గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 28, 2020 , 13:06:51

ఉద్యోగం..ఉపాధి పేరుతో సైబర్‌ వల

ఉద్యోగం..ఉపాధి పేరుతో సైబర్‌ వల

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఉపాధి కోసం వివిధ రంగాల్లోని ప్రజలు తమకున్న అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఇంటర్‌నెట్‌పై ఆధారపడుతుండడంతో.. దీనిని ఆసరాగా చేసుకుంటున్న సైబర్‌నేరగాళ్లు తమకు ఉపాధి మార్గంగా మలుచుకుంటున్నారు. మాయమాటలు చెబుతూ ఉపాధి కోసం ప్రయత్నించే వారిని బుట్టలో వేసుకొని లక్షల్లో దోపిడీ చేస్తున్నారు. సైబర్‌ మోసాల తీరుపై ప్రజల్ల అవగాహన తెస్తున్నా.. రోజుకో కొత్త తరహా మోసం వెలుగులోకి వస్తున్నది. ఓఎల్‌ఎక్స్‌, ఓటీపీ సైబర్‌నేరాలు భారీగా జరుగుతున్నా.. ఉద్యోగం, ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న వారి వద్ద నుంచి సైబర్‌నేరగాళ్లు మోసపూరితంగా సొమ్ముదోచేస్తున్నారు.అడ్డదారిలో ఉద్యోగాలిప్పిస్తామంటే .. మరికొందరు మీకు  కొద్ది ఖర్చుతో ఉన్నత శ్రేణిలో జీతాలు వచ్చే విధంగా ఉద్యోగం, వ్యాపారాలకు సంబంధించిన అవకాశాలు కల్పిస్తామంటూ అందినకాడికి దోచేస్తున్నారు. ఇలా ఒక్క ఫిబ్రవరి నెలల్లోనే ఇలా మోసపోయిన వారి సంఖ్య 20 మంది వరకు ఉంటుంది, వీరి నుంచి రూ. 80 లక్షల వరకు సైబర్‌నేరగాళ్లు దోచేశారు. 

ఉదాహారణకు  కొన్ని ఘటనలు..!


అమీర్‌పేట్‌కు చెందిన హరీశ్‌ ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా నౌకరీ.కామ్‌లో తన రెజ్యూమ్‌ అప్‌లోడ్‌ చేశాడు. గత ఏడాది అక్టోబర్‌లో గుర్తుతెలియని వ్యక్తుల నుంచిఫోన్‌ చేసి టెక్‌ మహేంద్రాలో ఉద్యోగం ఉందంటూ నమ్మించారు. రిజిస్ట్రేషన్‌ ఫీ, సెక్యూరిటీ ఫీ,మెడికల్‌ హెల్త్‌, బ్యాంక్‌ ఖాతా, డ్రెస్‌కోడ్‌ అంటూ దఫదఫాలుగా రూ. 3లక్షలు వసూలు చేశారు. ఉద్యోగం రాకపోవడంమే కాకుండా ఆరు నెలలుగా సైబర్‌నేరగాళ్లు ఇంకా డబ్బు అడుగుతుండడంతో బాధితుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. 


అంబర్‌పేట్‌కు చెందిన ప్రశాంత్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. క్వికర్‌లో తన పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్‌నేరగాళ్లు ప్రశాంత్‌కు ఫోన్‌ చేసి మీరు మహేంద్ర బ్యాంకులో ఉద్యోగ అవకాశం ఉంది. మావద్ద రిజిస్ట్రేషన్‌ ఫీ రూ.1850 చెల్లిస్తే తరువాత ప్రాసెసింగ్‌ పూర్తి చేస్తామంటూ నమ్మించడంతో గూగుల్‌ పే ద్వారా ప్రశాంత్‌ ఆ డబ్బు చెల్లించాడు. తరువాత వెరిఫికేషన్‌, మెడికల్‌ సర్టిఫకెట్‌, బ్యాంకు డిపాజిట్‌, సెక్యూరిటీ డిపాజిట్‌ అంటూ రూ. 2.21 లక్షలు సైబర్‌నేరగాళ్లు కాజేశారు. 


