గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 19, 2020 , 00:27:23

నమ్మకానికి.. వన్నె తెస్తున్నా

నమ్మకానికి.. వన్నె తెస్తున్నా

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ  : రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లోనే దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్‌ నియోజకవర్గంగా ఉన్న మల్కాజిగిరి నుంచి చామకూర మల్లారెడ్డి ఎంపీగా గెలుపొందారు. అనంతరం రాజీనామా చేసి మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి అత్యధిక మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. మొదటి సారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు సీఎం కేసీఆర్‌ మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పదవీబాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. 


మేం ప్రజా సేవకులం...

కేసీఆర్‌ నాయకత్వంలో పని చేస్తున్న ప్రజాప్రతినిధులందరం ప్రజా సేవకులం. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాధరణకు గురైన ఈ ప్రాంతంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం. ప్రజలకు ఏది అవసరమో అది ప్రజలు అడగకుండానే నెరవేర్చే నాయకుడు మా కేసీఆర్‌. ఆయనే ఈ రాష్ర్టానికి, ఈ ప్రాంత ప్రజలకు దశ దిశ. కేవలం ఐదారేండ్లలోనే అద్వితీయ ప్రగతిని సాధిస్తూ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోని అనేక రాష్ర్టాలకు రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నది. ఇంత గొప్ప నాయకుడి క్యాబినెట్‌లో నేను ఒక క్యాబినెట్‌ మంత్రిగా ఉన్నందుకు గర్వపడుతున్న. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఎదురు లేదు, సీఎం కేసీఆర్‌కు తిరుగులేదు. సాధారణంగా ఏదేని రాష్ట్రంలో, దేశంలో సుస్థిర ప్రభుత్వం, సెక్యులర్‌ నాయకుడు పరిపాలకుడిగా ఉంటేనే ఆ రాష్ట్రం, ఆ దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణ రాష్ట్రం. 


రూ.వేల కోట్లతో అభివృద్ధి...

అనతి కాలంలోనే మేడ్చల్‌ జిల్లాలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టాం. హైదరాబాద్‌ మహా నగరంలో భాగంగా ఉన్న మేడ్చల్‌ జిల్లా ప్రస్తుతం అభివృద్ధిలో నగరంతో పోటీపడుతున్నది. గడిచిన నాలుగైదు ఏండ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా 318 కమ్యూనిటీ హాల్స్‌ నిర్మాణానికి రూ.74,69,43000 ప్రభుత్వం వెచ్చించింది. అలాగే 437 ప్రాంతాల్లో రహదారులు, రహదారులపై వంతెనల (బ్రిడ్జ్‌) నిర్మాణానికి రూ.45,61, 16,500 నిధులు, తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.12,87,85, 500, ప్రభుత్వ పాఠశాలకు రూ.8,71,74,072, విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి రూ.3,92,71,268, మౌలిక వసతుల కల్పనకు రూ.20,13, 06,000, వ్యవసాయ అనుబంధ అభివృద్ధి పనులకు రూ.3,26,49,884, ప్రజల తక్షణ అవసరాలకు రూ.42,41,74,638 నిధులను వెచ్చించాం. జిల్లాలో క్రీడలు, క్రీడా స్థలాల అభివృద్ధికి రూ.1,02,02,000 నిధులు ఖర్చు చేశాం. మొత్తం జిల్లాలో 1,817 పనుల కోసం రూ.212,66, 22,862 నిధులు వెచ్చించడం జరిగింది. ఇందులో నియోజకవర్గం అభివృద్ధి నిధుల కింద 847 పనులకు గాను రూ.58,42,56,623, స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద 204 పనులకు గాను రూ.104,96,05,412, సీబీఎఫ్‌ కింద 198 పనులకు రూ.10,12,45,852, డీఎంఎఫ్‌టీ నిధుల కింద 197 పనులకు గాను రూ.14,70,20,000, ఎంపీ ల్యాడ్స్‌ కింద 371 పనులకు గాను రూ.24,44,94,975 నిధులతో జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అలాగే రూ.300 కోట్లతో మిషన్‌ భగీరథ, రూ.50 కోట్లతో మిషన్‌ కాకతీయ, సుమారు రూ.100 కోట్లతో జిల్లా పరిధిలో మిషన్‌ అర్భన్‌ భగీరథ ఇలా అనేక అభివృద్ధి కార్యాక్రమాలను పూర్తి చేయడం జరిగింది. 


నాటి తండాలు నేడు పల్లెలు.. మొన్నటి పల్లెలు నేడు పట్టణాలు

ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు ఏనాడు కూడా గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్యమ సమయంలో తండాలు, గూడెంల ప్రజల అవస్థలను గమనించిన కేసీఆర్‌ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తండాలను, గూడెంలను ప్రత్యేక పంచాయతీలుగా, సెమీ అర్భన్‌ గ్రామాలుగా ఉన్న పల్లెలను మున్సిపల్‌ కార్పొరేషన్లుగా, మున్సిపాలిటీలుగా మార్చారు. ఇందులో భాగంగా మేడ్చల్‌ జిల్లాలో కొత్తగా 14 గ్రామాలు, 9 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. 


కార్మికుల కష్టాలు తెలుసు...

నన్ను గెలిపించిన ప్రజలు, నా అధినాయకుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనకు అప్పగించిన మంత్రిత్వ శాఖకు మున్ముందు మరింత వన్నె తెచ్చేందుకు కృషి చేస్తా.  టీఎస్‌ఐపాస్‌లో భాగంగా నూతన పరిశ్రమలకు కేవలం 15 రోజుల వ్యవధిలోనే అనుమతులను జారీ చేస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు రూ.15,900కోట్ల పెట్టుబడులతో 2.10లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అలాగే 24 శిక్షణా సంస్థల ద్వారా 56 రంగాల్లో మూడు నెలల ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 


నగరంతో సమానంగా..

కొత్తగా ఏర్పడిన మేడ్చల్‌ జిల్లా హైదరాబాద్‌ మహా నగరంలో భాగంగా ఉంది. అయితే వలస పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. ఇక నుంచి మేడ్చల్‌ జిల్లాను నగరంతో సమానంగా అభివృద్ధి చేస్తా. జిల్లాలో విశాలమైన రహదారులు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఆక్సిజన్‌ పార్కులు, జాతీయ రహదారులు, అంతర్జాతీయ పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మున్ముందు మరింత అభివృద్ధి సాధించి అగ్రస్థానంలో నిలుస్తాం.


తొలిసారి మంత్రిగా..

టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీలో క్రియాశీల నాయకుడిగా పనిచేసి 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వం, తెలంగాణ పునరేకీకరణలో భాగంగా టీఆర్‌ఎస్‌లో చేరారు. నాలుగున్నర సంవత్సరాలు మల్కాజిగిరి ఎంపీగా సేవలందించి, 2018లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మేడ్చల్‌ అసెంబ్లీ స్థానంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఎమ్మెల్యేగా తొలిసారిగా గెలిచినా మల్లారెడ్డిపై నమ్మకంతో సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రిగా అవకాశం కల్పించారు.


logo