మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Feb 22, 2020 , 03:23:07

యాదాద్రికి ‘అఖండ జ్యోతి’

యాదాద్రికి ‘అఖండ జ్యోతి’

కాచిగూడ, ఫిబ్రవరి 21: హిందూ మతానికి ప్రతీకగా అఖండ జ్యోతి రథయాత్ర నిలుస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా బర్కత్‌పురలోని యాదాద్రి భవన్‌ వద్ద శ్రీ లక్ష్మీనరసింహస్వామి అఖండ జ్యోతి ప్రచార యాత్రను ఎమ్మెల్యే  వెంకటేశ్‌, గోల్నాక కార్పొరేటర్‌ కాలేరు పద్మ, యాదగిరిగుట్ట ఈవో ఎన్‌.గీతారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సహకారంతో అఖండ జ్యోతి యాత్ర కమిటీ ఆధ్వర్యంలో మహా శివరాత్రిని పురస్కరించుకుని గత 26 సంవత్సరాలుగా ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అఖండ జ్యోతి రథయాత్ర 24వ తేదీన యాదగిరిగుట్ట దేవస్థానానికి చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ కార్పొరేటర్‌ ఎక్కాల చైతన్యకన్నా, దైవజ్ఞశర్మ, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఎక్కాల కన్నా, యాదాద్రి డెవలప్‌మెంట్‌ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, యాదాద్రి ప్రధాన అర్చకులు నర్సింహాచార్యులు, యాదాద్రి ఫౌండర్‌ ఫ్యామిలీ ట్రస్ట్‌ నరసింహమూర్త్తి, గౌరవ అధ్యక్షుడు బి.యాదయ్య, అధ్యక్షుడు చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.

రాయగిరిలో నిమజ్జనం

బర్కత్‌పురలోని యాదాద్రిభవన్‌ నుంచి ప్రారంభమైన అఖండ జ్యోతి రథయాత్ర వైఎంసీఏ, నారాయణగూడ, చిక్కడపల్లి, రాజ్‌కమల్‌ చౌరస్తా, గోల్కొండ చౌరస్తా, రాజాడీలక్స్‌, జమిస్తాన్‌పూర్‌, రాంనగర్‌ చౌరస్తా, శివంరోడ్డు, అంబర్‌పేట, రామంతాపూర్‌, హబ్సిగూడ, ఉప్పల్‌ చౌరస్తా వరకు సాగుతుంది. 22న ఉప్పల్‌ చౌరస్తా నుంచి బయలుదేరి ఉప్పల్‌డిపో, మేడిపల్లి, ఘట్‌కేసర్‌ వరకు చేరుకుంటుంది. 23న ఘట్‌కేసర్‌ నుంచి ప్రారంభమై బీబీనగర్‌, పగిడిపల్లి, రేణుకా ఎల్లమ్మ దేవాలయం, భువనగిరికి చేరుకుంటుంది. 24న భువనగిరి నుంచి రాయగిరి మీదుగా రాత్రి 7 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటుందని యాదగిరిగుట్ట కార్యనిర్వాహక అధికారి ఎన్‌.గీతారెడ్డి తెలిపారు. అఖండ జ్యోతిని యాదాద్రి దేవాలయ అధికారులకు అప్పగించిన అనంతరం వైష్ణవ సమాఖ్య కార్యాయలం వద్ద వేదఘోష నిర్వహించనున్నట్లు తెలిపారు. రాత్రి 10 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఉత్సవ విగ్రహాలను రాయగిరి చెరువులో నిమజ్జనం చేస్తారని తెలిపారు.


logo
>>>>>>