మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Feb 22, 2020 , 03:26:03

క్రీడల్లో పిడుగులు చదువులో ఆణిముత్యాలు

క్రీడల్లో పిడుగులు చదువులో ఆణిముత్యాలు

పేదింటి బిడ్డలకు ఉన్నత, నాణ్యమైన చదువులు చెబుతున్న సరస్వతీ నిలయమది. దశాబ్దాలుగా ఇక్కడ చదువుకున్న ఎందరో ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా, ఇంజినీర్లు, డాక్టర్లుగా, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, లెక్కరర్లు, ప్రొఫెసర్లుగా స్థిరపడిన ఘన చరిత్ర ఉన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత సర్కారు బడులకు మహర్దశ పట్టింది. రాష్ట్రంలోని అనేక పాఠశాలలు, కళాశాలలు ఆధునిక విద్యాలయాలుగా అవతరించాయి. గత గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ దంపతుల చొరవతో చారిత్రక రాజ్‌భవన్‌ హైస్కూల్‌ సైతం ఆ కోవలోనే అన్ని హంగులతో రూపుదిద్దుకున్నది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ బడులతో పోల్చుకుంటే నాణ్యమైన, సంస్కారవంతమైన విద్యను ఉచితంగా అందిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. గత విద్యా సంవత్సరం రాజ్‌భవన్‌ హైస్కూల్‌లో పదో తరగతిలో విద్యార్థులు రికార్డు స్థాయిలో మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాల ఎందులోనూ తీసిపోదని నిరూపించారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడా రంగంలోనూ రాణిస్తున్నారు. వివిధ క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పతకాల పంట పండిస్తూ దేశంలోనే ఓ ఆదర్శవంతమైన పాఠశాలగా రాజ్‌భవన్‌ హైస్కూల్‌ను నిలుపుతున్నారు. (ఖైరతాబాద్‌ - పగడాల అరుణ్‌కుమార్‌)


జాతీయస్థాయి త్రోబాల్‌లో రాణిస్తున్న మేస్త్రీ కొడుకు.. 

తండ్రి భవన నిర్మాణ కార్మికుడు..కుమారుడు జాతీయ స్థాయి క్రీడాకారుడు. మేస్త్రీ పనులు చేస్తేనే పూటగడుస్తున్నది. తల్లి సైతం ఇంటికి పరిమితం కాకుండా కూలీ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నది. అలాంటి కుటుంబంలో జన్మించిన ఆ బాలుడు జాతీయ స్థాయి త్రోబాల్‌ పోటీల్లో రాణిస్తూ తల్లిదండ్రులకు, తాను చదువుతున్న రాజ్‌భవన్‌ హైస్కూల్‌కు వన్నె తీసుకువస్తున్నాడు. ఎంఎస్‌ మక్తాకు చెందిన అనెం లాలప్ప, యాదమ్మల కుమారుడు ఆంజనేయులు రాజ్‌భవన్‌ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. చదువుపై శ్రద్ధ పెడుతూనే కోచ్‌ పీర్‌కొండ శిక్షణలో ప్రతి రోజు మూడు గంటలపాటు సాధన చేసి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు పేదరికాన్ని మరిచిపోయి ముందుకు సాగుతున్నాడు. అండర్‌-17 విభాగంలో జోనల్‌, జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయిలో రాణించి 2019 అక్టోబర్‌ 8న కేరళ రాష్ట్రంలోని కొచీలో జరిగిన జాతీయస్థాయి త్రోబాల్‌ పోటీల్లో పాలుపంచుకున్నాడు. అదే సంవత్సరం డిసెంబర్‌లో వరంగల్‌ జిల్లాలో తెలంగాణ త్రోబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో తన ప్రతిభను చాటాడు. తాజాగా, ఈ ఏడాది జనవరి 12 నుంచి 16వ  తేదీల్లో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన 65వ జాతీయ స్కూల్‌ గేమ్‌ త్రోబాల్‌ పోటీల్లో తెలంగాణ తరఫున ఆంజనేయులు పాల్గొని తన సత్తా చాటాడు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చోటు సంపాధించాలన్నది తన జీవితాశయమని ఆంజనేయులు చెబుతున్నాడు. 


తండ్రి స్వచ్ఛ ఆటో డ్రైవర్‌...తల్లి స్వీపర్‌

ఆ బాలుడి తండ్రి వి.హన్మంతు నగరంలో స్వచ్ఛత నెలకొల్పే ఆటో టిప్పర్‌ డ్రైవర్‌. తల్లి రామాంజినమ్మ జీహెచ్‌ఎంసీలో పారిశుధ్య కార్మికురాలు. నిత్యం రహదారులు, కాలనీల్లో సంచరిస్తూ జీవనయానం సాగిస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ దంపతుల కుమారుడు భవానీ ప్రసాద్‌ రాజ్‌భవన్‌ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటుతున్నాడు. పశ్చిమ దేశాల్లో ప్రాచుర్యం పొందిన బేస్‌ బాల్‌పై మక్కువ పెంచుకొని ఆ క్రీడలో విశేషంగా రాణించాడు. కోచ్‌ షకీల్‌ ప్రతి రోజు రాజ్‌భవన్‌ స్కూల్‌లో ఉదయం 5.30 నుంచి 7.30గంటల వరకు బేస్‌బాల్‌లో శిక్షణ ఇస్తూ ఆ విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీశాడు. ఫలితంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించి జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగాడు. ఈ ఏడాది జనవరి 26 నుంచి 31వ తేదీల్లో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి బేస్‌బాల్‌ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున ఆడి తన సత్తాను నిరూపించాడు. 


పట్టుదలతో త్రోబాల్‌లో శిక్షణ..

ఆ చిన్నారి తండ్రి ఓ ప్రైవేట్‌ దవాఖానలో వార్డు బాయ్‌. తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నది. అయినా మొక్కవోని పట్టుదల ఆమె సొంతం. పేదరికం ఉన్నా చదువుకుంటూనే క్రీడా పోటీల్లో చురుకుగా రాణిస్తోంది. ఎంఎస్‌ మక్తాకు చెందిన జి.రమేశ్‌ ఓ ప్రైవేట్‌ దవాఖానలో వార్డు బాయ్‌గా పని చేస్తున్నాడు. తల్లి హేమ ఓ ప్రమాదం వల్ల రెండు కాళ్లు పనిచేయకపోవడంతో ఇంటికే పరిమితమైంది. వారి కుమార్తె శైలు రాజ్‌భవన్‌ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నది. విద్యతోపాటు త్రోబాల్‌లో శిక్షణ తీసుకుంటూ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటుకున్నది. శ్రద్ధతో ఏ విద్యను నేర్చుకున్నా రాణిస్తామని తన ఫిజికల్‌ డైరెక్టర్‌ పీర్‌కొండ అన్న మాటలు తనలో స్ఫూర్తి నింపాయని, జాతీయ స్థాయిలో ఆడి పతకాలు సాధిస్తానని, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువస్తానని శైలు తన ఆశయాన్ని వివరించింది. 


logo
>>>>>>