గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 02, 2020 , 05:51:38

‘ధనికొండ’ కథా సాహిత్యం పై సదస్సు

‘ధనికొండ’ కథా సాహిత్యం పై సదస్సు

రవీంద్రభారతి: సామాజిక పరిస్థితులు, నీటి వనరుల లభ్యత   ప్రభావం ఆ ప్రాంతం నుంచి వచ్చిన సాహిత్యంలో ప్రతిబింబి స్తాయని ఆచార్య వకుళాభరణం రామకృష్ణ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో  ‘ధనికొండ హను మంతరావు కథాసాహిత్యం’పై  ధనికొండ హనుమంతరావు శతజయంతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ధనికొండ హనుమంతరావు కాలంలో తెనాలి సామాజిక ఆర్థిక పరిస్థితుల క్రమం ఆయన సాహిత్యంపై చూపిన ప్రభావం గురించి చెప్పారు. ధనికొండ హనుమంతరావు చలంకు కొనసాగింపు అన్నారు.   స్త్రీలు ఎదుర్కొనే వ్యక్తిగత సమస్యలు, స్త్రీపురుష సంబంధాల గురించి ధనికొండ కథాసాహిత్యంలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు.  పరిశోధకులు సంగి శెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంనుంచి విదేశాల్లో చదువుకొని వచ్చిన రచయితల సాహిత్యంలోని వైవిద్యాలపై ప్రసంగించారు. పత్రికలు, సాహిత్యం,  సినిమా, పోరాటాలు, వ్యాపారాలలో ఒకదానితో మరొకదానికి  సంబంధాలుంటాయని  అభిప్రాయపడ్డారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ అధ్యక్షోపన్యాసం చేస్తూ నైతిక అంశాలపై ధనికొండ  చాలా రచనలు చేశారని, ఆయన రచనల్లో మధ్యతరగతి వారి వ్యక్తిత్వం జీవనవిధానం కనిపిస్తుందన్నారు. 

గోపరాజు సుధ అధ్యక్షతన జరిగిన ధనికొండ కథలపై నిర్వహించిన  చర్చా గోష్ఠిలో కె.ఎన్‌.మల్లీశ్వరి, లక్ష్మీగోపరాజు, కుప్పిలి పద్మ, మణి వడ్లమాని, కృష్ణకుమారి, గిరిజారాణి, సుజాత గొట్టిపాటి, సుజాత వేల్పూరి, స్వర్ణకిలారి, శ్రుతకీర్తి, చందు తులసీ, జయదేవ రెంటాల, నరేష్‌నున్నా, బి. పద్మావతి, పడాల బీపీ, కొండేపూడి నిర్మల, వెంకట్‌ సిద్ధారెడ్డి, మోహిత, మహి బెజవాడ తదితర సాహిత్యాభిమానులు   వారి అభిప్రాయాలను వెల్లడించారు. 


logo