బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 27, 2020 , 02:16:18

మూసీ ప్రక్షాళనపై నేడు కీలక సమావేశం

మూసీ ప్రక్షాళనపై  నేడు  కీలక సమావేశం
  • రూ.4500 కోట్ల ప్రతిపాదనలపై చర్చ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నేడు (గురువారం) కీలక అడుగు పడనున్నది. ఢిల్లీలో ఎన్‌ఎంసీజీ (నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా) డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా అధ్యక్షతన జరగనున్న సమావేశంలో జలమండలి ఎండీ దానకిశోర్‌ మూసీ నది సమూల ప్రక్షాళనపై తీసుకోవాల్సిన కార్యాచరణపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించనున్నారు. ఈమేరకు ఎండీ దానకిశోర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం. సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్‌-2 శ్రీధర్‌ బాబు, సీజీఎం ప్రసన్నకుమార్‌  ఢిల్లీకి చేరుకున్నారు. ఈ మూసీ పథకాలకు కేంద్ర జలశక్తి అభియాన్‌, ఎన్‌ఆర్‌సీడీ (జాతీయ నదీ పరిరక్షణ, అభివృద్ధి ) పథకాల కింద 60 శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఇందులో భాగంగానే జలమండలి, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కింద మొత్తం నది క్యాచ్‌మెంట్‌ ఏరియా అభివృద్ధికిగాను దాదాపు రూ. 15వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు గత నెలలో ఎన్‌ఎంసీజీ (నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా) డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నగరంలో రెండు రోజుల పర్యటన చేశారు. మూసీ ప్రక్షాళనకు పరీవాహక ప్రాంతంలో మురుగు శుద్ధి చేసే కేంద్రాలు, మురుగునీటిని ఎస్టీపీలకు మళ్లించేందుకు భారీ ట్రంక్‌ సీవర్‌, సబ్‌మెయిన్స్‌, పైపులైన్లు ఏర్పాటు చేయడం, సుందరీకరణ పనులు చేపట్టడం, మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఈటీపీల నిర్వహణ తదితర పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు. రూ. 13, 479 కోట్ల అంచనాతో జలమండలి, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలను అధికారులు మిశ్రాకు నివేదించారు. 


మంజీరా క్యాచ్‌మెంట్‌ ఏరియా పరిధిలోకి వచ్చే నక్క వాగు సమూల ప్రక్షాళనకు రూ. 2, 404 కోట్లతో సిద్ధం చేసిన మాస్టర్‌ప్లాన్‌పై చర్చించారు. కూకట్‌పల్లి నాలా క్యాచ్‌మెంట్‌ ఏరియా ప్రక్షాళనకు రూ. 2329 కోట్లు , సివరేజీ మాస్టర్‌ప్లాన్‌ వీటి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసిన రాజీవ్‌ రంజన్‌ మిశ్రా అన్ని రాష్ర్టాలను పరిగణలోకి తీసుకుని జలమండలికి పలు సూచనలు జారీ చేశారు. తక్షణం అత్యవసరంగా చేపట్టాల్సిన పనులపై ఐదు వేల కోట్లకు మించకుండా ప్రతిపాదనలు సమర్పించాలని ఎండీ దానకిశోర్‌కు ఆదేశించారు. దీంతో రూ. 4500 కోట్ల ప్రతిపాదనల నివేదికను ఎండీ దానకిశోర్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా అందించనున్నారు. ఇందులో నూతనంగా మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిచ్చారు. 


మూసీలో.. 

1400 మిలియన్‌ లీటర్ల మురుగు నీరు నగరంలో నిత్యం 1400 మిలియన్‌ లీటర్ల మురుగు నీరు మూసీ నదిలో కలుస్తుంది. ఇందులో వివిధ నాలాల నుంచి రోజువారీగా వెలువడుతున్న మురుగునీటిలో కేవలం 700 ఎంఎల్‌డీ మేర మాత్రమే శుద్ధి చేసి  మూసీలోకి వదులుతుండగా, పరిశ్రమలు, వాణిజ్య సముదాలు, ఇతర నివాస ప్రాం తాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు నేరుగా మూసీలోకి చేరుతుండడంతో మూసీ నది మురికి కూపంగా మారింది. ఇందులో భాగంగానే  ఐదు విడతల్లో మూసీ నది ప్రక్షాళన, అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు.  రూ. 5 వేల కోట్ల అంచ నా వ్యయం తో 10 ప్రాంతాల్లో ఎస్టీపీలను నెలకొల్పనున్నారు. 


ప్రాజెక్టు విశేషాలు 

  • పథకం : మూసీ ప్రక్షాళన రెండో దశ 
  • అంచనా వ్యయం :  సుమారు రూ. 5వేల కోట్లు (ఎన్‌ఆర్‌సీడీ పథకం కింద కేంద్ర ఆర్థిక సాయం 60శాతం, 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం)
  • లక్ష్యం : మూసీలో రోజువారీగా శుద్ధి చేయకుండా కలుస్తున్న దాదాపు 700 మిలియన్‌ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేయడం
  • చేపట్టనున్న నిర్మాణాలు : మూసీ నది ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఐదేసీ చొప్పున మొత్తం...పది సివరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. 
  • మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాలు : అంబర్‌పేట (142 ఎంఎల్‌డీ), నాగోల్‌ (140 ఎంఎల్‌డీ), నల్లచెరువు (80 ఎంఎల్‌డీ), హైదర్షాకోట్‌ (30), అత్తాపూర్‌ (70 ఎంఎల్‌డీ), మీరాలం (6 ఎంఎల్‌డీ), ఫతేనగర్‌ (30 ఎంఎల్‌డీ), ఐడీపీఎల్‌ టౌన్‌షిప్‌ (59 ఎంఎల్‌డీ), నాగారం (29 ఎంఎల్‌డీ), కుంట్లూర్‌-హయత్‌నగర్‌ (24  ఎంఎల్‌డీ)
  • రీసైక్లింగ్‌ యూనిట్లు : ఫతే నగర్‌, ఐడీపీఎల్‌ టౌన్‌షిప్‌, నాగారం-కాప్రా 
  • ప్రత్యేకతలు : జీహెచ్‌ఎంసీ పరిధిలో మూసీ నది ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో 574.59 చదరపు కిలోమీటర్ల పరిధిలో నాలాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసి తిరిగి నదిలోకి వదలనున్నారు. తద్వారా మూసీ నది కాలుష్య కాసారం కాకుండా నివారించనున్నారు. పరివాహక ప్రాంతాల్లో ఈ నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకునేందుకు వీలుగా మార్చనున్నారు. 


logo