ఆదివారం 24 మే 2020
Hyderabad - Mar 04, 2020 , 01:59:01

రైతులకు భరోసానివ్వాలి

రైతులకు భరోసానివ్వాలి

మేడ్చల్‌ కలెక్టరేట్‌ : రైతులకు సకాలంలో రుణాలు అందజేసి వ్యవసాయ రంగాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యాసంగి పంటల సాగుకు రైతులకు సకాలంలో రుణాలు అందజేసి, రైతులకు ఇబ్బంది లేకుండా మేమున్నామని భరోసా ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలో 33 బ్యాంకులు, 500 బ్రాంచ్‌లు ఉన్నప్పటికీ వాటి సంఖ్య పెంచాలని అన్నారు. జిల్లాలో ఆర్‌సెట్‌ కేంద్రానికి స్థలం కేటాయించడం జరుగుతున్నదని, దాని ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో మెప్మా, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో జాబ్‌మేళా, లోన్‌మేళా రెండు నెలలకు ఒకసారి నిర్వహించాలని సూచించారు. బ్యాంకులు సీఎస్‌ఆర్‌లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని విద్యార్థులకు డిజిటల్‌ స్క్రిన్‌, కంప్యూటర్ల ద్వారా విద్యను నేర్పించేందుకు వసతులు కల్పించాలన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలను గుర్తించి వారికి విరివిరిగా రుణాలు అందించాలన్నారు. అనంతరం ప్రొటెన్షియల్‌ లింక్డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ 2020-21 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జడ్పీచైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, అదనపు కలెక్టర్‌ విద్యాసాగర్‌, జిల్లా ఎల్‌డీఎం భుజగం, వ్యవసాయాధికారి రేఖామేరి, పరిశ్రమల జీఎం రవీందర్‌, డీఆర్‌డీఏ పీడీ జ్యోతి, వివిధ బ్యాంకుల కాంట్రోలర్లు, ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


కేశవాపూర్‌ రిజర్వాయర్‌ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌ 

మూడుచింతలపల్లి : మూడుచింతలపల్లి మండల పరిధిలోని కేశవాపూర్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు సందర్శించారు. కేశవాపూర్‌ గ్రామ పరిధిలో నిర్మించబోయే రిజర్వాయర్‌కు కేటాయించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేసి రిజర్వాయర్‌ పనులను ప్రారంభించనుండగా  శిలాఫలకం ఏర్పాటు కోసం కలెక్టర్‌ స్థలపరిశీలన చేశారు. అడిషనల్‌ కలెక్టర్‌ జాన్‌ శాంసన్‌, ఆర్‌డీఓ రవి, తహసీల్దార్‌ గోవర్ధన్‌, ఆర్‌ఐ కిరణ్‌, సర్పంచ్‌ ఇస్తారి, తదితరులు పాల్గొన్నారు.


logo