శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 21, 2020 , 03:35:45

నిలోఫర్‌లో నెఫ్రాలజీ సేవలు

నిలోఫర్‌లో నెఫ్రాలజీ సేవలు
  • ప్రతి సోమవారం ఓపీ : ఆర్‌ఎంవో డాక్టర్‌ రమేశ్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : చిన్నారులకు సంబంధించి మూత్రపిండాల సమస్యలు ఎదురైతే మొన్నటి వరకు ఉస్మానియా దవాఖానకు సిఫారసు చేసేవారు. ఎక్కువ మంది అక్కడికి వెళ్లలేక ప్రైవేటు దారిపట్టి నిలువు దోపిడీకి గురయ్యేవారు. నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ నిలోఫర్‌ దవాఖానలో నెఫ్రాలజీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మూత్రపిండ సమస్యలున్న చిన్నారులకు వైద్యసేవలు అందించేందుకు ప్రైవేటులో రూ.వేలు, లక్షలు ఖర్చవుతాయి. సాధారణంగా నిలోఫర్‌ దవాఖానకు వచ్చే కేసులను ఉస్మానియా దవాఖానకు సిఫారసు చేస్తారు. అయితే అక్కడ సాధారణ రోగుల రద్దీనే అధికంగా ఉండడంతో చిన్నారులను తీసుకెళ్లే తల్లిదండ్రులకు నిరీక్షణ, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేవారు. రెండు నెలల క్రితం నిలోఫర్‌ దవాఖానలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా నెఫ్రాలజీ విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉస్మానియా నెఫ్రాలజీ విభాగం నుంచి ఒక ప్రొఫెసర్‌, ఒక పీజీ వైద్యులు నిలోఫర్‌ నెఫ్రాలజీ విభాగంలో సేవలందిస్తున్నారు. 


ప్రతి సోమవారం 

రెండు నెలల క్రితం అందుబాటులోకి వచ్చిన నెఫ్రాలజీ విభాగంలో ప్రతి సోమవారం ఓపీ సేవలు అందిస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు చిన్న పిల్లలకు సంబంధించి నెఫ్రాలజీ సేవలు బయటి రోగులకు అందిస్తున్నారు. మూత్రపిండ సమస్యలున్న చిన్నారుల కుటుంబ సభ్యులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని నిలోఫర్‌ ఆర్‌ఎంవో డా.రమేశ్‌ దాంపురి తెలిపారు. 


logo