బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 24, 2020 , 01:52:43

రూ.117.25కోట్లతో టెర్మినల్‌ పనులు

రూ.117.25కోట్లతో టెర్మినల్‌ పనులు
  • చర్లపల్లి శాటిలైట్‌ టెర్మినల్‌ నిర్మాణానికి టెండర్లు ఖరారు
  • త్వరలో పనులు ప్రారంభం !
  • ఇక్కడ నుంచే ప్రైవేట్‌ రైళ్ల ఆపరేటింగ్‌

చర్లపల్లిలో రూ.117.25 కోట్లతో శాటిలైట్‌ టెర్మినల్‌ నిర్మాణ పనులకు టెండర్లు ఖరారయ్యాయి. దీన్ని రెండు దశల్లో నిర్మించనున్నారు. ఫేజ్‌-1లో రూ.54.58 కోట్లతో, రెండో దశలో రూ.62.67 కోట్లతో పనులు చేయనున్నారు. నూతనంగా రైల్వే ప్రవేశపెట్టనున్న ప్రైవేట్‌ రైళ్లను కూడా ఇక్కడి నుంచే ఆపరేట్‌ చేయనున్నారు. ఎంఎంటీఎస్‌ రెండోదశ విస్తరణలో భాగంగా ఘట్‌కేసర్‌, సనత్‌నగర్‌, యాదాద్రి వరకు సబర్బన్‌ రైళ్లు నడువనుండటంతో ఈ టెర్మినల్‌లో దిగిన ప్రయాణికులు వీటి ద్వారా నగరంలోని ఇతర ప్రాంతాలకు చేరుకోవచ్చు. ఈ శాటిలైట్‌ టెర్మినల్‌ కోసం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.5 కోట్లు కేటాయించారు.  -సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగర రైల్వే స్టేషన్లపై రద్దీ భారం తగ్గనున్నది. నగరంలోని సికింద్రాబాద్‌, కాచిగూడ, హైదరాబాద్‌ రైల్వే స్టేషన్లలో రైళ్లు, ప్రయాణికుల భారం పడకుండా నిర్మించ తలపెట్టిన శాటిలైట్‌ రైల్వే టెర్మినల్స్‌లో చర్లపల్లి ముందుగా అందుబాటులోకి రానున్నది. దీనికోసం ఇప్పటికే టెండర్లు ఖరారయ్యాయి. రూ.221 కోట్లతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో రైల్వే బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా ఈ టెర్మినల్‌ నిర్మించడానికి భూసేకరణ ఇబ్బందిగా మారింది. 200 ఎకరాల్లో నిర్మించాలని ప్రతిపాదించినప్పటికీ కేవలం 50 ఎకరాల భూమి మాత్రమే సేకరించడం పూర్తయింది. భూసేకరణ క్లిష్టతరం కావడంతో సేకరించిన భూమిలోనే స్టేషన్‌ను పూర్తి చేయాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ఇందుకుగాను రూ.117.25 కోట్ల విలువైన పనులకు సంబంధించి టెండర్లు ఫైనల్‌ చేసింది. దీనివల్ల భాగ్యనగర ప్రజలకు రవాణా సౌకర్యం మరింత దగ్గర కానున్నది. 


హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలకు తూర్పున నిర్మించే చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ వల్ల మరింత లాభం జరుగనున్నది. ఇప్పటికే సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లకు వచ్చే రైళ్ల రాకపోకల వల్ల మూడు స్టేషన్లకు ఇబ్బంది ఎదురవుతున్నది. దీనిని దృష్టిలో ఉంచుకుని పడమర ప్రాంతంలో ఉండే లింగంపల్లి స్టేషన్‌ను రూ.30కోట్లతో అభివృద్ధి చేసి లింగంపల్లి స్టేషన్‌ నుంచి కొన్ని రైళ్లను నడిపిస్తున్నారు. చర్లపల్లి శాటిలైట్‌ టెర్మినల్‌ స్టేషన్‌ అభివృద్ధి పనులను రెండు దశలుగా చేపట్టనున్నారు. వీటికి టెండర్లు కూడా ఫైనల్‌ చేశారు. ఫేజ్‌-1లో భాగంగా రూ.54.58 కోట్ల పనులు, రెండో దశలో రూ.62.67 కోట్లతో పనులు చేపట్టనున్నారు. రెండు సంవత్సరాల కాల పరిమితితో రెండు దశలు పూర్తి చేసి అందుబాటులోకి తేనున్నారు.


అవుటర్‌రింగ్‌ రోడ్డుకు సమీపంలో..

అవుటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ వస్తుండడంతో పబ్లిక్‌, ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌కు సులువుగా ఉండనున్నది. కేవలం అవుటర్‌ రింగ్‌రోడ్డుకు 8 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తుండడంతో అవుటర్‌ మీదుగా నగరంలోని ఏ ప్రాంతానికైనా చేరుకునే సదుపాయం ఉంటుంది. అయితే చాలా రైళ్లను ఇక్కడి నుంచే ఆపరేట్‌ చేసేందుకు రైల్వే నిర్ణయించింది. అదేవిధంగా కొత్తగా భారతీయ రైల్వే ప్రవేశపెట్టనున్న ప్రైవేటు రైళ్లను కూడా ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ర్టాలకు ఆపరేట్‌ చేయనున్నారు. ఎంఎంటీఎస్‌ రెండోదశ విస్తరణలో భాగంగా ఘట్‌కేసర్‌, సనత్‌నగర్‌, యాదాద్రి వరకు సబర్బన్‌ రైళ్లు నడువనుండడంతో ఈ టెర్మినల్‌లో దిగిన ప్రయాణికులకు సబర్బన్‌ రైళ్ల ద్వారా నగరంలోని ఇతర ప్రాంతాలకు చేరుకోవచ్చు. ఈ శాటిలైట్‌ టెర్మినల్‌ కోసం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.5 కోట్లు కేటాయించారు.


రెండు దశల్లో స్టేషన్‌ అభివృద్ధి


మొదటి దశలో రూ.54.58 కోట్లతో పనులు

  • రెండు హైలెవెల్‌ ప్లాట్‌ఫారాలు
  • అన్ని ప్లాట్‌ఫారాలకు వాటర్‌ అరెంజ్‌మెంట్స్‌
  • 4 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌
  • సీవరేజీ పైప్‌లైన్ల నిర్మాణం, కాంక్రీట్‌ ఆప్రాన్‌
  • సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ రెండో దశలో రూ.62.67 కోట్ల పనులు
  • కొత్త రైల్వే స్టేషన్‌ భవన నిర్మాణం
  • పరిసర ప్రాంతాల అభివృద్ధి
  • సీసీ రోడ్ల నిర్మాణం
  • ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్‌
  • మెయింటెనెన్స్‌ షెడ్‌
  • రెండు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి(ఎప్‌ఓబీ)ల నిర్మాణం
  • ఐదు ఎస్కలేటర్లు, తొమ్మిది లిఫ్టులు
  • నాలుగు పిట్‌లైన్లు, బయో టాయిలెట్‌ షెడ్‌
  • 2 వేల చదరపు మీటర్ల బూట్‌ స్పేస్‌


logo
>>>>>>