గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 04, 2020 , 04:30:58

గురుదేవోభవ..!

గురుదేవోభవ..!

సుల్తాన్‌బజార్‌ : ఐదేండ్లుగా విద్యార్థుల ఇండ్లకు వెళ్లి మరీ వారిని పాఠశాలకు తీసుకొచ్చి విద్యనందిస్తున్నారు ఓ ఉపాధ్యాయురాలు. మంగళవారం అస్వస్థతకు గురైన విద్యార్థులను చూసి వెంటనే దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. మిగతా వారికి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయించి వైద్య పరీక్షలు చేయించారు కోఠిలోని క్లాక్‌ టవర్‌ పాఠశాలగా పిలువబడే ప్రభుత్వ బాలుర ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న స్వర్ణలత. వివరాలు ఇలా ఉన్నాయి.. బీహార్‌ రాష్ర్టానికి చెందిన పలు కుటుంబాలు కోఠిలోని గోకుల్‌చాట్‌లో పని చేస్తాయి. కాగా, కోఠి జైన్‌ మందిర్‌ వెనుక భాగంలో గోకుల్‌చాట్‌లో పనిచేసే వారి కోసం యజమాని షెడ్డు నిర్మించాడు. అయితే గత 2015 నుంచి బీహార్‌ రాష్ర్టానికి చెందిన కార్మికుల పిల్లల్లో సుమారు 35 మంది నర్సరీ నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఉన్నారు. వీరిని పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఉపాధ్యాయురాలు స్వర్ణలత స్వయంగా రోజూ వారు ఉన్న ప్రాంతానికి వెళ్లి విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లి విద్యాభ్యాసం చేయిస్తూ వస్తున్నది. ఇదిలా ఉండగా.. రోజులాగానే మంగళవారం ఉదయం షెడ్డు వద్దకు వెళ్లేసరికి విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారులు రాత్రి నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని స్వర్ణలతకు తెలిపారు. స్పందించిన స్వర్ణలత వెంటనే సాధారణంగా ఉన్న విద్యార్థులను పాఠశాలకు పంపించి.. విషమంగా ఉన్న వారిని కోఠి డీఎంఈ ప్రాంగణంలోని ఆర్‌బీవీఎస్‌కే దవాఖానకు తరలించారు. అక్కడ వైద్యుడు డాక్టర్‌ రమేశ్‌ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరుగురు విద్యార్థులు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని గుర్తించి తక్షణమే నిలోఫర్‌ దవాఖానకు తరలించి వైద్య చికిత్సలు అందించారు. డాక్టర్‌ రమేశ్‌ సలహా మేరకు పాఠశాలలో ఉన్న బీహార్‌కు చెందిన విద్యార్థులకు అత్యవసర వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 

శభాష్‌ టీచర్‌..

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించే అధ్యాపకులు పాఠశాలకు వచ్చిన వారికి మాత్రమే పాఠాలు బోధిస్తుంటారు. కానీ విద్యార్థులకు విద్యనందించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయురాలు స్వర్ణలత ఇక్కడ ఇండ్ల వద్దకు వెళ్లి మరీ పాఠశాలకు తీసుకురావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్‌ జిల్లా విద్యాధికారిణి వెంకటనర్సమ్మ, డిప్యూటీ ఈవో హిమబిందు అధ్యాపకురాలు స్వర్ణలతను ప్రత్యేకంగా అభినందించారు.


logo