గురువారం 09 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 28, 2020 , 13:08:52

చెత్త సేకరణకూ క్యూఆర్‌ కోడ్‌

చెత్త సేకరణకూ క్యూఆర్‌ కోడ్‌

ఇంటింటి చెత్త సేకరణను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ప్రయోగాత్మకంగా క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్ల పరిధిలో తొలుత 870 ఇండ్లను ఎంపిక చేశారు. చెత్తను సేకరించే ప్రతి ఇంటికీ క్యూ ఆర్‌ కోడ్‌ స్టిక్కర్‌ను అతికిస్తారు. చెత్త సేకరణకు వెళ్లిన ఆటో డ్రైవర్‌.. తన మొబైల్‌ ఫోన్‌లోని యాప్‌ ద్వారా ఈ కోడ్‌ను కనెక్ట్‌ చేస్తారు. ఇది జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి అనుసంధానమై ఉండడంతో అధికారులకు సమాచారం అందుతుంది. -కేపీహెచ్‌బీ కాలనీ

  • ఇంటింటికీ తప్పనిసరి రావాలి
  • స్వచ్ఛ టిప్పర్ల డ్రైవర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసే యోచన
  • ఇప్పటికే.. పలు సర్కిళ్లలో కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న జీహెచ్‌ఎంసీ
  • కూకట్‌పల్లి, మూసాపేటల్లో 870 ఇండ్ల ఎంపిక
  • ప్రతి గుమ్మం వద్ద ఉన్న కోడ్‌తో యాప్‌ అనుసంధానం చేయాలి

కేపీహెచ్‌బీ కాలనీ : హైదరాబాద్‌ మహానగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా కాలనీలు, బస్తీలలో ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించడానికి స్వచ్ఛ ఆటో టిప్పర్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. గత ఐదేండ్లుగా నగరంలో ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తూ డంపింగ్‌ యార్డుకు పంపిస్తున్నారు. కానీ ఈ విధానంలో స్వచ్ఛ ఆటో టిప్పర్ల డ్రైవర్లు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం వల్ల చెత్త సేకరణ కార్యక్రమం సజావుగా సాగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో వారం రోజులైనా చెత్తను తీసుకెళ్లేందుకు స్వచ్ఛ ఆటోలు రాకపోవడంతో ప్రజలు రోడ్లపైన, ఖాళీ ప్రదేశాల్లో పారబోస్తున్నారు. సక్రమంగా చెత్తను సేకరించేందుకు ఎస్‌ఎఫ్‌ఏలతో అనుసంధానం చేస్తూ అమల్లోకి తెచ్చిన టోకెన్‌ విధానం ఫలితాలివ్వలేదు. ఈ నేపథ్యంలో స్వచ్ఛ ఆటో టిప్పర్ల వ్యవస్థను గాడిన పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. పకడ్బందీగా చెత్తను సేకరించడం కోసం నగరంలో ప్రయోగాత్మకంగా క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇన్నాళ్లూ అస్తవ్యస్తంగా సాగిన చెత్త సేకరణ నూతన విధానంతో సంపూర్ణంగా గాడినపడే అవకాశం ఉన్నది. 

జంట సర్కిళ్లలో 870 ఇండ్లు ఎంపిక..

కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్లలో క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని అమలు చేసేందుకు మొదటగా 870 ఇండ్లను ఎంపిక చేశారు. మూసాపేట సర్కిల్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ 3 ఫేజ్‌లో 420 ఇండ్లు, కూకట్‌పల్లి సర్కిల్‌లోని జలవాయు విహార్‌లో 450 ఇండ్లకు క్యూఆర్‌ కోడ్‌ విధానంతో అనుసంధానం చేస్తున్నారు. ఈ విధానంలో చెత్తను సేకరించే ప్రతి ఇంటికి క్యూఆర్‌ కోడ్‌ కలిగిన స్టిక్కర్‌ను అతికిస్తారు. ఆ కాలనీలో చెత్తను సేకరించే ఆటో డ్రైవర్‌ మొబైల్‌లో జీహెచ్‌ఎంసీ క్యూఆర్‌ కోడ్‌ వ్యవస్థ గల యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ స్వచ్ఛ ఆటో డ్రైవర్‌ చెత్తను సేకరించడానికి ఇంటికి వెళ్లినప్పుడు ఇంటి ప్రధాన గుమ్మానికి అతికించిన జీహెచ్‌ఎంసీ క్యూఆర్‌ కోడ్‌ను మొబైల్‌ యాప్‌ ద్వారా కనెక్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థను జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి అనుసంధానమై ఉండడంతో స్వచ్ఛ ఆటో డ్రైవర్‌ చెత్తను సేకరించిన అంశం జీహెచ్‌ఎంసీ అధికారులందరికీ తెలుసుకునే అవకాశం లభిస్తుంది. చెత్తను ఏ సమయంలో సేకరించాడు, ఎన్ని రోజులకొకసారి సేకరిస్తున్నాడు, సేకరించిన వారి వివరాలన్నీ ఆన్‌లైన్‌ ద్వారా ఆఫీస్‌లో ఉన్న అధికారులంతా తెలుసుకునే అవకాశముంటుంది. దీంతో ఇన్నాళ్లూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్వచ్ఛ ఆటో టిప్పర్‌ డ్రైవర్ల ఆగడాలకు ఈ విధానంతో పూర్తిగా చెక్‌ పడనున్నది. కాలనీలు, బస్తీలన్నింటిలో ప్రతిరోజూ పక్కాగా చెత్తను సేకరించే  అవకాశముండడంతో స్వచ్ఛ పరిసరాల ఏర్పాటు కల సాకారమవుతుంది. 

ప్రయోగాత్మకంగా అమలు

ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. క్యూఆర్‌ కోడ్‌ విధానంతో స్వచ్ఛ ఆటో డ్రైవర్లు ప్రతీ ఇంటికి వెళ్లి ప్రతీరోజు చెత్తను సేకరించాలి. లేకుంటే ఆన్‌లైన్‌ ద్వారా చెత్తను సేకరించలేదన్న విషయం జీహెచ్‌ఎంసీ అధికారులకు తెలుస్తుంది. ప్రయోగాత్మకంగా కేపీహెచ్‌బీ కాలనీ జలవాయు విహార్‌లో కొన్ని ఇండ్లను క్యూఆర్‌ కోడ్‌ విధానంలో చెత్తను సేకరించే పనులను చేపడుతున్నాం. ఇది విజయవంతమైతే భవిష్యత్‌లో అన్ని కాలనీలలో ఇదే తరహాలో చెత్తను సేకరిస్తాం. కొత్త విధానానికి ప్రజలు, స్వచ్ఛ ఆటో టిప్పర్‌ డ్రైవర్లు సహకరించాలని కోరుతున్నాం. \

- సంపత్‌కుమార్‌, ఏఎంహెచ్‌వో, మూసాపేట


logo