ఆదివారం 24 మే 2020
Hyderabad - Mar 03, 2020 , 05:24:45

జలఫలం...

జలఫలం...
  • వేసవిలోనూ ఔటర్‌ గ్రామాలకు సమృద్ధిగా నీరు
  • డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరాకు కార్యాచరణ
  • అదనంగా 17 ప్రాంతాల్లో ఫిల్లింగ్‌ స్టేషన్లు
  • సమస్యాత్మక ఏరియాలకు ట్యాంకర్లు

సిటీబ్యూరో:వేసవి వచ్చిందంటే.. నీటి కష్టాలు తరుముకొచ్చేది.. మండే ఎండలో గుక్కెడు నీళ్ల కోసం ఆడబిడ్డలు పడిన పాట్లు వర్ణణాతీతం. ఇది ఒకప్పటి మాట.. ప్రభుత్వ సంకల్పంతో చేపట్టిన ‘మిషన్‌ భగీరథ’ యజ్ఞం ఫలించింది. జలసిరులు కురిపించింది. ముఖ్యంగా ఔటర్‌ రింగు రోడ్డు గ్రామాలకు నీటి ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేసింది. వేసవిలోనూ ఎలాంటి ఢోకా లేదన్న భరోసా ఇచ్చింది. సమృద్ధిగా నీరు అందిస్తున్నది. 


కార్యాచరణ ప్రణాళిక...

అర్బన్‌ మిషన్‌ భగీరథలో భాగంగా జలమండలి రూ. 756 కోట్లతో పనులు చేపట్టి... రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని 190 గ్రామాలకు రోజు విడిచి రోజు తాగునీరు ఇస్తున్నారు. 164 రిజర్వాయర్ల ద్వారా నిత్యం 25 మిలియన్‌ గ్యాలన్ల నీటిని (ఎంజీడీల) సరఫరా చేస్తున్నారు. 10 లక్షల జనాభాకు లబ్ధి జరగడంతో పాటు కొత్తగా 1.80 లక్షల నల్లా కనెక్షన్లు మంజూరు చేసి నీటి సరఫరా చేస్తున్నారు. వేసవి దృష్ట్యా డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ చర్యలతో అధికారులు సన్నద్ధమయ్యారు . గతేడాది నీటి డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు ఈసారి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కొత్తగా 17 ఏరియాల్లో ఫిల్లింగ్‌ స్టేషన్లు, ప్రస్తుతం ఉన్న 50 ట్యాంకర్లకు అదనంగా మరో 60 అందుబాటులోకి తీసుకురానున్నారు. 


అదనపు ఫిల్లింగ్‌ స్టేషన్లు ఇక్కడే ...

పీరం చెరువు, కిస్మత్‌పూర్‌ (150 కేఎల్‌/భవానీనగర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌), నార్సింగి హైట్స్‌, మణికొండ( 2.2 ఎంఎల్‌/నార్సింగి హైట్స్‌), బాలాపూర్‌, సాహేబ్‌నగర్‌ , పెద్ద అంబర్‌పేట, శ్రీరాంనగర్‌, తుర్కయాంజల్‌, జవహర్‌నగర్‌, తూంకుంట, ప్రగతినగర్‌, గండిమైసమ్మ, కొంపల్లి, శంషాబాద్‌, అమీన్‌పూర్‌, హెఎంటీ కాలనీ, బొల్లారం సంపు, తెల్లాపూర్‌, కిష్ణారెడ్డిపేట, బీరంగూడ ప్రాంతాల్లో ఫిల్లింగ్‌ స్టేషన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు ట్యాంకర్ల ద్వారా నీటి ఎద్దడి లేకుండా చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.అంతేకాకుండా వేసవి కార్యాచరణలో భాగంగా డివిజన్‌కు రూ.10 లక్షలు, సీజీఎం పరిధిలో రూ.7.50 లక్షల నిధులు కేటాయించారు. వీటితో బావులు, చేతిపంపులు పునరుద్ధరించడం, సమస్య ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్యాంకర్లతో దాహార్తి తీర్చనున్నారు.  


logo