శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 21, 2020 , 03:47:52

పలు శాఖలపై కలెక్టర్‌ సమీక్ష

పలు శాఖలపై కలెక్టర్‌ సమీక్ష

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అస్తవ్యస్తంగా ఉన్న జిల్లా యంత్రాంగాన్ని గాడినపెట్టేందుకు కలెక్టర్‌ శ్వేతామహంతి చర్యలకు ఉపక్రమించారు. ఆయారాం..గ యారాం.. అన్నట్లుగా ప్రణాళికలు లేకుండా నడుస్తు న్న శాఖల్లో పునరుత్తేజం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలోభాగంగా ఆయా శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. రోజుకు మూడుశాఖల చొప్పున సమీక్షిస్తూ అధికారులను సమన్వయం చేస్తున్నారు. ఫిబ్రవరి 10న కలెక్టర్‌గా బాధ్యత లు స్వీకరించిన విషయం తెలిసిందే. వచ్చినప్పటి నుంచే పాలనపై పట్టుసాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విద్య, వైద్యం, సంక్షేమశాఖలను ప్రాధాన్యతాంశాలుగా ఎంచుకున్న ఆమె మిగతా శాఖలపై సైతం ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఆయా శాఖ ల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. గతంలో రూరల్‌ జిల్లా అయిన వనపర్తిలో కలెక్టర్‌గా పనిచేయడం, అక్కడి పరిస్థితులకు హైదరాబాద్‌ జిల్లా పరిస్థితులు భిన్నంగా ఉండటంతో ఆకలింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. శాఖలవారీగా సమీక్షలు నిర్వహించి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా మహిళాశిశుసంక్షేమ శాఖ, వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖలకు ప్రత్యేకించి కొన్ని లక్ష్యాలను నిర్ధేశించి, మరలా సమీక్ష నిర్వహించేలోగా లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.


ఆవహించిన నిస్తేజం..

జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోని కారణంగా ఉన్నతాధికారులు సహా ఉద్యోగుల్లో నిస్తేజం ఆవహించింది. వరుస ఎన్నికలు, అధికారుల బదిలీలతోనే సంవత్సరా లు గడిచిపోయాయి. ఏ అధికారిని కదిలించినా ఏముం ది చేయడానికి అన్నట్లుగా వ్యవహరించేవారు. కనీసం ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులు సైతం పరిష్కారానికి నోచుకోలేదు. ఒకప్పుడు యోగితారాణా కలెక్టర్‌గా ఉన్నప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది. అప్పట్లో యావత్తు జిల్లా యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టేవారు. ఆమె పనిచేసిన ఏడాదికాలంపాటు రెవెన్యూ విభాగంసహా ప్రభుత్వశాఖలను గాడినపెట్టేందుకు ప్ర యత్నించారు. ఆమె బదిలీపై వెళ్లిన తర్వాత పరిస్థితి మొ దటికొచ్చింది. ఆ తర్వాత కలెక్టర్‌గా వచ్చిన శ్వేతామహంతి దూకుడుపెంచడం, వరుస సమీక్షలు నిర్వహిస్తుండటంతో మరలా అప్పటి వాతావరణం కనిపిస్తున్నది.


షెడ్యూల్‌ ఇలా..

24నుంచి 28వరకు వరుసగా సమీక్షలు నిర్వహించను న్నారు. 24న  సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌, కాలుష్యనియంత్రణ మండలి, జిల్లా సహకార శాఖ, 25న  ఎక్సైజ్‌ అండ్‌ ప్రొ హిబిషన్‌, మత్స్యశాఖ, అంధత్వ నివారణ సొసైటీ, 26న  హార్టికల్చర్‌, లీడ్‌బ్యాంక్‌, ఆర్‌అండ్‌బీ, 27న ప్రణాళికావిభాగం, చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌(సివిల్‌ సప్లయ్‌), 28న  అగ్నిమాపక శాఖ, అటవీ, కార్మిక శాఖ.


logo