శనివారం 28 మార్చి 2020
Hyderabad - Feb 19, 2020 , 00:25:21

అక్రమ నిర్మాణాలపై బల్దియా దూకుడు

అక్రమ నిర్మాణాలపై బల్దియా దూకుడు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని జీహెచ్‌ఎంసీ సంకల్పించింది. దీనికోసం మాజీ సైనికులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో జోన్లవారీగా కూల్చివేతల బృందాల(డెమోలిషన్‌ స్కాడ్‌)ను రంగంలోకి దింపాలని అధికారులు నిర్ణయించారు. కూల్చాల్సిన భవనాల వివరాలు ఆయా బృందాలకు ముందుగా వెల్లడించకుండా గోప్యంగా ఉంచాలని, అంతేకాకుండా ఏ బృందం ఏ జోన్‌కు వెళ్లాలో కూడా కొద్దిసేపు ముందే వెల్లడించాలని నిశ్చయించారు.జీహెచ్‌ఎంసీకి వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధిక శాతం అక్రమ భవనాలకు సంబంధించినవే ఉంటున్నాయి. టౌన్‌ప్లానింగ్‌కు చెందిన కిందిస్థాయి సిబ్బంది అక్రమ నిర్మాణదారులతో మిలాఖత్‌ అవుతుండడంతో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం ఉండడంలేదు. కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు ఇస్తున్న ఆదేశాలు సైతం అమలుకు నోచుకోవడంలేదు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ జోన్లవారీగా డెమోలిషన్‌ స్కాడ్‌లను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. మున్సిపల్‌ చట్టం అమలుకోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) ఆధ్వర్యంలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో మాజీ సైనికులను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో కొందరికి టౌన్‌ప్లానింగ్‌ కోసం కేటాయించాలని ఆ విభాగం అధికారులు కోరుతున్నారు. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, మాజీ సైనికులతో బృందాలుగా ఏర్పాటు చేసి జీహెచ్‌ఎంసీకి వివిధ మాధ్యమాల ద్వారా అక్రమ నిర్మాణాలపై వస్తున్న ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని నిశ్చయించారు. ఏ బృందం ఏ జోన్‌కు వెళ్తుందో అనేది ముందుగా వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వెళ్లే ముందే వారికి కూల్చాల్సిన భవనాల వివరాలు వెల్లడించాలని అధికారులు నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీకి ఇప్పటి వరకు అందిన అక్రమ నిర్మాణ ఫిర్యాదులు దాదాపు 600 వరకూ పెండింగ్‌లో ఉండగా, అందులో సగం వరకు కోర్టు కేసుల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, మిగిలిన వాటిపై చర్యలు తీసుకునే అవకాశముంది.


ఇదిలావుంటే, 500 గజాలు, పది మీటర్ల ఎత్తు వరకు ఇండ్ల నిర్మాణాలకు అనుమతులతో పని లేకుండా సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఈ చట్టం త్వరలోనే జీహెచ్‌ఎంసీకి వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ చట్ట సవరణలో ఈ అంశం కూడా ఉంటుందని ఇది వరకే పలు సందర్భాల్లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాల గుర్తింపులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. సహజంగా నగరంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల్లో ఎక్కువగా అదనపు అంతస్తులు, సెట్‌బ్యాక్‌ డీవియేషన్లకు సంబంధించినవే ఉంటున్నాయి. ఇరుగు-పొరుగువారు, స్థానికంగా ఉండే కొందరు జులాయిలు, చోటామోటా లీడర్లు బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతూ నిర్మాణదారుల నుంచి అక్రమంగా డబ్బు దండుకునేందుకు ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా పాతబస్తీలో అక్రమ నిర్మాణాలు అధికంగా ఉంటున్నట్లు జీహెచ్‌ఎంసీకి సమాచారం అందుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాలపై దూకుడుగా వ్యవహరిస్తే అమాయకులు నష్టపోయే ఆస్కాముందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.


logo