బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 23, 2020 , 00:16:55

నిమ్స్‌ ప్రొఫెసర్లకు వయోపరిమితి పెంచాలి

నిమ్స్‌ ప్రొఫెసర్లకు వయోపరిమితి పెంచాలి

ఖైరతాబాద్‌: దేశంలోనే అత్యుత్తమ దవాఖానాల్లో ఒకటిగా నిలిచిన నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల వయోపరిమితి పెంచాలని రెసిడెంట్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి బృందం శనివారం మంత్రి ఈటల రాజేందర్‌కు వినతి పత్రం సమర్పించారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌, యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్‌ రాహుల్‌ వయో పరిమితి పెంపు ఆవశ్యకతను మంత్రికి వివరించారు. దేశానికి అత్యుత్తమ వైద్యులను అందిస్తున్న ఇనిస్టిట్యూట్‌ల్లో నిమ్స్‌ ఒక్కటని,  ఎందరో సీనియర్‌ ప్రొఫెసర్లు వైద్య విద్యార్థులను తయారు చేస్తూ సమాజాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో నిమ్స్‌ ఆధునికతను సంతరించుకుందని, స్వయంప్రతిపత్తి కలిగిన ఇనిస్టిట్యూట్‌గా కొనసాగుతున్న నిమ్స్‌ దేశంలోనే అత్యధిక సూపర్‌ స్పెషాలిటీ పోస్టు గ్రాడ్యూయేట్స్‌ సీట్లు కేటాయించిన ఘనత సొంతం చేసుకుందన్నారు. దీ వీక్‌ మ్యాగజైన్‌ సర్వేలో సైతం నిమ్స్‌ దేశంలో నాలుగో ఉత్తమ ప్రభుత్వ వైద్య సంస్థగా ఖ్యాతి పొందిందన్నారు.  


ప్రతి ఏడాది 120కి ట్రాన్స్‌ప్లాంటేషన్లు జరుగుతాయని తెలిపారు. నిమ్స్‌లో సీనియర్‌ ప్రొఫెసర్ల సేవలు ఎంతో అవసరమని, ప్రస్తుతం 60 ఏండ్లకు చాలా మంది విరమణ పొందే అవకాశం ఉందని, దీంతో వారితో పాటు రోగులు ఎంతో నష్టపోతారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వైద్య రంగంలో నూతన సవరణ చట్టంలో ఇలాంటి ఇనిస్టిట్యూట్‌లలో పనిచేసే ప్రొఫెసర్ల వయో పరిమితి 60 నుంచి 65 పెంచిందని, అందులో అటానమస్‌, సెమీ అటనమస్‌, ప్రభుత్వ వైద్యశాలలకు వర్తించేలా  జీవో జారీ చేసిందన్నారు.  దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఇది అమలవుతున్నదని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ బిల్లు పెట్టి పాస్‌ చేశారని, ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ దవాఖానాలో అమలులో ఉందని, నిమ్స్‌లో కూడా అమలయ్యే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.logo
>>>>>>