శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 19, 2020 , 00:27:23

ఆరోగ్య రంగంలో.. అదిరేటి ఆవిష్కరణలు

ఆరోగ్య రంగంలో.. అదిరేటి ఆవిష్కరణలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఓ వైపు పర్యావరణ విధ్వంసం.. మరోవైపు మారుతున్న జీవన శైలి.. ఇంకోవైపు విజృంభిస్తున్న కొత్త కొత్త రోగాలు. వెరసి మనుషుల ఆరోగ్యంపై వివిధ రకాల వైరస్‌లు మృత్యువును ప్రయోగిస్తున్నాయి. చికిత్సకు దొరకని వ్యాధులు సవాళ్లు విసురుతున్నాయి. ప్రస్తుతం ఏ దేశంలో ఏ వినాశకర వైరస్‌ పుట్టుకొస్తున్నదో తెలియని పరిస్థితులు. నివారణకు మందు కనుగొనే లోపే లక్షలాది మందిని కోల్పోవల్సి వస్తున్నది. ఇప్పటికే చైనాలోని కోవిడ్‌-19 వైరస్‌ కారణంగా దేశాలన్నీ ఎలా భయానక వాతావరణంలోకి నెట్టివేయబడ్డాయో తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య రంగంలో భయంకర వ్యాధుల వ్యాప్తిని పకడ్బంధీగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి.. చర్చించి.. పరిష్కార మార్గాలను రూపొందించే వేదికే.. బయో ఏషియా సదస్సు. ‘ఈ రోజు రేపటి కోసం’ (టుడే ఫర్‌ టుమారో) నినాదంతో రెండో రోజు హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ఈ సదస్సులో ఆరోగ్య రంగ నిపుణులు క్యాన్సర్‌, ఎబోలా, భయంకర జ్వరాలు తదితర ప్రాణాంతక వ్యాధులపై కూలంకుషంగా చర్చించారు. సుమారు 37 దేశాల నుంచి 2వేల మంది  ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. జీవశాస్త్ర రంగాల కంపెనీలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను వివరించారు. 


30 సెకన్లలో క్యాన్సర్‌ నిర్ధారణ..!!

కేన్సర్‌ ప్రాణాంతక వ్యాధి. ముఖ్యంగా మహిళలు రకరకాల క్యాన్సర్‌లతో ప్రాణాలు కోల్పోతున్నారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌, సెర్వికల్‌, కొలరెక్టర్‌ క్యాన్సర్లకు ఎక్కువగా గురవుతుంటారు. ఈ పరిస్థితిని దినేశ్‌ కోకా అధ్యయనం చేసి ‘ఆన్‌వర్డ్‌ అసిస్ట్‌' అనే డివైస్‌ను రూపొందించారు. సంబంధిత వ్యక్తి బయాప్సీని ఫొటో తీసుకుని కంప్యూటర్‌తో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహకరంతో కేవలం 30 సెకన్లలోనే క్యాన్సర్‌ లక్షణాలు పసిగడుతుంది. అంత వేగంగా గుర్తించే ఈ డివైస్‌ గురించి ప్రతినిధులు, సందర్శకులు ఆసక్తిగా తెలుసుకున్నారు. 


అక్కడ పేషెంట్‌.. ఇక్కడ డాక్టర్‌...!!

జేఎన్‌టీయూకు చెందిన నలుగురు అమ్మాయిలు చేసిన ఆవిష్కరణ ఎంతగానో ఆకట్టుకున్నది. ‘ఐ నేత్ర’ పేరుతో డి.సాయిసౌమ్య, ఎం.శ్రీజ, కె.భవ్య, డి.నీలిమ  చేసిన ఆవిష్కరణ ఆకట్టుకున్నది. కంటికి సంబంధించిన సమస్యలు ఏవీ ఉన్నా.. పేషెంట్లు ఏ ప్రాంతంలో ఉన్నా.. ఐ నేత్ర డివైస్‌తో వారి ఫొటో తీస్తే సరిపోతుంది. ఆ ఫొటో ఐ నేత్ర యాప్‌లోకి పేషెంట్‌ వివరాలతో పాటు వచ్చేస్తుంది. డాక్టర్లు ఆయాప్‌ సహాయంతో పేషెంట్‌ కంటి పరిస్థితిని గమనించి సలహాలు, సూచనలు చేస్తారు. సాధారణంగా ఈ యాప్‌లో ఐ ఎక్స్‌పర్ట్స్‌ సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే ఈ డివైజ్‌లను గ్రామీణ ప్రాంతాలకు అందజేశారు. నగరంలోని పలు ప్రైవేట్‌ దవాఖానల్లో వినియోగిస్తున్నారు. 


న్యూమోనియాకు చెక్‌ పెట్టేద్దాం..!!

ప్రపంచంలో న్యూమోనియా, సెప్సిస్‌, మలేరియా, గాలి కాలుష్యం కారణంగా సుమారు 2 మిలియన్ల మంది చిన్నారులు తమ జీవిత కాలంలో 5 ఏండ్లు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని అధ్యయనం చేసిన బయో డిజైన్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌ సీఈఓ గౌతం పసుపులేటి చేసిన ఆవిష్కరణ న్యూమోనియా నుంచి పిల్లలను రక్షించుకునే మార్గాన్ని సూచించింది.  ‘ఆక్సిజన్‌ థెరపీ ఫర్‌ న్యూమోనియా’ పేరుతో రెస్సాప్‌ డివైస్‌ను ఆవిష్కరించారు. 5 నెలల నుంచి 58 నెలల పిల్లలకు న్యూమోనియా ఉంటే అత్యవసర చికిత్స అందించేలా డివైస్‌కు స్పెసిఫిక్‌ అడ్జస్ట్‌మెంట్స్‌ చేసి రక్తంలో ఉన్న ఆక్సిజన్‌ లెవల్స్‌ను సరిచేస్తుంది. పేషెంట్‌ రికవరీ అయ్యేలా ఈ డివైస్‌ ఉపయోగపడుతుంది. 


గ్లౌవ్‌ పంక్చర్‌ను గుర్తిద్దాం..!!

సాధారణంగా సర్జరీ ప్రక్రియలో డాక్టర్లు ధరించే గ్లౌవ్స్‌ ఎంతవరకు క్షేమంగా ఉన్నాయి..? పేషెంట్‌ ధరించే గ్లౌవ్స్‌ ఎలా ఉన్నాయి..? అనే విషయాలను గుర్తించడం కష్టం. వాటిని ఇంతకు ముందు ఎవరైనా అనారోగ్య వ్యక్తులు ధరించారా అనే విషయాన్ని గుర్తించేందుకు డాక్టర్‌ గుర్‌మింద్‌ సింగ్‌ చేసిన ఆవిష్కరణ “ గ్లౌవ్స్‌ పంక్చర్‌ డిటెక్టర్‌”. ఈ డివైజ్‌కు మూడు బ్లజర్స్‌ను ఏర్పాటు చేస్తారు. వాటిని ధరించిన వెంటనే ఆ బ్లజర్స్‌ మోగుతాయి. ఆ గ్లౌవ్స్‌ సురక్షితంగా లేవని హెచ్చరిస్తాయి. 


logo