ఆదివారం 29 మార్చి 2020
Hyderabad - Feb 20, 2020 , 00:24:20

వినూత్న ఆవిష్కరణలు.. ఆరోగ్య రక్షకులు..!!

వినూత్న ఆవిష్కరణలు.. ఆరోగ్య రక్షకులు..!!
  • ముగిసిన బయో ఏషియా సదస్సు
  • ప్రత్యేక ఆకర్షణగా స్టార్టప్‌ల ప్రదర్శన

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వినూత్న ఆలోచనలతో..  సరికొత్త ఆవిష్కరణల ఎగ్జిబిషన్‌ బుధవారం ముగిసింది. బయో ఏషియా సదస్సులో భాగంగా హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన స్టార్టప్‌ల ప్రదర్శన దేశ, విదేశీ ప్రతినిధులను ఎంతగానో ఆకట్టుకున్నది. వైద్య రంగంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి ఆరోగ్య రక్షక పరికరాలను అందుబాటులోకి తేవడంపై వైద్య నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ వేదికగా జరిగిన బయో ఏషియా సదస్సులో కీలక అంశాలు చర్చించారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు, వ్యాపార విస్తరణ తదితర అంశాలపై ప్రణాళికలు చేసుకున్నారు. ఎలాంటి వ్యాధులనైనా కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య రంగంలో అన్ని దేశాలు కలిసి రావాలని వక్తలు పిలుపునిచ్చారు. మొత్తంగా మూడు రోజుల పాటు జరిగిన బయో ఏషియా సదస్సు విజయవంతంగా ముగిసింది. 


అమ్మలా గుర్తుచేస్తున్నది.. 

ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు.. చికిత్స చేసుకోవడం ఒక ఎత్తయితే.. సమయానికి మందులు మింగడం మరో ఎత్తు. మన ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వాళ్లే.. మందులు వేసుకోవడం గుర్తు చేస్తారు. ఇంట్లో అమ్మ ఉంటే వ్యాధి నయం అయ్యే వరకు అర్ధరాత్రి అయినా.. నిద్రలేపి నిర్ణీత సమయానికి మందులు వేస్తుంది. అయితే అన్ని సందర్భాల్లో మందులు వేసుకోవాలని చెప్పేవాళ్లు ఉండరు. ఇలాంటి పరిస్థితిని అర్థం చేసుకున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన రోహన్‌ త్రిపాఠి ఇనోవోకేర్‌ హెల్త్‌సాఫ్ట్‌ సొల్యూషన్‌ కంపెనీ స్థాపించి మెడ్‌పోర్‌ డివైస్‌ను రూపొందించారు. ఆ డివైస్‌లో 8 బాక్సులు అమర్చి ఉంటాయి. వాటికి సెన్సార్‌ కనెక్ట్‌ అయి ఉంటుంది. రిఫ్రిజిలేటర్‌లో మాదిరిగా మందులు సురక్షితంగా ఉంటాయి. అంతేకాదు ఏ సమయంలో ఏ మందు వేసుకోవాలి? ఇంతకుముందు వేసుకున్న మాత్రలు ఏమిటి? ఇప్పుడు ఏం వేసుకోవాలి? అనే విషయాలను తెలియజేస్తుంది. బాక్స్‌పై ఉన్న క్యాప్‌ తీయగానే రెడ్‌, బ్లూ, గ్రీన్‌ సిగ్నల్స్‌తో సమాచారం తెలుస్తుంది. ఒకవేళ పేషంట్‌ మందులు వేసుకోవడం మరిచిపోతే ఆ డివైజ్‌లో మనకు కావాల్సిన వారి నంబర్లు కనెక్ట్‌ చేసే వీలుంటుంది. సమయం కాగానే ఆ నంబర్లకు డివైస్‌ సందేశాన్ని పంపిస్తుంది. ఇంకా మందులు వేసుకోలేదని వారికి తెలియజేస్తుంది. వెంటనే వాళ్లు సంబంధిత వ్యక్తికి ఫోన్‌ చేసి మందులు గుర్తుచేస్తారు. అలా డివైస్‌ వ్యాధిగ్రస్థులకు ఉపయోగపడుతుంది.


ఐదునిమిషాల్లో రిపోర్టులు..!!

ఈసీజీ, రక్తపోటు, రక్తంలో ఆక్సిజన్‌ లెవల్స్‌, టెంపరేచర్‌ టెస్ట్స్‌, ఊపిరితిత్తులు, హృదయ స్పందనల సమాచారం అంతా ఐదు నిమిషాల్లో మన ముందు ఉండేలా విహతి టెక్నోహెల్త్‌ వాళ్లు ‘పినోటి’ డివైస్‌ను రూపొందించారు. చెయ్యి ఆకారంలో ఉండే ఈ డివైస్‌తో ఎవరైనా తమ ఆరోగ్య పరీక్షలు చేసుకోవచ్చు. పినోటి అనే యాప్‌ సాయంతో.. ఆ డివైస్‌ను ఛాతిలో అమర్చాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పుగా అమర్చితే యాప్‌ హెచ్చరిస్తుంది. ఓకే అయ్యాక రిపోర్టు వస్తుంది. ఆ రిపోర్టులన్నీ యాప్‌లో రిజిస్టర్‌ అయి ఉన్న వైద్యులకు వెళతాయి. వాళ్లు రిపోర్టులు పరీక్షించి సలహాలు ఇస్తారు.


