శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 19, 2020 , 00:35:12

సీసీ కెమెరాల ఏర్పాటు వేగవంతం

సీసీ కెమెరాల ఏర్పాటు వేగవంతం
  • నగరం సేఫ్‌ సిటీగా ఎంపికైన నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలి
  • రోడ్ల తవ్వకాలకు మే 15 వరకే అనుమతి
  • ఒకవేళ తవ్వినా 48 గంటల్లోగా పునరుద్ధరించాలి
  • అధికారులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌

సీసీ కెమెరాల ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం పోలీసు, జీహెచ్‌ఎంసీ, రోడ్డు నిర్వహణ ఏజెన్సీలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న సంస్థలు సమన్వయంతో ముందుకుసాగాలని నిశ్చయించాయి. అంతేకాకుండా రోడ్డు తవ్వకాలను మే 15వరకే అనుమతించాలని నిర్ణయించారు. అనంతరం తవ్వకాలకు అనుమతించరాదని, ఒకవేళతవ్వినా 48గంటల్లోగా పునరుద్ధరించాలని నిశ్చయించారు. హైదరాబాద్‌ నగరం సేఫ్‌సిటీగా ఎంపికైన నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటును త్వరితగతిన పూర్తిచేసి నిఘాను మరిం త పెంచాలని సంకల్పించారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ, పోలీసు ఉన్నతాధికారులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న ఎల్‌అండ్‌టీ, జియోసంస్థ ప్రతినిధులతో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ సమావేశమయ్యారు.   


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం పోలీసు, జీహెచ్‌ఎంసీ, రోడ్డు నిర్వహణ ఏజెన్సీలు, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న సంస్థలు సమన్వయంతో ముందుకు సాగాలని నిశ్చయించాయి. అంతేకాదు, రోడ్డు తవ్వకాలను మే 15వ తేదీ వరకే అనుమతించాలని నిర్ణయించారు. అనంతరం తవ్వకాలకు అనుమతించరాదని, అంతేకాకుండా తవ్విన రోడ్లను 48 గంటల్లోపు పునరుద్ధరించాలని నిశ్చయించారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ నగరాన్ని సేఫ్‌సిటీగా ఎంపిక చేసిన నేపథ్యంలో సీసీ టీవీల ఏర్పాటును త్వరితగతిన పూర్తిచేసి నిఘాను మరిం త సమర్థవంతంగా నిర్వహించాలని సంకల్పించారు. 


నగరంలోని కూడళ్లు, ప్రధాన రోడ్లపై సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖ ఉన్నతాధికారులు, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న ఎల్‌అండ్‌టీ, జియో సంస్థ ప్రతినిధులతో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. కేబుళ్ల కోసం తవ్వుతున్న రోడ్లను 48గంటల్లోగా పూడ్చివేసేలా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని నిర్ణయించారు. ప్రధాన రోడ్లను సీఆర్‌ఎంపీ(సమీకృత రోడ్ల నిర్వహణ ప్రణాళిక)లో భాగంగా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించినందున రోడ్డు తవ్వకాల సందర్భంగా ఆయా ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని నిశ్చయించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ మాట్లాడుతూ..స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద ఎల్‌అండ్‌టీ సంస్థ 2662జంక్షన్లలో రోడ్డు తవ్వకాలకు అనుమతి కోరగా, 2557 చోట్ల అనుమతులు జారీ చేసినట్లు చెప్పారు. మొత్తం ప్రతిపాదిత రోడ్డు తవ్వకాల విస్తీర్ణం 59 కిలోమీటర్లని ఆయన తెలిపారు. అలాగే, జియో సంస్థ 1077జంక్షన్లలో మైక్రో కటింగ్‌లకు అనుమతి కోరగా, అందులో 493చోట్ల, అంటే దాదాపు 26కిలోమీటర్ల విస్తీర్ణంలో తవ్వకాలకు అనుమతించినట్లు చెప్పారు. జియో ఏజెన్సీ సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకోసం అవసరమైన 5280 స్తంభాలను నెలకొల్పేందుకు 221 మీటర్ల పొడవున రోడ్డు తవ్వకాలకు అనుమతి ఇచ్చామన్నారు. 


అంతేకాకుండా రోడ్డు తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లో శిథిలాల తొలగింపు బాధ్యత ఆయా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్న సంస్థలదేనన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ ఇబ్బందుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, రోడ్ల మరమ్మతులు, తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్ల రీ ఇంజినీరింగ్‌, జంక్షన్లలో ఉన్న స్తంభాలను సమిష్టిగా ఉపయోగించుకోవడం, వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను జారీ చేయడంతోపాటు వారు విక్రయాలు సాగించే ప్రాంతాల గుర్తింపు తదితర అంశాలపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. 533చోట్ల ఇప్పటికే నెట్‌వర్క్‌ కనెక్షన్లు ఉండగా, కొత్తగా 297ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు 5.79కిలోమీటర్ల పొడవున మైక్రో కటింగ్‌ పనులు పూర్తైనట్లు వివరించారు. సమావేశంలో పోలీసు శాఖ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ జితేందర్‌, జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ జియావుద్దీన్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌, రాచకొండ అదనపు కమిషనర్‌ సుధీర్‌బాబు, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 


logo