బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 04, 2020 , 04:25:20

‘బీఎస్‌ 4’ రిజిస్ట్రేషన్‌కు బారులు

‘బీఎస్‌ 4’ రిజిస్ట్రేషన్‌కు బారులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :బీఎస్‌ వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం నగర ఆర్టీవో కార్యాలయాల్లో వాహనదారులు బారులు తీరుతున్నారు. ఈ నెల 31 చివరితేదీగా ప్రకటించడంతో త్వరగా  రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు ఎన్నిసార్లు చెప్పినా పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా టెంపరరీ(టీఆర్‌) రిజిస్ట్రేషన్లతో వాహనాలు నడుపుతున్న వాహనదారులకు సుప్రీంకోర్టు ఇచ్చిన  తీర్పుతో కుదేలవుతున్నారు. కాలుష్య నియంత్రణ కోసం తప్పకుండా బీఎస్‌6 వాహనాలు మాత్రమే అమ్మకాలు సాగించాలని ఆదేశాలు జారీచేయడంతో గడువులోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని రవాణాశాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. గడువుదాటితే రిజిస్ట్రేషన్లు చేయబోమని చెబుతుండటంతో ఇక తప్పదని తెలిసి కార్యాలయాలకు వస్తున్నారు. హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లను బిగించుకోకుండా కేవలం టీఆర్‌ నంబరుతో రోడ్లపై తిరుగుతున్నారు. ఇలా తిరుగుతున్న వాహనాల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా  2 లక్షల ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వాహన డీలర్లు విక్రయించిన వాహన యజమానుల సెల్‌ఫోన్లకు సందేశాలు గత కొద్దిరోజులుగా పంపుతున్నారు. దీనికితోడు రవాణాశాఖ అధికారులు ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రతిరోజు నగరంలోని ఒక్కో ఆర్‌టీవో కార్యాలయాల పరిధిలో 70 నుంచి 90 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా ప్రస్తుతం ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య రెండింతలకు పైగా పెరిగిందని అధికారులు తెలిపారు. 


ఏప్రిల్‌ ఒకటి నుంచి బీఎస్‌ 6 వాహనాలకు మాత్రమే :  జేటీసీ నాయక్‌

ప్రస్తుతం టీఆర్‌తో తిరుగుతున్న బీఎస్‌4 వాహనాల పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ గడువు మార్చి 31వ తేదీగా నిర్ణయించినట్లు హైదరాబాద్‌ జేటీసీ పాండురంగనాయక్‌ తెలిపారు. ఏప్రిల్‌1 నుంచి బీఎస్‌ 6 వాహనాల రిజిస్ట్రేషన్‌ మాత్రమే ఉంటుందని, బీఎస్‌4 వాహనాలు రిజిస్ట్రేషన్‌ చేయరని వెల్లడించారు.  దాదాపు 28 రోజుల సమయముందని దీనిని వాహనదారులు వినియోగించుకుని పర్మినెంటు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. వాహన ఉత్పత్తి సంస్థలే బీఎస్‌4 వాహనాల ఉత్పత్తులను నిలిపివేశాయని, కేవలం బీఎస్‌ 6 వాహనాలను మాత్రమే ఉత్పత్తిచేస్తున్నాయన్నారు.


logo
>>>>>>