టీ హబ్‌కు ప్రశంసలు..

తెలంగాణలో ఆలోచన ఉంటే చాలు ఆవిష్కరణ జరగాల్సిందే. అంతటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇక్కడ అందుబాటులో ఉంది. ఇప్పటికే టీ- హబ్‌, వీ హబ్‌లు విదేశీయుల మన్ననలు పొందాయి. కీలక ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నారు. బయో ఏషియాలో ఏర్పాటు చేసిన స్టార్టప్‌లను పరిశీలించిన విదేశీయులు టీ- హబ్‌ స్టార్టప్‌లను ప్రశంసించారు. జేఎన్‌టీయూ, ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు అద్భుతమైన ఆవిష్కరణలు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎలా సాధ్యమైందని వాళ్లని అడగగా.. స్టార్టప్‌ నిర్వాహకులు టీ హబ్‌ గురించి వారికి వివరించడంతో వారు శభాష్‌ టీ -హబ్‌ అంటూ నెదర్లాండ్‌కు చెందిన హెయిన్‌ గెవెర్స్‌, జర్మనీకి చెందిన కార్మన్‌లు   ప్రశంసించారు. 


బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను పసిగట్టేద్దాం..!!

స్టార్టప్‌ల ప్రదర్శనలో జపాన్‌కు చెందిన కార్మన్‌ కోబ్జా రూపొందించిన ‘లేడీ బీ వెల్‌' డివైస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడే మహిళలకు అండగా నిలిచేందుకు తయారు చేసిన డివైస్‌ గురించి మహిళలు ఆరా తీశారు. స్తనాలలో కణతులు ఉన్నాయా? ఏ పరిమాణంలో ఉన్నాయి? ఏ స్థాయి లో ఉంటే అవి బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు దారి తీస్తాయి? తదితర అన్ని అంశాలను వివరించారు. ఆడవారు ఎక్కువగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో చనిపోతున్నారని.. ఆ వ్యాధిని నివా రించడమే తన లక్ష్యమని కార్మన్‌ కోబ్జా తెలిపారు. 


జెడ్‌బ్లాక్స్‌లో అవయవాలు.. 

ప్రమాదాల్లో చనిపోతున్న వారి అవయవాలు మరొకరికి దానం చేయాలంటే అవి భద్రపరిచే బాక్సులు చాలా సురక్షితంగా ఉండాలి. ఇందుకోసం ‘జెడ్‌బ్లాక్స్‌'ను రూపొందించాం. ఇందులో ఉష్ణోగ్రతను నియంత్రించే వీలుంటుంది. దానికి జీపీఎస్‌ అమర్చి మొబైల్‌కు కనెక్ట్‌ అయి ఉంటుంది.  ఏదైనా సమస్య ఉంటే మొబైల్‌ ద్వారానే ఆపరేట్‌ చేసే వీలుంటుంది. 

- రవిశంకర్‌, డైరెక్టర్‌, జెడ్‌బ్లాక్స్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌.

 

భూసార పరీక్షలు..

సాయిల్‌ టెస్ట్‌ చేసి ఆ భూమి పరిస్థితి ఎలా ఉందో చెప్పగలుగుతాం. పంటలు సమృద్ధిగా పండాలంటే ఆ భూమిలో ఎలాంటి పంటలు పండించాలో భూసా ర పరీక్షలు చేస్తే సరిపోతుంది.  మా కంపె నీ  చేసే ప్రయోగాలని విదేశీ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. 

- లక్ష్మి, పరిశోధకురాలు


వ్యాపార విస్తరణకు..

మేము ప్రింటర్స్‌ డెన్‌ గ్రూప్స్‌ ఆధ్వర్యంలో ఇండెక్స్‌ అండ్‌ ఇండక్షన్‌ సీలింగ్‌ వాడ్‌ను రూపొందించాం. వాటిని మందులు, టానిక్‌ల మూత కిందిబాగంలో కవర్‌ రూపంలో(సీల్‌) వినియోగిస్తారు. ఇండియా అంతటా ఇండక్షన్‌ సీలింగ్‌ను మేమే సరఫరా చేస్తాం. బయో ఏషియా సదస్సు వ్యాపార విస్తరణకు ఎంతో ఉపయోగపడుతుంది.

- దినేశ్‌ కుమార్‌ రెడ్డి, డిప్యూటీ మేనేజర్‌, టెక్నికల్‌ ఎక్చేంజ్‌ డిపార్ట్‌మెంట్‌


‘ఐ కెన్‌ కేర్‌' అండగా..

ప్రమాదమని తెలిసినా బహిరంగ ప్రదేశాల్లో పొగరాయుళ్లు ధూమపానం చేస్తుంటారు. దీంతో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ప్రమా దం పొంచి ఉంది. ‘ఐ కెన్‌ కేర్‌' స్టార్టప్‌ను రూపొందించి నివారణ చర్యలు తీసుకుంటున్నాం. బయో ఏషియా సదస్సులో ధూమపానంపై అవగాహన కల్పించాం. -శ్రుతి , ఫౌండర్‌, ఐ కెన్‌ కేర్‌ 


logo