సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 26, 2020 , 01:01:15

రంగుల ప్రపంచం

రంగుల ప్రపంచం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మనసులోని అందమైన ఊహా చిత్రాలకు రూపాన్నిచ్చి మెప్పించారు గురుకుల పాఠశాలల విద్యార్థులు. మంగళవారం మాసబ్‌ట్యంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆర్ట్‌ గ్యాలరీలో ‘స్ట్రోక్స్‌ 2020’ పేరిట తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో విద్యా ర్థులు వేసిన చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. ఇందులో భాగంగా మల్కా జిగిరి ఫైన్‌ ఆర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థుల చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం, ఐపీఎస్‌ అధికారి టీఎస్‌డబ్లూఆర్‌ఈఐఎస్‌ సెక్రటరీ ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ లతో పాటు జాయింట్‌ సెక్రటరీ పద్మావతి, ఓఎస్‌డీ పీఎస్‌ఆర్‌ శర్మ, జేఎన్‌ఏ ఎఫ్‌ఏయూ ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌రెడ్డి, దైవజ్ఞశర్మ, పాఠశాల ప్రిన్సిపల్‌ జయంతి, అధ్యాపకులు విక్రమ్‌, రమేష్‌లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ కళలకు మంచి భవిష్యత్‌ ఉందన్నారు.


 ప్రపంచ వ్యాప్తంగా చిత్రకారులకు, పేయింట్‌ ఆర్టిస్టులకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ప్రోత్సాహకం కోసం ప్రపంచంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాలలో పేయింట్‌ ఆర్టిస్టులకు, మంచి వాతావరణాన్ని ఏర్పరిచేందుకు కోట్లాది రూపాయలిచ్చి కళాకండాలను రూపొందించుకున్నారని తెలిపారు. అలాగే చైనాలోని ఓ స్టేడియంను ఓ కళాకారునితో అక్కడి ప్రభుత్వం అచ్చు పిచ్చుక గూడులా తయా రు చేసిందన్నారు. చిత్రాలు ఎప్పుడూ మంచి ఆసక్తితో గొప్ప లక్ష్యాలతో వెయ్యాలన్నారు. ఆ చిత్రాలు ప్రజల జీవితాలను ప్రతిభింభించాలన్నారు. తోట వైకుంటం మాట్లాడుతూ మీ ఆలోచనలకు మరింత సృజ నాత్మకతను జోడించి, నిరంతరం ఆలోచనల్లో అభివృద్ధిని సాధించాలన్నారు. అలాగే చిత్రా లను గీసేప్పుడు ప్రకృతి ద్వారా స్పూర్తి పొందాలన్నారు. జీవితంలో ఎదగాలంటే సమ యాన్ని ఎప్పుడూ వృథా చేయకూడదన్నారు. సొంతంగా ఆలోచించాలని, ఇతరుల చిత్రా లను కాపీ కొట్టకూడదన్నారు. చిత్రాల్లో తమదైన ముద్రను వేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల వందలాది చిత్రాలు  ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి.  


చిన్నారులు వేసిన చిత్రాలు అనుకోరు...

చాలా మంది ఈ చిత్రాలను చూసి చిన్నారులు వేసినవని అనుకోరు  చిన్నారుల చిత్రా లు ప్రదర్శనలో రూ.2 వేల నుండి రూ.30 వేల వరకు అమ్మకానికి అందుబాటులో ఉంచాము. ఆ డబ్బును చిన్నారుల కుటుంభాలకు అందజేస్తాం. పాఠశాలలో ప్రతి రోజు 2 గంటల నుండి 5 గం టల వరకు కళలకు శిక్షణ ఉంటుంది. దాదాపు 40 మంది చిత్రకారులుగా విద్యార్థులు నిపుణులచే మంచి నైపుణ్యాన్ని పొందారు. వీరు జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో ముందుంటున్నారు. తాజాగా ఎన్టీపీసీ నిర్వహించిన చిత్రలేఖన పోటీలో రాష్ట్ర స్థాయిలో 2వ స్థానాన్ని గెలిచారు. తరు వాత జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఇద్దరు ఎంపికయ్యారు. 

 -మంజులత, ఫైనాన్స్‌ హెడ్‌ - ఫైన్‌ఆర్ట్స్‌స్కూల్‌ మల్కాజిగిరి


ఆలోచనల ఆవిష్కరణలకు ఆర్ట్‌ ఒక భాష

ఆర్ట్‌ అనేది ఎప్పుడూ తక్కువ కాదు. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆవిష్కరణల కు, ఆలోచనల కు ఆర్ట్‌ ఒక భాష. కళను నేర్చుకునే ఆసక్తిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది.  కళలు తెలిసిన వారు చాలా విషయాల్లో చాలా నైపుణ్యాన్ని పొందుతారు. వారికి కళలలో చదువులపై కూడా ఏకాగ్రత పెరుగుతుంది. మా విద్యా సంస్థలో జాతీయ స్థాయి సిలబస్‌ను అందించడం జరుగుతుంది. ఈ విద్యార్థులు బీఎఫ్‌ఐ చదివిన విద్యార్థులతో సమానంగా చిత్రాలను వేయగలరు. 

-విక్రమ్‌, అధ్యాపకులు, ఫైన్‌ ఆర్ట్స్‌ స్కూల్‌ మల్కాజిగిరి


ప్రకృతి చిత్రాలంటే చాలా ఇష్టం...

ఈ పాఠశాలలో చేరకముందే చిత్రలేఖనంపై చాలా ఆసక్తి ఉండేది.  మా గురువుల ప్రోత్సాహకం, శిక్షణతో ఎంతో మంచి చిత్రాలు వేయగలుగుతున్నాను. జీవితంలో మంచి కళాకారునిగా గుర్తింపు తెచ్చుకోవడమే నా ధ్యేయం. ప్రకృతికి సంభందించిన చిత్రాలు వేయడమంటే నాకు చాలా ఇష్టం. 

చరణ్‌ - విద్యార్థి, ఫైన్‌ ఆర్ట్స్‌ స్కూల్‌ మల్కాజిగిరి


logo