సికింద్రాబాద్‌కు చెందిన గోపినాథ్‌రెడ్డి కెనాడాలో ఉద్యోగం చేసేందుకు వీసా గురించి ఇంటర్‌నెట్‌లో సర్చ్‌ చేశాడు. ఇందులో భాగంగా క్లాసిక్‌ గోల్డ్‌మైనింగ్‌ కంపెనీ నుంచి ఒక ఈమెయిల్‌ రావడంతో అందులో ఉన్న ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేశాడు. తన పేరు క్రిస్‌దిక్ష్‌ అని, వీసా ప్రాసెసింగ్‌ చార్జీలు రూ. 4.3 లక్షలు చెల్లించాలంటూ సూచించడంతో ఆ డబ్బు చెల్లించాడు. అనంతరం ఫోన్‌లో సంప్రదిస్తే వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


నేను మీ మనుమడు అరుణ్‌ మాట్లాడుతున్నాను.. తాతయ్య నాకు ప్రమోషన్‌ ఉంది. అయితే ప్రమోషన్‌ కోసం రూ. 2 లక్షలు కావాలి.. తిరిగి మూడు రోజుల్లో ఇచ్చేస్తానంటూ ఓ గుర్తుతెలియని వ్యక్తి రాంనగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి పాండురంగంకు ఫోన్‌ చేసి రూ. 2 లక్షలు కాజేశాడు. తన బాస్‌ ఖాతా నంబర్‌ ఇస్తున్నానని, అందులో అర్జెంట్‌గా డిపాజిట్‌ చేస్తే.. నాకు ప్రమోషన్‌ పేపర్లపై ఈ రోజే సంతకం అవుతుందంటూ ఒత్తిడి తేవడంతో దూరపు బంధువు అయిన అరుణే ఫోన్‌ చేశాడని పాండురంగం భావించి ఆ డబ్బు డిపాజిట్‌ చేశాడు. తీరా తన బంధువులో ఉన్న అరుణ్‌ను ప్రశ్నిస్తే.. నేను ఎందుకు ఫోన్‌ చేశాను.. అసలు నాకు పదోన్నతి ఏంటీ తాతయ్య అంటూ ప్రశ్నించాడు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు తనను మోసం చేశారంటూ బాధితుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. 


ఉపాధి అంటూ..!

మీకు ఉపాధి కల్పించేందుకు ప్లే భాయ్‌ అవకాశాన్నిస్తాం.. ధనవంతులైన మహిళలతో అందమైన యువకులు ఒక రోజు గడిపితే భారీ పారితోషికం ఇప్పిస్తామంటూ సెల్‌ఫోన్లకు మేసేజ్‌ పెట్టి ఒక వ్యక్తి వద్ద నుంచి సైబర్‌నేరగాళ్లు సుమారు రూ.40 వేలు కాజేశారు. ‘రిచ్‌ ఉమెన్‌ లూకింగ్‌ యంగ్‌ పార్ట్‌నర్‌, గాయ్స్‌ మీట్‌ అండ్‌ ఎర్న్‌ ఫర్‌ డేట్‌' కాల్‌ నౌ అంటూ ఫోన్‌ నంబర్లు సెల్‌ఫోన్లకు మేసేజ్‌ పంపించారు. రిజిస్ట్రేషన్‌ ఫీ అంటూ మొదట పేటీఎం ద్వారా రూ.1000వసూలు చేశారు. సోఫియా అనే మహిళ మాట్లాడుతూ మీకు పార్టనర్‌ సిద్ధ్దంగా ఉందని ఆమె పేరు సారిక అగర్వాల్‌ అంటూ నమ్మిస్తూ ఓ గుర్తుతెలియని మహిళతో సెల్‌ఫోన్‌ కన్ఫరెన్స్‌లోమాట్లాడించి, ఒక రాత్రికి రూ. 55 వేలు ఇస్తామన్నారు. అందులో 1/3 మా కమిషన్‌ అంటూ ఒప్పందం చేసుకున్నారు. అయితే ముందుగా ప్రాసెసింగ్‌ చార్జీలు రూ. 15500 ప్లే భాయ్‌, రూ.25500 సదరు మహిళ ఇవ్వాలని ఫోన్‌లోనే మహిళలతో ఆ డబ్బు తమ ఖాతాకు బదిలీ చేస్తున్నట్లు మాట్లాడారు. దీంతో బాధితుడు రూ. 15500 బదిలీ చేశాడు. ఆ తరువాత 4 గంటలకు క్యాబ్‌ డ్రైవర్‌ వస్తున్నాడంటూ అతని ద్వారా రూ. 20 వేలు వసూలు చేయించారు. ఇలా మొత్తం ఈ గ్యాంగ్‌ అతని నుంచి ఒకే రోజు రూ. 40 వేల వరకు వసూలు చేసింది. ఆ తరువాత ఫోన్లన్ని స్విచాఫ్‌ చేశారు. బాధితుడు ఇదంతా మోసమని గుర్తించి సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


