శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 02, 2020 , 05:54:20

ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం

ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం
  • ఆరోగ్యశాఖ మంత్రి ఈటల
  • కేపీహెచ్‌బీకాలనీలో 3కే వాక్‌ను ప్రారంభించిన మంత్రి

కూకట్‌పల్లి, నమస్తే తెలంగాణ : ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ‘వినికిడి దినోత్సవం’ సందర్భంగా కేపీహెచ్‌బీకాలనీలోని రావూస్‌ ఈఎన్‌టీ సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 3కే వాక్‌ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఆరోగ్యం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, వాడవాడల ప్రభుత్వ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసి మెరుగైన వైద్యాన్ని అందిస్తుందన్నారు. దీనిలో భాగంగానే వైద్యం, ఆరోగ్య విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించడానికి ప్రతి కాలనీలో ‘బస్తీ దవాఖాన’లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా రావూస్‌ ఈఎన్‌టీ దవాఖాన ఆధ్వర్యంలో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించి నిర్వహిస్తున్న చికిత్సలు, వారు అందిస్తున్న సేవలను మంత్రి అభినందించారు. వినికిడి దినోత్సవం సందర్భంగా అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేలా 3కే వాక్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు, కార్పొరేటర్‌ కావ్యారెడ్డి, రావూస్‌ ఈఎన్‌టీ దవాఖాన చైర్మన్‌ జీవీఎస్‌కే రావు, చైతన్యరావు తదితరులు పాల్గొన్నారు.


logo