గురువారం 09 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 27, 2020 , 02:14:38

రోజూ 77 కోట్ల లీటర్ల నీరు వృథా..

రోజూ 77 కోట్ల లీటర్ల నీరు వృథా..

మలక్‌పేట/ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  నీటి వృథాను అరికట్టడానికి జలమండలి చేపట్టిన వాక్‌ కార్యక్రమంలో భాగంగా ఓల్డ్‌ మలక్‌పేటలోని వాహేద్‌నగర్‌లో బుధవారం జలమండలి నగర వాసులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జలమండలి ఎండీ దానకిశోర్‌, స్థానిక ఎమ్మెల్యే బలాల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఔటర్‌ రింగు రోడ్డు వరకు జలమండలి నిత్యం 472 ఎంజీడీల మంచినీటిని సరఫరా చేస్తుందని, సుదూర ప్రాంతాలు కృష్ణా, గోదావరి నదుల నుంచి మంచినీటిని తీసుకువస్తున్నామని ఎండీ దానకిశోర్‌ వివరించారు. శుద్ధి చేసిన వెయ్యి లీటర్లకు సంస్థ రూ. 42 ఖర్చు చేసి, వినియోగదారులకు మాత్రం సబ్సిడీపై ఏడు రూపాయాలకే అందిస్తుందని పేర్కొన్నారు. 


వినియోగదారులు నివాసాల వద్ద ఇంటిని, వరండాలు, వాహనాలు, జంతువులను కడగడం, మొక్కలకు నీటిని పట్టడం లాంటి పనులతో విలువైన తాగునీరు వృథాగా పోతుందని, అవగాహన లేమితో రోజూ 77 కోట్ల లీటర్ల నీరు వృథా పోతుందని ఎండీ దానకిశోర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నీటిని ఇష్టానుసారంగా వృథా చేస్తే రానున్న భవిష్యత్‌ తరాలకు మంచినీటి ఇక్కట్లు వస్తాయని ఎండీ ఈ సందర్భంగా హెచ్చరించారు. వాక్‌ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 600 కాలనీలకు వెళ్లి స్థానిక ప్రజలకు నీటి వృథాపై అవగాహన కల్పించామని వివరించారు. ఇంటింటికి వెళ్లి మంచినీటి వృథా, మంచినీటి పొదుపుపై అవగాహన కల్పించడం, ఇంటింటికి కలర్‌ గుర్తులు కేటాయించడం జరుగుతుందని దానకిశోర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి. రవి, సంబంధిత సీజీఎం, జీఎం, డీజీఎం, స్థానిక కార్పొరేటర్లు, ఎన్జీవోలు, ప్రజలు పాల్గొన్నారు. logo