గురువారం 09 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 23, 2020 , 00:24:30

యాచక రహితంగా..

యాచక రహితంగా..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: త్వరలోనే బెగ్గర్‌ ఫ్రీ సిటీగా మారనున్నది. ఈ మేరకు నగరాన్ని యాచక రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌ను ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. యాచకులకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పించి వారు ఆర్థిక స్వావలంభన సాధించే దిశగా తగిన చర్యలు తీసుకోనున్నట్లు  ఆయన వెల్లడించారు. వారి ఉత్పత్తులకు మార్కెట్‌తో అనుసంధానం చేయడమే కాకుండా వారికి పునరావాసం కల్పిస్తామని చెప్పారు. టూరిజం ప్లాజాలో శనివారం జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖల అధికారులతో పాటు ఎన్జీవోలు సంయుక్తంగా యాచకుల పునరావాసంపై సదస్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పది నగరాలను భిక్షాటన రహితంగా తీర్చిదిద్దేందుకు పైలెట్‌ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు, దీనికి అవసరమైన కార్యప్రణాళికను సిద్ధం చేశామన్నారు. యాచకుల పునరావాసానికి కేంద్రం రూ. 10కోట్లు విడుదల చేస్తుందన్నారు. తాను 25 ఏండ్ల కిందట హైదరాబాద్‌ కలెక్టర్‌గా పనిచేశానని, అప్పట్లో ఇక్కడ మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉండేదని, నేడు ఉత్తమ నగరంగా గుర్తింపు పొందినట్లు ప్రశంసించారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రశంసించారు. 


ప్రత్యేక దృష్టి....

యాచకవృత్తిలో ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు, పిల్లల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సంయుక్త కార్యదర్శి రాధికా చక్రవర్తి తెలిపారు. ఇందుకు అనుగుణంగా యాచకుల గుర్తింపునకు సమగ్ర వివరాలతో సర్వే నిర్వహించాలని సూచించారు. యాచకుల గుర్తింపు, మొబలైజేషన్‌, షెల్టర్‌ హోమ్‌ల ఏర్పాటు, పునరావాసం, ఆరోగ్యం,  పిల్లల విద్య, వృత్తి నైపుణ్య శిక్షణ తదితర అంశాలను కార్యాచరణలో పొందుపర్చాలని సూచించారు. 


యాచకుల సంక్షేమానికి..

రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ మాట్లాడుతూ, యాచకులకు ఇప్పటికే నైట్‌ షెల్టర్‌లను ఏర్పాటుచేసినట్లు, అంతేకాకుండా వారికోసం నైపుణ్య శిక్షణ చర్యలు,సామాజిక బాధ్యత పథకాలను అమలుచేస్తున్నామని తెలిపారు. ఐదు రూపాయల అన్నపూర్ణ పథకం కూడా వారికి ఎంతో ఉపయోగపడుతున్నట్లు చెప్పారు. డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ మాట్లాడుతూ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆశయాలమేరకు యాచకుల సంక్షేమం, పునరావాసానికి జీహెచ్‌ఎంసీ కృషి చేస్తున్నదని చెప్పారు. రంగారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్‌ హరీశ్‌తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. 


logo