గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 25, 2020 , 05:06:59

నిమిషాల్లో వెళ్లారు నిండుప్రాణాలు కాపాడారు

నిమిషాల్లో వెళ్లారు నిండుప్రాణాలు కాపాడారు
  • ఆత్మహత్యకు యత్నించిన వారిని ఆఖరుక్షణంలో రక్షించిన రాచకొండ పోలీసులు
  • 55 రోజుల్లో 421 ‘సూసైడ్‌' కాల్స్‌
  • 50 మందికి పైగా బాధితులను పరుగున వెళ్లి కాపాడిన వైనం
  • రాచకొండ పోలీసు కంట్రోల్‌కు.. 55 రోజుల్లో 421 సూసైడ్‌ కాల్స్‌
  • సుమారు 50 మందిని రక్షించిన కాప్స్‌
  • మానిటరింగ్‌కు ప్రత్యేకంగా ఓ ఇన్‌స్పెక్టర్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పోలీసులు రక్షక భటులుగానే కాదు.. ప్రాణదాతలుగానూ నిలుస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా చనిపోతున్నామని ఫోన్‌ చేసి ఆత్మహత్యలకు యత్నిస్తున్న వారిని కాపాడుతూ వారి కుటుంబాలను ఆపద్బాంధవుల్లా ఆదుకుంటున్నారు. జీవితంపై విరక్తి చెందిన వారికి పునర్‌జీవితాన్ని అందిస్తున్నారు.  ఇలా మృత్యువు నుంచి తప్పించుకున్న వారందరూ సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఈ విధంగా అవసరానుగుణంగా పోలీసు సేవలు అందడంతో వందలాది ప్రాణాలు నిలబడుతున్నాయి. వారు బతికి సాధించాల్సిన బాధ్యతను గుర్తు  చేస్తున్నారు.  ఇక వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


8 నిమిషాల్లో సంఘటనాస్థలానికి.. 

రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 24 వరకు దాదాపు 421 సూసైడ్‌ (ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం) ఫోన్‌ కాల్స్‌ పోలీసులకు డయల్‌ 100 ద్వారా అందాయి. ఈ ఫోన్‌ కాల్స్‌ను అందుకున్న పోలీసులు 8 నిమిషాల వ్యవధిలో సంఘటనాస్థలానికి చేరుకొని పోలీసు సేవలను అందించారు. ఇందులో చాలా వరకూ పోలీసులు చివరి నిమిషంలో వెళ్లి సుమారు 50 మంది ప్రాణాలను కాపాడారు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత వచ్చిన సమాచారంతో వెళ్లిన సిబ్బంది ఆ కుటుంబాల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. చివరి నిమిషాల్లో ఉన్న బాధితులకు అధికారులు ఇటీవల సిబ్బందికి అందించిన వైద్య శిక్షణలో ఇచ్చిన చిట్కాలు చాలా ఉపయోగపడుతున్నాయి. ఇలా చేస్తున్న పోలీసులు ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తికి వైద్యుల నుంచి చికిత్స పొందేవరకూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. 


ఆర్థిక ఇబ్బందులు, మానసికంగా కుంగిపోయిన వారు, భార్యాభర్తల గొడవలు, తల్లిదండ్రుల మందలింపులు, ఇలా వివిధ రకాల కారణాలతో చాలా మంది క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నప్పుడు ఆ క్షణం ఎవరు చెప్పినా కేకలు పెట్టినా పట్టించుకోరు. అలాంటి సమయంలో వారి కుటుంబ సభ్యులకు గుర్తుకు వచ్చేది పోలీసులే...జస్ట్‌ డయల్‌ 100కు ఫోన్‌ చేయగానే నిమిషాల్లో పోలీసులు చేరుకోవడంతో చాలా మంది ప్రాణాలు నిలబడుతున్నాయి. ఇందులో కొంత మంది నేరుగా పోలీసులకే ఫోన్‌ చేసి సార్‌ నా చావుకు ఎవరు కారణం కాదు నేను చనిపోతున్నానని  ఫోన్‌ చేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి సమాచారాన్ని పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా లొకేషన్‌ను తెలుసుకుని అత్యంత వేగంగా అక్కడికి చేరుకుని వారిని కాపాడిన సందర్భాలున్నాయి.


రాచకొండ పోలీసు కంట్రోల్‌ రూమ్‌..

డయల్‌ 100 ద్వారా మెయిన్‌ కంట్రోల్‌కు రాగానే ఆ పరిధిని బట్టి నిమిషం వ్యవధిలో కాల్‌  ఆ పోలీసు కమిషనరేట్‌ కంట్రోల్‌కు చేరుకుంటుంది. అయితే రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ పర్యవేక్షణలో రాచకొండ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది ప్రత్యేక మానిటరింగ్‌ నిర్వహిస్తున్నారు. దీని కోసం మూడు షిఫ్టుల్లో 25 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి ఫోన్‌ కాల్స్‌ పెట్రోల్‌ మొబైల్‌, బ్లూ కోల్ట్స్‌ సిబ్బంది ఎంతసమయంలో ఫోన్‌ వచ్చిన ప్రాంతానికి చేరుకుంటున్నారని గమనిస్తారు. ఇలా ఆలస్యం చేసినా, పట్టించుకోకపోయినా సిబ్బంది ట్రాక్‌ మొత్తం కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లోని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తమై ఉంటుంది. అంతే కాకుండా ఫోన్‌లు చేసే వ్యక్తి లొకేషన్‌ పోలీసులకు సాంకేతిక పరిజ్ఞాణంతో తెలిసిపోతుంది. ఈ సమాచారంతో పోలీసులు 8 నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకుంటారు. ఈ కమాండ్‌ కంట్రోల్‌ మానిటరింగ్‌కు ప్రత్యేకంగా సీపీ మహేశ్‌భగవత్‌ ఓ ఇన్‌స్పెక్టర్‌ను కూడా నియమించారు.

   

ఈ ఏడాది రెండు నెలలకు సంబంధించిన సూసైడ్‌ ఫోన్‌ కాల్స్‌ పరిశీలిస్తే.. సమాచారం అందుకున్న తర్వాత మా పోలీసు సిబ్బంది పోయి కాపాడుతున్న ప్రాణాలు వందల్లో ఉంటాయి. ఈ సారి వచ్చిన 421 సూసైడ్‌ ఫోన్‌ కాల్స్‌లో దాదాపు అత్యధిక మందిని పోలీసులు చివరి నిమిషంలో అక్కడికి వెళ్ళి వారు చనిపోకుండా ఆత్మహత్యను నివారించగలిగారు. మెయిన్‌ కంట్రోల్‌ నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌కు సిబ్బంది ఎంత సమయంలో స్పందిస్తున్నారు.. వారు ఇతర అత్యవసర సేవల్లో ఉంటే తిరిగి ఆ ఫోన్‌ కాల్‌కు సిబ్బంది వెళ్ళేలా చర్యలు తీసుకుంటాం. ఆత్మహత్యకు యత్నిస్తున్న  వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో చాలా మంది ఇప్పడు సంతోషంగా గడుపుతున్నారు.

-రవికుమార్‌, ఇన్‌స్పెక్టర్‌, రాచకొండ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌


logo
>>>>>>