మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Feb 25, 2020 , 04:53:59

నెటిజన్ల సృజన.. యూజర్ల ఆదరణ

నెటిజన్ల సృజన.. యూజర్ల ఆదరణ
  • ప్రముఖుల ఫొటోలతో ఆకట్టుకునే మీమ్స్‌
  • నవ్వించేవి కొన్నైతే.. ఆలోచింపజేసేవి మరికొన్ని
  • అప్పుడప్పుడు అదుపుతప్పుతున్న వైనం
  • జాగ్రత్తలు పాటించకపోతే చర్యలు
  • ఎన్నికల నుంచి అవగాహన కార్యక్రమాల వరకు ప్రత్యేకం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మీమ్స్‌ కల్చర్‌.. ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. సోషల్‌ మీడియాలో చలోక్తులన్నీ మీమ్స్‌ రూపంలో పేలుతున్నాయి. ఫొటోపై క్యాప్షన్స్‌ రాస్తూ, కౌంటర్‌లు జతచేస్తూ నెటిజన్లు పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. కడుపుబ్బ నవ్వించే హాస్యపు మీమ్స్‌ విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌లో మీమ్స్‌కు భలే క్రేజ్‌ పెరుగుతోంది. ఏదైన అంశం జరిగినప్పుడు దానిపై నెటిజన్లు తమ క్రియేటివిటీని మీమ్స్‌ రూపంలో పంచుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం నుంచి మొదలు వ్యాధులపై అవగాహన వరకు మీమ్స్‌నే వేదికగా చేసుకుంటున్నారు. 


మీమ్స్‌  అంత తేలిక కాదు..!!

మీమ్స్‌ రూపొందించాలంటే ఎంతో క్రియేటివిటి ఉంటే గానీ సాధ్యం కాదు. ప్రస్తుతం జరిగిన సంఘటనల ఆధారంగా డైలాగులు రాయాల్సి ఉంటుంది. వాటికి కౌంటర్‌లు చెప్పాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన హావభావాలు కలిసేలా ఫొటోలను ఎంచుకోవాలి. మీమ్స్‌ను చూస్తే చాలు కరెక్ట్‌గా సరిపోయిందని భావించేలా నెటిజన్లు ప్రతిభ చూపిస్తున్నారు. ఎక్కువగా సినిమా, రాజకీయ వ్యక్తుల ఫొటోలు తీసుకొని మీమ్స్‌ చేస్తున్నారు. అవసరమైతే రాజకీయ నాయకులు వివిధ సందర్భాల్లో ప్రదర్శించిన హావభావాలను తెలిపే ఫొటోలను  తీసుకుని వారికి అనుగుణంగా మార్చుకుంటున్నారు. సోషల్‌ మీడియాలోని మీమ్స్‌ లక్షల్లో షేర్‌ అవుతున్నాయి. వాటిని పొలిటికల్‌, సినీ ప్రముఖులు కూడా ఎంజాయ్‌ చేస్తున్నారు.  


అప్రమత్తత అవసరం..!!

మీమ్స్‌ కొన్ని సందర్భాల్లో విమర్శలను గుప్పిస్తుండటం కొంత మంది మనోభావాలకు ఆటంకంగా ఉన్నాయని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. సోషల్‌ మీడియాలో ఎవరి గురించైనా రాసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రాజకీయ నాయకుల ఫొటోలు వాడుతూ.. చిలిపి డైలాగులు రాస్తూ.. పోస్టులు చేసే వారిపై పోలీసులు  చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.  ముఖ్యంగా సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు.. వాటి ఆధారంగా మీమ్స్‌ రూపొందించేటప్పుడూ అప్రమత్తంగా ఉండటం మంచిది. హాస్యం శృతి మించితే కలిగే దుష్పరిణామాలతో నెటిజన్లు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 


సినీ ఫంక్షన్‌లో మీమ్స్‌ ప్రదర్శన..!!

ఒకప్పుడు పుంఖానుపుంఖాలుగా  రాస్తేగానీ తెలియని విషయాలను మీమ్స్‌ కల్చర్‌ వచ్చాక కొన్ని ఫొటోలు వినియోగించి.. చిన్న డైలాగులతో అందరికి అర్థం అయ్యేలా చెప్పడం నెటిజన్ల అద్భుత క్రియేటివిటీకి నిదర్శనమని సినీ ప్రముఖులు సైతం తమ ఆడియో ఫంక్షన్‌లలో చెబుతున్నారు. సినిమాలకు సంబంధించి హీరో, విలన్‌ల మధ్య జరిగే సంభాషణలను పక్కకు పెట్టి తమ క్రియేటివిటీ డైలాగులను వాడుతూ హాస్యాన్ని పండిస్తున్నారు. సదరు  మీమ్స్‌ను ఆడియో ఫంక్షన్‌లలో సైతం ప్రదర్శిస్తున్నారంటే వాటికున్న క్రేజ్‌ అర్థం చేసుకోవచ్చు.


logo
>>>>>>