ఆదివారం 24 మే 2020
Hyderabad - Feb 26, 2020 , 00:52:28

విద్యార్థులే ఆవిష్కర్తలు

విద్యార్థులే ఆవిష్కర్తలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను, సృజనాత్మకతను వెలికితీయడానికి ‘అగస్త్య’ సంస్థ కృషి చేస్తుంది. ఇందులోభాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులకు మధ్య అనుసంధానాన్ని కల్పిస్తూ పాఠశాల వయసులోనే ఇంజినీరింగ్‌ మేధోసంపత్తిని అందిస్తూ అన్ని విధాలుగా వారిని ప్రోత్సహిస్తున్నారు. తెలుగు రాష్ర్టాలకు చెందిన పలు కార్పొరేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్య అనుసంధానం కల్పిస్తూ ఇద్దరి ఆలోచనలతో సమాజంలోని అనేక సమస్యలకు టెక్నాలజీతో పరిష్కారం కనుగొనే ఆవిష్కరణలకు తోడ్పడుతుంది. ఇందులోభాగంగానే విశ్వేశ్వరయ్య భవన్‌లో ఇంజినీరింగ్‌- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉమ్మడి ప్రాజెక్టులను, నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు. అంతేకాకుండా ఈ ప్రదర్శనలో ఉంచిన అన్ని ఆవిష్కరణలు సాధారణ ప్రజలకు నిత్యజీవితంలో తక్కువ ఖర్చుతో అనేక అవసరాలను తీర్చే ఆవిష్కరణలుగా ఉన్నాయి. ప్రదర్శనలో మొత్తం 35ప్రాజెక్టులను ఉంచారు. వీటన్నిటినీ ఒక ఇంజినీరింగ్‌ విద్యార్థి, ఇద్దరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కలిసి తయారు చేసినవే. మంగళవారం ప్రారంభమైన ప్రదర్శనకు అగస్త్య ఫౌండేషన్‌ ప్రతినిధి కే.త్యాగరాజన్‌, సినోప్సిస్‌ సంస్థ ప్రతినిధులు నరేంద్ర, నరసింహ, మిత్రా ఎనర్జీ వైస్‌ చైర్మన్‌ విక్రమ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు సామాన్యుల నుంచి అన్ని రకాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 


 సందర్శకులను ఆకర్షించిన ప్రదర్శనలు

విద్యార్థులు తయారుచేసిన ప్రతి ఆవిష్కరణ చాలా మం దిని ప్రమాదాల నుంచి కాపాడేందుకు, ప్రకృతిని రక్షించుకునేందుకు, నీటిని సద్వినియోగంగా తక్కువ నీటిని ఉపయోగించుకునే టెక్నాలజీని, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఇం ట్లో అవసరాలకు వస్తువుల తయారీని తెలిపేలా వారి ఆవిష్కరణలు ఉన్నాయి. తక్కువ ధరకు లభించే టెక్నాలాజీని విద్యార్థులు ఎంతో గొప్పగా వినియోగించుకుని ఆవిష్కరణలు తయారు చేశారు. 


అవగాహనతోపాటు ఆసక్తి...

ఈ ప్రాజెక్టుల ఆవిష్కరణలతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో టెక్నికల్‌ విద్యపై ఆసక్తి పెరుగుతుంది. దీనికి తోడు ఎన్నో విజ్ఞ్ఞాన విషయాలను ఇప్పటికే ఇంజినీరింగ్‌ విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల నుంచి తెలుసుకున్నారు విద్యార్థులు. దీంతో భవిష్యత్తులో ఖాళీ సమయాల్లో ఆవిష్కరణలకు వారి సమయాన్ని కేటాయిస్తూ సమయాన్ని వృథాచేయకుండా సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.


అత్యాధునిక హెల్మెట్‌ తయారీ..

