శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 23, 2020 , 00:16:55

ఆదా..ఆదాయం..

ఆదా..ఆదాయం..

కంటోన్మెంట్‌: మార్కెట్‌లో వ్యర్థాలను వృథా చేయకుండా చక్కని ఆలోచన చేసింది తెలంగాణ మార్కెటింగ్‌ శాఖ. కరెంటు ఆదా.. ఆదాయం పెంచుకునేందుకు సరికొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తుల వ్యర్థాలను నిర్వీర్యం చేసి కరెంట్‌ను ఉత్పత్తిని చేసేందుకు మన బోయిన్‌పల్లి మార్కెట్‌లో దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో బయోగ్యాస్‌ ప్లాంట్‌ను నిర్మిస్తున్నది. మార్కెట్‌లో పోగైన వ్యర్థాలను సేకరించి, ప్లాంట్‌లో వేసినట్లయితే బయోగ్యాస్‌, బయో మాన్యూర్‌(ద్రవ ఎరువు) ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల కరెంట్‌ ఆదా అవ్వడంతో పాటు మార్కెట్‌కు  ఆదాయం రానుందని అధికారులు పేర్కొంటున్నారు. 


పెద్ద మార్కెట్‌...

రాష్ట్రంలో 78 కూరగాయల మార్కెట్లు ఉండగా, అందులో బోయిన్‌పల్లిలోని వ్యవసాయ మార్కెట్‌ అతిపెద్దది. ఇక్కడ ప్రతిరోజూ 8 నుంచి 12 టన్నుల కూరగాయల వ్యర్థాలు పోగవుతున్నాయి. జీఎచ్‌ఎంసీకి చెందిన కాంట్రాక్టర్లు సేకరించి ..జవహార్‌నగర్‌ లో ల్యాండ్‌ ఫిల్లింగ్‌ కు ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం కాంట్రాక్ట్‌ర్లకు రూ. 30 లక్షల నుంచి రూ.  40 లక్షల రూపాయలు నెల నెలా మార్కెటింగ్‌ శాఖ చెల్లిస్తున్నది.ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించే అవసరం లేకుండా, మార్కెట్‌ యార్డు కమిటీ అధికారులు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ సంస్థ సహకారంతో ఒక వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. వ్యర్థాల ద్వారా విద్యుత్‌  ఉత్పత్తి చేసే అన్‌ఏరోబిక్‌ గ్యాస్‌ లిఫ్ట్‌ రియాక్టర్‌(ఏజీఆర్‌)టెక్నాలజీ విధానం ఐదేండ్లలో విజయవంతంగా నడుస్తున్నది. దీనిని బోయిన్‌పల్లి మార్కెట్‌ యార్డులో కూడా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా బయోగ్యాస్‌ ప్లాంట్‌ ను ఏర్పాటు చేశారు. మార్కెట్‌లో ప్రతిరోజూ 10 టన్నుల కూరగాయల వ్యర్థాల ద్వారా 1000 క్యూబిక్‌ మీటర్ల బయోగ్యాస్‌, 6వేల లీటర్ల లిక్విడ్‌ బయో మన్యూర్‌ను తయారు చేసే ప్లాంట్‌ను ఇక్కడ నెలకొల్పారు. 


ప్రతిరోజూ 1000 యూనిట్లు...

బోయిన్‌పల్లి మార్కెట్‌లో ప్రతి రోజూ 1000 యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తున్నారు. యూనిట్‌కు రూ.10 చొప్పున పరిగణించినట్లయితే ప్రతి రోజూ రూ.10వేల వరకు కరెంట్‌  బిల్లులను చెల్లించాల్సి వస్తున్నది. కొత్తగా ఏర్పాటు చేసిన బయోగాస్‌ ప్లాంట్‌ వల్ల ఉత్పత్తిని అయ్యే విద్యుత్‌ను వినియోగించినట్లయితే మార్కెట్‌ కమిటీకి నెలకు రూ.3 లక్షల చొప్పున బిల్లుల రూపంలో డబ్బులు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కరెంట్‌ ఉత్పత్తితోపాటు లిక్విడ్‌ బయో మాన్యూర్‌ను లీటర్‌కు పది పైసల చొప్పున రైతులకు విక్రయించడం ద్వారా రోజుకు రూ.600ల చొప్పున ఆదాయం కూడా లభిస్తుంది. ఈ లెక్కన బోయిన్‌పల్లి మార్కెట్‌ యార్డులో వ్యర్థాలను వృథా చేయకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, వాడుకోవడంతోపాటు లిక్విడ్‌ మాన్యూర్‌(ద్రవ ఎరువు)ను విక్రయించడం ద్వారా ఏడాదికి రూ.34.50 లక్షలను ఆదాయం సమాకూర్చుకోవచ్చు.  


బయో గ్యాస్‌ వల్ల కలిగే ప్రయోజనాలు...

  • ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం వల్ల మార్కెట్‌ యార్డులో పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండడంతో పాటు స్వచ్ఛ భారత్‌ మిషన్‌ లక్ష్యాలను చేరుకుంటుంది. 
  • ఈ బయో గ్యాస్‌ ప్లాంట్‌ నుంచి విడుదలయ్యే బయో మాన్యూర్‌ లిక్విడ్‌ వల్ల బయో ఎరువులాగా వాడుకునేందుకు వాటిని విక్రయించవచ్చు.
  • మార్కెట్‌ యార్డులో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించడం ద్వారా  ఆహ్లాదరకరమైన వాతావరణం ఏర్పడుతుంది.  అక్కడ పని చేసే ఉద్యోగులు, మార్కెట్‌కు వచ్చే ప్రజలు ఉల్లాసంగా ఉంటారు. 


ఎంతో మేలు..

ఈ ప్లాంట్‌ వల్ల మార్కెట్‌కు ఎంతో మేలు జరుగుతున్నది. కరెంట్‌, రవాణా బిల్లులు ఆదా అవుతాయి. వ్యర్థాలను నిర్వీర్యం చేయడం వల్ల మార్కెట్‌కు ఆదాయం సమాకూరుతున్నది. రైతులకు ఎరువు మిశ్రమాన్ని కూడా అందించే వీలుంది. మార్కెట్‌లో ఎక్కడ చెత్త కన్పించకుండా క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా తీర్చిదిద్దే అవకాశం ఉంది. త్వరలోనే ప్లాంట్‌ను ప్రారంభించబోతున్నాం. ఇప్పటికే ఈ ప్లాంట్‌ను మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి తదితరులు కూరగాయల వ్యర్థాల నిర్వీర్యాన్ని పరిశీలించి వెళ్లారు.

  -టి.ఎన్‌.శ్రీనివాస్‌, బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ 


logo