శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 28, 2020 , 13:05:26

ప్రణాళికాబద్ధ్దంగా మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకుందాం

ప్రణాళికాబద్ధ్దంగా  మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకుందాం
  • ప్రభుత్వ స్థలాలను వినియోగంలోకి తీసుకొస్తాం..
  • ప్రభుత్వ స్థలాలు కాపాడాలని సూచన
  • పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
  • మేడ్చల్‌,నిజాంపేట మున్సిపల్‌ పరిధిలో కలెక్టర్‌ పర్యటన
  • మేడ్చల్‌లో పట్టణంలో అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన

 మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: పట్టణాలను పరిశుభ్రంగా మార్చుకునేందుకే ప్రభుత్వం ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ రూపకల్పన చేశారని, అందుకు అనుగుణంగా పని చేసి ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుకునే బాధ్యత మనందరిపై ఉందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ‘పట్టణ ప్రగతి’లో భాగంగా నాలుగో రోజు మేడ్చల్‌ మున్సిపాలిటీలో కలెక్టర్‌ వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి పర్యటించి పరిశుభ్రత, పచ్చదనాన్ని పరిశీలించారు. అనంతరం రూ. 80లక్షలతో చేపట్టుబోయే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా మేడ్చల్‌ రైతుబజార్‌లో వెజ్‌ మార్కెట్‌ను ప్రారంభించి, పట్టణంలోని ప్రభుత్వ స్థలాల్లో పార్కుల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. మేడ్చల్‌లోని ప్రభుత్వ జూనియర్‌కళాశాల, ఐటీఐలను సందర్శించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణాల్లోని ప్రతి కాలనీ అభివృద్ధి చేసుకోవడంతో పాటు పరిశుభ్రంగా మార్చుకోవాలని పట్టణ ప్రగతి కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రణాళికాబద్ధ్దంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. మేడ్చల్‌లో ఇంటర్మీడియట్‌ కళాశాల ప్రాంగణంలో ఉన్న అదనపు స్థలాన్ని సద్వినియోగంలోకి తీసుకొచ్చి అక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఐటీఐ ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలో మురికి,పిచ్చి మొక్కలను తొలిగించి ప్రజాసౌకర్యార్థం వాకింగ్‌ట్రాక్‌ ఏర్పాటు చేసేందుకు ఆలోచన ఉందన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మేడ్చల్‌ రామలింగేశ్వర స్వామి ఆలయ భూమి కబ్జాకు గురికాకుండా అక్కడ ఫంక్షన్‌ హల్‌ ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రగతిలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.మేడ్చల్‌ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణాలను అభివృద్ధి చేసుకోవడమే పట్టణ ప్రగతి ప్రథమ కర్తవ్యమని అన్నారు. పచ్చదనం, పరిశుభ్రత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించుకుందామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ దీపికానర్సింహారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రమేశ్‌,  కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. 

నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో..  

 దుండిగల్‌,(నమస్తేతెలంగాణ): కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం,నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కలెక్టర్‌ వీ.వెంకటేశ్వర్లు ఆకసిక్మంగా పర్యటించారు.ఈ సందర్భంగా కార్పొరేషన్‌ పరిధిలోని 5వ వార్డు పరిధి(ప్రగతినగర్‌)లో జరిగిన ‘పట్టణప్రగతి’లో పాల్గొన డంతో పాటు పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించారు.ప్రజాప్రతినిధులు,అధికారులు పట్టణప్రగతిలో భాగస్వాములై ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు.అక్కడినుంచి నేరుగా అంభీర్‌చెరువు వద్దకు చేరుకుని రూ.25కోట్లతో జరుగుతున్న చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. చెరువులోని కొద్దిపాటి నీటిని పూర్తిగా తొలిగించేందుకు గాను తూమును పగులగొట్టాల్సి ఉందని అందకు కలెక్టర్‌ అనుమతికోసం వేచి చూస్తున్నట్లు సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు సుధీర్‌రెడ్డి కలెక్టర్‌దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు.అనంతరం సర్వే నంబర్‌ 86,87లోని ప్రభుత్వస్థలాలను పరిశీలించిన ఆయన అక్కడ కూరగాయల మార్కెట్‌ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.కార్యక్రమంలో మేయర్‌ నీలాగోపాల్‌రెడ్డి,కమిషనర్‌ గోపీనాథ్‌,బాచుపల్లి మండలంతహసీల్దార్‌ నిర్మల, కార్పొరేటర్లు ఇంద్రజిత్‌రెడ్డి,బాలాజీనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

అధికారులు,ప్రజాప్రతినిధులతో సమావేశం...

అనంతరం కలెక్టర్‌ వెంకటేశ్వర్లు నిజాంపేటలోని కార్యాలయంలో అధికారులు,ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పట్ణణప్రగతిపై సమీక్షించారు.ప్రజాప్రతినిధులు పట్టణప్రగతిలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.ప్రభుత్వస్థలాలను కాపాడేందుకు రెవెన్యూఅధికారులు కఠిన చర్యలుతీసుకోవాలన్నారు.ప్రభుత్వ స్థలంలో సూచికబోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.కబ్జాకు యత్నిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్‌నీలాగోపాల్‌రెడ్డి,పాలకవర్గం సభ్యులతో పాటు కమిషనర్‌ గోపీనాథ్‌,మేనేజర్‌ చంద్రప్రకాశ్‌,రెవెన్యూ అధికారి మధుసూదన్‌రెడ్డి,ఏసీపీ రాజుకుమార్‌,తహసీల్దార్‌ నిర్మల తదితరులు పాల్గొన్నారు.


logo