      ముషీరాబాద్‌కు చెందిన అశోక్‌కుమార్‌ ఏఎస్‌ హెల్త్‌ కేర్‌ పేరుతో  డాటా ఎంట్రీ పనులు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌లో శ్రీగణేశ్‌ ఔట్‌సోర్సింగ్‌ అనే పేరుతో తాము పలు రకాల ప్రాజెక్ట్‌లు ఔట్‌సోర్సింగ్‌ చేస్తున్నామంటూ ఓ పోస్టింగ్‌ పెట్టారు. దాని సూచిన మేరకు అశోక్‌కుమార్‌ అందులో ఉన్న ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేయడంతో తాము వివిధ కంపెనీలకు సంబంధించిన ఫామ్‌ ఫిల్లింగ్‌కు సంబంధించిన వర్క్‌ను ఔట్‌సోర్స్‌ చేస్తుస్తున్నామని, ప్రస్తుతం జియో ఇన్ఫోకమ్‌, జిబో ఫైబర్‌ ఇన్‌బండ్‌కు సంబంధించి కస్టమర్స్‌కు చెందిన ఫారాలను ఆన్‌లైన్‌లో డాటాఎంట్రీ చేసే పనులున్నాయంటూ నమ్మించారు. ముందుగా తమకు రూ. 5.5 లక్షలు డిపాజిట్‌ చేస్తే వెంటనే ప్రాజెక్ట్‌ పనులు అప్పగిస్తామంటూ నమ్మించి, డబ్బు డిపాజిట్‌ చేసిన తరువాత సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ చేశారు. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

డాటా బయటకు వెళ్తుంది

ఇప్పుడు చాలా జాబ్‌ పోర్టల్స్‌ తమకు వద్దకు వచ్చే డాటాను బయట విక్రయిస్తున్నారు. అం దులోభాగంగానే సైబర్‌నేరగాళ్లు కూడా ఆ డాటాను కొం టూ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఫోన్లు చేసి రిజిస్ట్రేషన్‌ ఫీతో మొదలు పెట్టి సెక్యూరిటీ డిపాజిట్‌ వరకు అందిన కాడికి దోచేస్తున్నారు. ఉద్యోగాలు ఎవరు కూడా డబ్బులు తీసుకొని ఇవ్వరు. అత్యాశకు పోయి డబ్బు పొగొట్టుకోవద్దు. ఉద్యోగం, వ్యాపారాలకు సంబంధించిన అంశాల్లో డబ్బు ప్రస్తావన వస్తే అది మోసమని గుర్తించింది. బ్యాక్‌ డోర్‌ ఉద్యోగాలు, ఇన్‌ఫ్రంట్‌ అమౌంట్‌ కట్టి ప్రాజెక్ట్‌లు తెచ్చుకోవడం అనేవి ఎప్పటికైనా ఇబ్బందులకు, నష్టాలను తెచ్చిపెడతాయి. ఇంటర్‌నెట్‌లో ఉద్యోగం, ఉపాధి కోసం ప్రయత్నించే వారు డబ్బు అంశం రాగానే దానిని అనుమానించి, మోసపోకుండా జాగ్రత్త పడడం మంచిది.                      

                                -కేవీఎం ప్రసాద్‌, సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ


logo