గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 27, 2020 , 00:11:14

వదంతులు సృష్టించొద్దు..

వదంతులు  సృష్టించొద్దు..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ట్రై పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, సోషల్‌మీడియాపై నిఘాను కొనసాగిస్తున్నారు.  ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌మీడియా యాప్‌లో ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా పోస్టింగ్‌లు పెట్టారా? అనే విషయాలను నిరంతరం తెలుసుకోవడంలో ఆయా పోలీస్‌ కమిషనరేట్లల్లో ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తున్నాయి. సిబ్బందికి సెలవును కూడా రద్దు చేసి, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలంటూ మూడు కమిషనరేట్ల పోలీస్‌ కమిషనర్లు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 


మీకోసం మేమున్నాం : సీపీ అంజనీకుమార్‌ 

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని ఆయా ఠాణాల అధికారులతో బుధవారం సీపీ అంజనీకుమార్‌ వీడియో కన్ఫరెన్స్‌ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన బందోబస్తు చర్యల గురించి సిబ్బందికి తగిన సూచనలిచ్చారు.  పుకార్లు సృష్టించే అవకాశాలు ఉన్నాయని, పుకార్లను ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మొద్దని ఆయన నగర ప్రజలకు సూచించారు. పెట్రోలింగ్‌ సిబ్బంది  నిరంతరం కాలనీలు, బస్తీలలో పెట్రోలింగ్‌ చేస్తున్నారని ప్రజలు వారి సాయం పొందాలన్నారు.  అనుమానాస్పదమైన వ్యక్తులు కన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.   డయల్‌ 100 సేవలను ఉపయోగించుకొని సమాచారం అందించాలని, పోలీసుల సహాయాన్ని తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌ నగరంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కల్గించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


పోస్టింగ్‌లతో ప్రజలు ఆందోళనకు గురవుతారు.. 

సోషల్‌మీడియా ద్వారా వ్యాప్తి చెందే వదంతులతోనే ప్రజలు ఆందోళనకు గురవుతారు. సోషల్‌మీడియాలో  ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరైనా పోస్టింగ్‌లు పెట్టినా, వాటిని సర్క్యూలేట్‌ చేసిన వెంటనే గుర్తించి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.  పుకార్లు సృష్టించే వారి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నాం. 

-సీవీ సజ్జనార్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌


నిరంతరం అప్రమత్తం ..

నిరంతరం అప్రమత్తతో ఉంటూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా సోషల్‌మీడియాపై దృష్టి సారించి, అభ్యంతకరమైన పోస్టింగ్‌లు, మేసేజ్‌లను పరిశీలిస్తున్నాం. పుకార్లను మెసేజ్‌ చేసే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాం, అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకుంటాం. పెట్రోలింగ్‌ వాహనాలను నిరంతరం తమ ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి. 

-మహేశ్‌ భగవత్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌


logo
>>>>>>