గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 17, 2020 , 01:18:01

మొక్కవోని దీక్షతో.. మొక్కలు నాటుదాం..!

మొక్కవోని దీక్షతో..   మొక్కలు నాటుదాం..!

అనితర సాధ్యమైన తెలంగాణను మొక్కవోని దీక్షతో సాధించిన స్వరాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ రథ సారధి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు 66వ పుట్టిన రోజును పండుగలా జరిపేందుకు గ్రేటర్‌ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు సిద్ధమయ్యారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అనితర సాధ్యమైన తెలంగాణను మొక్కవోని దీక్షతో సాధించిన స్వరాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ రథ సారధి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు 66వ పుట్టిన రోజును పండుగలా జరిపేందుకు గ్రేటర్‌ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు సిద్ధమయ్యారు. అభిమాన నేత పుట్టిన రోజుకు కానుకగా ప్రజలు, పార్టీ శ్రేణులంతా మొక్కవోని దీక్షతో మొక్కలు నాటేలా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు ఆయా ప్రాంతాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చేపట్టిన హరితహారంలో అందరం భాగస్వామ్యం అవుదామని, ఈచ్‌ వన్‌ ప్లాంట్‌ వన్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజును మక్కువతో జరుపుకోవాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు, ప్రజలకు మంత్రులు, ఎంపీలు విజ్ఞప్తి చేశారు. 


మేడ్చల్‌ జిల్లాలో...

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజున మేడ్చల్‌ జిల్లాలో చెట్ల పండుగ జరుగనున్నది. గ్రామ వార్డు స్థాయి నుంచి జిల్లా నాయకుల వరకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఎవ్వరికి వారు విరివిగా చెట్లను నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు శామీర్‌పేట్‌లోని నూతన కలెక్టరేట్‌ వద్ద సుమారు 5వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే శామీర్‌పేట్‌, తూంకుంట తదితర ప్రాంతాలలో, జిల్లా, మండల పరిషత్‌ కార్యాలయాల్లో, మండల, ఆర్డీవోల కార్యాలయాల్లో, మండల మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపల్‌ కార్యాలయాల్లో, వార్డు కార్యాలయాల ప్రాంగణంలో, జాతీయ రహదారుల వెంట, కాలనీల్లో మొక్కలు నాటనున్నారు.


కాచిగూడ : రాబోయే తరాలకు పచ్చదనాన్ని ఇవ్వడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని వనసంరక్షణ సేవా సమితి చైర్మన్‌ నట్టం సుబ్బారావు అన్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌ నగర మహిళా నాయకురాలు దేవిరెడ్డి విజితారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బర్కత్‌పురలోని వివిధ ప్రాంతాల్లో 1250 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి మహిళా మండలి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్‌ నాయకురాలు సీహెచ్‌.దీప, వనసంరక్షణ సేవా సమితి డైరెక్టర్‌ వి.ప్రసాద్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 


లాల్‌బహదూర్‌ స్టేడియంలో సీఎం జన్మదిన వేడుకలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి  : ప్రాజెక్టుల నిర్మాణానంతరం క్రీడల అభ్యున్నతి, పేదరిక నిర్మూలనే కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన లాల్‌బహదూర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకొని లాల్‌బహదూర్‌ స్టేడియం వేదికగా పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్టేడియంలోని ఒలింపిక్స్‌ భవన్‌ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని , రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర క్రీడలు యువజన, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం బుల్లితెర సినీనటులు, శాసన సభ్యులు ఆడేక్రికెట్‌ మ్యాచ్‌లో పాల్గొంటారని వెల్లడించారు. అదేవిధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 


నేడు జరుగనున్న కార్యక్రమాలు

* మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో రోజంతా జన్మదిన వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

* ఉచిత హెల్త్‌ క్యాంపును స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కేసీఆర్‌ జీవిత నేపథ్యాన్ని వివరించే ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ప్రభుత్వ పథకాల ఎల్‌ఈడీ ప్రదర్శన శాలను హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించనున్నారు. 

* సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు కట్‌ చేయనున్నారు. 

*  ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్‌ వీల్స్‌ చైర్స్‌ పంపిణీ చేయనున్నారు. 

* బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద ఎంపీ జోగినపల్లి సంతోశ్‌, మంత్రి తలసానితో కలిసి మొక్కలు నాటనున్నారు. ముఖ్యమంత్రి నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో విరాజిల్లాలని, ఆయన పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాల్లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 

* హుస్సేనీఆలం, నాంపల్లి, లంగర్‌హౌస్‌ దర్గా వద్ద డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ మొక్కలు నాటనున్నారు. 

* పేట్లబుర్జు సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగే హరితహారంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, సీపీ అంజనీకుమార్‌లు పాల్గొని మొక్కలు నాటనున్నారు.

* నాచారంలోని ఢిల్లీ పబ్లిక్‌స్కూల్‌లో విద్యార్థులు వందల మొక్కలు నాటనున్నారు. 

* తెలంగాణ రైస్‌ మిల్లర్ల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణభవన్‌లో మెగా రక్తదాన శిబిరం, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ ఆధ్వర్యంలో అంబర్‌పేటలోని డివిజన్‌ కార్యాలయ ప్రాంగణంలో హరితహారం కార్యక్రమం నిర్వహించనున్నారు. 

అంతేకాకుండా గ్రేటర్‌ వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇవే కాకుండా గుస్సాడీ, పులివేశధారణ, ఒగ్గుడోలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 


logo
>>>>>>