శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 20, 2020 , 00:22:30

వ్యర్థ రహితంగా...

వ్యర్థ రహితంగా...
  • మరింత సమర్థవంతంగా వ్యర్థాల రీసైక్లింగ్‌
  • చెత్త సేకరణలో సాంకేతిక పరిజ్ఞానం
  • రాజేంద్రనగర్‌లో ప్రయోగాత్మకంగా అమలు
  • దశల వారీగా నగరమంతా..

సిటీబ్యూరో: వ్యర్థ రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బల్దియా ముందుకెళ్తున్నది. ఇందుకు వ్యర్థాల రీసైక్లింగ్‌ను చేపట్టింది. ఇది మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. తడి, పొడి చెత్త సేకరణకు సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నది. ఈ ప్రక్రియ రాజేంద్రనగర్‌లో విజయవంతమైంది. ఇది దశల వారీగా నగరమంతా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నది. 


తడి, పొడి విడివిడిగా... 

నాలుగేండ్ల కిందట ఇంటింటి చెత్త సేకరణకు ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టడంతో పాటు తడి,పొడి చెత్తను విడివిడిగా సేకరించేందుకు 22 లక్షల ఇండ్లకు రెండేసి చెత్త డబ్బాలను సరఫరా చేశారు. ఇండ్ల  యజమానులు చెత్త టిప్పర్లకు నెలకు రూ. 50 చెల్లించేలా ఫీజు నిర్థారించారు. పర్యవేక్షణలోపం కారణంగా పలు ప్రాంతాల్లో చెత్త టిప్పర్లు సరిగా నడవడం లేదు. దీంతో తడి, పొడి చెత్త సేకరణ సక్రమంగా సాగడం లేదు. 


సాంకేతిక విధానంతో....

రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో అర్బన్‌ రీబాక్స్‌ ఐటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో స్మార్ట్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టును జీహెచ్‌ఎంసీ ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఇందుకోసం స్థానిక జనప్రియ అపార్ట్‌మెంట్‌మెంట్లను ఎంపిక చేశారు. సుమారు 1500 ఫ్లాట్లు ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌లో ప్రతి ఫ్లాట్‌కూ ఓ క్యూఆర్‌ కోడ్‌ను పెట్టారు. చెత్త ఆటో టిప్పర్‌ నిర్వాహకులకు స్మార్ట్‌ఫోన్‌ను అందించి.. రోజూ చెత్తకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఆటో టిప్పర్‌ నిర్వాహకులు రోజూ తప్పనిసరిగా అన్ని ఫ్లాట్‌లకూ వెళ్లి చెత్తను సేకరించేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు వారు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌చేసి వివరాలు నమోదు చేస్తారు. చెత్త ఇచ్చారా, లేదా? ఇస్తే తడి, పొడి చెత్త విడివిడిగా ఇచ్చారా? తదితర వివరాలు అందులో నమోదు చేస్తారు. అలాగే, ఇండ్ల యజమానులకూ క్యూఆర్‌ కోడ్‌ను ఇచ్చారు. వారు సైతం ఏమైనా ఫిర్యాదులుంటే అందులో నమోదు చేయవచ్చు. 


సీఎస్‌ఆర్‌ కింద..

సేకరించిన చెత్తను వేరు చేసేందుకు కాటేదాన్‌లో ఆధునిక చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను అభివృద్ధి చేశారు. అక్కడ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ కింద ఐటీసీ సంస్థ ఆధ్వర్యంలో  డ్రై రిసోర్స్‌ కలక్షన్‌ సెంటర్‌ను నెలకొల్పారు. అక్కడ వ్యర్థాలను వేర్వేరు చేసి  తడి చెత్తను ఎరువు తయారీకి ఉపయోగిస్తున్నారు. అలాగే, పొడి చెత్తలో కాగితాలు, ప్లాస్టిక్‌, ఇనుము తదితర వాటిని విడదీసి రీసైక్లింగ్‌కు పంపుతున్నారు. సర్కిల్‌లోని ఇంజినీరింగ్‌ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. కొద్దిరోజులుగా సాగుతున్న ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నట్లు, ఇదే తరహా విధానాన్ని దశల వారీగా నగరవ్యాప్తంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.logo