శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 04, 2020 , 01:57:35

నగరంలో విదేశీ చిత్రోత్సవాల హల్‌చల్‌

నగరంలో విదేశీ చిత్రోత్సవాల హల్‌చల్‌

  సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: భాగ్యనగరంలో ప్రపంచ స్థాయి సినిమాల జోరు రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇందుకు ప్రధాన కారణం..హైదరాబాద్‌ ఓ విశ్వనగరం కావడమే. ఇక్కడ పలు రాష్ర్టాల,దేశాల వారు జీవించండ ఒక కారణమే. దీనికి తోడు విదేశీ సినిమాలను సైతం ఇక్కడి వారు ఆదరించడంతో విదేశీ సినిమాలకు చాలా క్రేజ్‌ పెరిగింది.

   గోథె జంత్రమ్‌ అనే జర్మన్‌ సంస్థతోనూ ప్రభుత్వం మమేకం

     ఒక దేశానికి సంబంధించిన సంస్కృతి, జీవితం, భాష, వాతావరణం, ఆచార వ్యవహారాలన్నింటినీ ఈ సినిమా కళలో వర్ణిస్తున్నారు. పొరుగు దేశాలలోని సాంకేతికత, తీరూ తెన్నులను మనం కూడా అందిపుచ్చుకోవాలి. ఆ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఫెంటాస్టిక్‌ - 5 అనే శీర్షికన ఐదు రోజుల పాటు విదేశీ సినిమాలను ప్రదర్శిస్తోంది. రవీంద్రభారతి ఆధ్వర్యంలో ఇప్పటికే మనం ఫ్రెంచ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ చేశాం. అలాగే జర్మన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, ఇరానియన్‌, కొరియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ను నిర్వహించుకొని వారి చిత్రాలను ప్రదర్శించుకుంటున్నాం. ఇలా ఇతర దేశాలకు సంబంధించిన చిత్రాలను ఎంపిక చేసుకొని ఇక్కడి వారి కోసం తెలంగాణ ప్రభు త్వం, గోథె జంత్రమ్‌ అనే జర్మన్‌ సంస్థతోనూ మమేకమై చిత్రాలను ప్రదర్శిస్తుంది. ఇలా ఐదు రోజుల పాటు ఫెంటాస్టిక్‌- 5 ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో 10 చిత్రాలను ప్రదర్శించింది.

     సినిమా విభాగంలో ఎంతో మంది ఔత్సాహికులు 

     తెలంగాణలో ఎంతో మంది ఔత్సాహికులు, ఆసక్తి గలవారు సినిమా రంగం వైపు అడుగులు వేస్తున్నారు. వందలు, వేలల్లో ఆశావాదంతో ఎదురుచూస్తున్నారు. వారికి చిత్ర నిర్మాణంపై సరైన అవగాహన లేక ఎంతో మంది జీవితాలు నిర్వీర్యమై పోతున్నా యి. వారందరికీ నగర వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ప్రదర్శించే ప్రపంచ వ్యాప్త గొప్ప సినిమాలు ఒక ఉత్తేజాన్ని, ఒక మంచి అవగాహనను కల్పించనున్నాయి. నగరంలో ప్రదర్శించే విదేశీ, స్వదేశీ ఫిల్మ్‌ ఉత్సవాలను యువతరం అందిపుచ్చుకుంటోంది. ఇటీవల తెలంగాణలో వచ్చిన ‘దొరసాని, మల్లేశం’ చిత్రాలకు సంబంధించిన టెక్నిషియన్లు ఇక్కడి నుంచి తయారైన వారే కావడం విశేషం. 


logo