ఆదివారం 24 మే 2020
Hyderabad - Feb 19, 2020 , 00:21:46

‘షీటీమ్‌'కు తెలుగు విశ్వవిద్యాలయం తోడ్పాటు రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌

‘షీటీమ్‌'కు తెలుగు విశ్వవిద్యాలయం తోడ్పాటు రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌

తెలుగుయూనివర్సిటీ : రాష్ట్రంలోని మహిళల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన షీటీమ్‌ బృందానికి తెలుగువిశ్వవిద్యాలయం తమ వంతుగా తోడ్పాటు అందిస్తుందని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌ తెలిపారు. మంగళవారం వర్సిటీ ఆడిటోరియంలో మహిళల రక్షణకై అవగాహన సదస్సు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వర్సిటీ రిజిస్ట్రార్‌ బి. రమేశ్‌ మాట్లాడుతూ షీటీమ్‌ చేపట్టే అవగాహన కార్యక్రమాల్లో తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని కళా రూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలను చైతన్య వంతులను చేయడానికి కృషి చేస్తారని, ఆ దిశగా విశ్వవిద్యాలయం కార్యక్రమాల రూపకల్పన చేస్తుందన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన షీటీమ్‌ అదనపు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ పూజిత నీలం మాట్లాడుతూ మహిళలు తమ ఫిర్యాదులతో పోలీస్‌స్టేషన్‌కు రావడానికి ఇష్టపడని వారు నేరుగా షీటీమ్‌ బృందానికి సమాచారం అందిస్తే వారికి ఎలాంటి ఇబ్బందులున్నా తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరిస్తుందని తెలిపారు. 


ఫిర్యాదు చేసిన బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచి, వారు ఎదుర్కొంటున్న పోకిరీల బెడద, కుటుంబ వేధింపులు, సైబర్‌ హింసల నుంచి రక్షించడానికి షీటీమ్‌ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా తెలుగువిశ్వవిద్యాలయం  విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిణి ఆచార్య రెడ్డి శ్యామల, లలిత కళాపీఠం ఇన్‌చార్జి డాక్టర్‌ కోట్ల హనుమంతరావు, రంగస్థల కళల శాఖాధిపతి డాక్టర్‌ పద్మప్రియ, డిప్యూటీ రిజిస్ట్రార్‌ అజయ్‌చంద్ర, విశ్వవిద్యాలయం మహిళా ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.


logo