని, వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు ఆదిలోనే ముందు జాగ్రత్తచర్యలు తీసుకుంటున్నట్లు  మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మాట్లాడారు. కరోనా జాగ్రత్తలపై వివిధ భాషల్లో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కరపత్రాల పంపిణీ, హోర్డింగ్‌ల ఏర్పాటు వంటి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. సామాజిక మాద్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు మంత్రులు, అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. చలి దేశాల్లోనే కరోనా వైరస్‌ బ్రతుకుతుందని, మన రాష్ట్రంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నందున వ్యాప్తిచెందే అవకాశం చాలా అరుదని మేయర్‌ పేర్కొన్నారు.  ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా వైరస్‌ ప్రభావం ఉన్నప్పటికీ వైరస్‌ సోకినవారిలో అత్యధికశాతంమంది సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. మన దేశంలో ప్రబలిన స్వైన్‌ఫ్లూ వంటి అనేక అంటువ్యాధులను విజయవంతంగా ఎదుర్కొన్నట్లు గుర్తుచేస్తూ, కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభు త్వ వైద్యులను సంప్రదించి సరియైన చికిత్స పొందాలని సూచించారు. 

ప్రత్యేక వైద్యసేవలు..

కరోనా వైరస్‌ బయటపడిన వెంటనే ప్రభుత్వం పటిష్టమైన చర్యలు, వైరస్‌ గుర్తించిన వ్యక్తికి ప్రత్యేకవార్డులో వైద్యసేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. మన రాష్ట్రంలో ఆధునిక వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని మరోవైపు, కరోనా వ్యాధిసోకిన వ్యక్తి ఉన్న మహేంద్రాహిల్స్‌ ప్రాంతంలో చాలామంది ప్రజలు భయాందోళనలకుగురై ఇంటి నుంచి బయటకు కూడా రావడంలేదని అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో వీధుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లడంతోపాటు ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు.  మహేంద్రాహిల్స్‌ కంటోన్మెంట్‌ పరిధిలో ఉన్నప్పటికీ వైరస్‌ వ్యాప్తిని అరికట్టే ముందు జాగ్రత్తచర్యలో భాగంగా తామే పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.


logo
>>>>>>