సాధారణంగా హెల్మెట్‌ అంటే కేవలం ప్రయాణంలో ఉన్నప్పుడు తలను కాపాడుకునేందుకు మాత్రమే ధరిస్తుంటాం. కానీ విద్యార్థులు అబ్దుల్‌ ముకీత్‌, అబ్రార్‌ ఖాన్‌ స్మార్ట్‌హెల్మెట్‌ను ‘షెల్మెట్‌' పేరిట తయారు చేశా రు. మరింత నాణ్యతతో రూ.3 వేలలోపే తయారు చేసుకునే అవకాశమున్న ఈ హెల్మెట్‌తో చాలా ప్రయోజనాలున్నాయి. దీంతో తాగినప్పుడు హెల్మెట్‌ పెట్టుకుంటే నేరుగా వారి మొబైల్‌ నుంచి తల్లిదండ్రులకు తాగి బండి నడుపుతున్నట్లుగా మెసేజ్‌ వెళ్తుంది. ఏదైనా మలుపు తీసుకున్నప్పుడు హెల్మెట్‌ మీద కూడా దానంతటవే ఆ వైపు సిగ్నల్‌ ఇస్తాయి. దీంతోపాటు బ్రేక్‌ వేసినప్పుడు లైట్‌ వస్తుంది. దీంతో ప్రమాదాలు తక్కువ జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు బండి నడుపుతున్నప్పుడు ఫోన్‌ వస్తే జేబులోంచి ఫోన్‌ తీయాల్సిన పని లేకుండా గూగుల్‌ అసిస్టెంట్‌తో ఫోన్‌ మాట్లాడడం, కంట్రోల్‌ చేయడం వంటివి చేయొచ్చు. దీంతోపాటు ప్రమాదం లో ఉన్నప్పుడు నేరుగా కావాల్సిన వారికి మెసేజ్‌ వెళ్లే సదుపాయం ఉంది.


చిన్నారులు, ముసలివారి రక్షణకు...

చిన్నారులు లేదా ముసలివారు అనుకోని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు చిన్నారులు బోరుబావిలో పడిపోవడం, ఏదైనా గుంతలో పడిపోవడం వంటివి జరిగినప్పుడు వెంటనే వారి బెల్టు లేదా వస్ర్తాల్లో అమర్చిన పరికరంతో వారు ప్రమాదంలో ఉన్న ట్లు తల్లిదండ్రులకు నేరుగా మెసేజ్‌ వెళ్తుంది. దీంతో పాటు వారి లొకేషన్‌ కూడా అందుతుంది. అచ్చు ఇదే పద్ధతిలో ముసలివారు అనుకోకుండా స్పృహకోల్పోయి పడిపోయినా వెంటనే కావాల్సిన వారికి మెసేజ్‌ వెళ్తుం ది. దీంతో వారు ఎక్కడున్నారు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజె క్టును ఇంజినీరింగ్‌ విద్యార్థులు శ్రీరత్న, హారిక, పాఠశాల విద్యార్థులు సయ్యెదామెహర్‌, రోహిణి తయారు చేశారు.


చార్జర్‌ నుంచి మోటార్‌ వరకూ అన్నీ మొబైల్‌తోనే...

కేవలం వెయ్యిరూపాయల నుంచి రూ.2వేలలోనే ఇం ట్లోని వస్తువులన్నీ కంట్రోల్‌ చేయగలిగేలా చిన్న యాప్‌, కొన్ని చిన్నచిన్న చిప్స్‌ను అనుసంధానించి మొబైల్‌తో, గూగుల్‌ అసిస్టెంట్‌సాయంతో నేరుగా ప్రపంచంలో ఎక్క డ నుంచి అయినా వాటిని ఆన్‌ ఆఫ్‌ చేసుకునే రూపకల్పన చేశారు విద్యార్థులు. కళాశాల విద్యార్థులు కుదెర్‌ గజాలా సూఫీ, స్వప్న, సమ్రీన్‌, పాఠశాల విద్యార్థులు సాహిత్య, షజియా ఈ ఆవిష్కరణ చేశారు. 


logo