శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 04, 2020 , 04:43:39

యాచకులకు పునరావాసం.. ఉపాధి

 యాచకులకు పునరావాసం.. ఉపాధి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:యాచకుల సంక్షేమంపై మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌, రెవెన్యూ, సాంఘీక సంక్షేమం,కార్మిక తదితర శాఖల అధికారులు, ఎన్‌జీవోలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ యాచకవృత్తి నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్టు కింద పది మెట్రో నగరాలను ఎంపికచేయగా,అందులో హైదరాబాద్‌కు కూడా చోటు దక్కిన విషయాన్ని గుర్తుచేశారు. ఇందులో భాగంగా  కేంద్రం రూ. 10 కోట్లు అందించనుండగా, దీనికి జీహెచ్‌ఎంసీ సైతం కొంత జోడించి పునరావాస ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్‌ఆర్‌), దాతల ద్వారా కానీ ఈ మొత్తాన్ని రాబట్టనున్నట్లు తెలిపారు. ఈ నిధులతో ఔటర్‌ రింగురోడ్డు చుట్టూ సుమారు రెండు ఎకరాలకు తగ్గకుండా ఉండే ప్రభుత్వ భూముల్లో వీటిని ఏర్పాటుచేయనున్నట్లు, ఒక్కోటి సుమారు 300-400 మంది ఉండే విధంగా నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఆహ్లాదకరమైన వాతావరణం, గ్రీనరీ, వాకింగ్‌ ట్రాక్‌, టీవీ, వార్తా పత్రికలు, భోజనం తదితర సౌకర్యాలు, మెప్మా(మిషన్‌ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ పాపర్టీ ఇన్‌ మున్సిపల్‌ ఏరియాస్‌), జైళ్ల శాఖ, ఎన్‌జీవోలు, జీహెచ్‌ఎంసీ అర్బన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌(యూసీడీ) తదితర విభాగాలు ఓ యూనిట్‌గా ఏర్పడి నగరంలో పూర్తిగా యాచకవృత్తిని లేకుండా చేసేందుకు కృషిచేయాలని మేయర్‌ సూచించారు. ఇప్పటికే వృద్ధాశ్రమాలు, ఆనాథాశ్రమాలు నిర్వహిస్తున్న ఎన్‌జీవోలను ఓ క్లస్టర్‌గా ఏర్పాటుచేసి వారి ఆధ్వర్యంలోనే వీటి నిర్వహణ చేపట్టనున్నామన్నారు. 

ఉపాధి అవకాశాలు.. వృత్తి శిక్షణ

 వివిధ జంక్షన్లవద్ద ఉండే యాచకులను పట్టుకొని వారి అర్హతలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని, వృత్తి శిక్షణ ఇప్పించాలని నిశ్చయించినట్లు మేయర్‌ వెల్లడించారు.  ఒకవేళ వారు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే వైద్యసేవలు అందించాలని, అలాగే, పిల్లలకు విద్య, మహిళలకు టైలరింగ్‌, అల్లికలు, బ్యూటీషియన్‌ వంటి కోర్సుల్లో శిక్షణనిప్పించాలని, యువతకు వివిధ వృత్తుల్లో శిక్షణనిప్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంతేకాకుండా వారికి  పెన్షన్‌, రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు తదితర వాటిని కూడా అందించనున్నట్లు, ఇంట్లో చికాకులు, గొడవల కారణంగా వచ్చేవారికి కౌన్సెలింగ్‌ ఇప్పించనున్నట్లు వివరించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పునరావాస కేంద్రాల నిర్వహణలో ఎదురయ్యే  బాధలను అర్థంచేసుకొని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేలా కార్యప్రణాళికను సిద్ధంచేయాలని అధికారులను మేయర్‌ ఆదేశించారు. వారం-పది రోజుల్లో మార్గదర్శకాలు సిద్ధంచేయాలని, దేశానికి ఓ మోడల్‌గా నిలవాలని ఆయన స్పష్టంచేశారు. అన్ని విభాగాల అధికారులు సేవా దృక్పథంతో వ్యవహరించినప్పుడే యాచకులకు పూర్తిస్థాయిలో పునరావాసం లభిస్తుందని పేర్కొన్నారు. గతంలో నగరంలో సుమారు 1000మంది యాచకులను పట్టుకొని చౌటుప్పల్‌లోని అమ్మ-నాన్న ఆశ్రమానికి తరలించగా, అందులో పలువురికి కౌన్సెలింగ్‌ ఇప్పించి పంపించివేయగా,ఇంకా దాదాపు 300మంది అక్కడే ఉంటున్నట్లు మేయర్‌ రామ్మోహన్‌ వెల్లడించారు. 


logo