సోమవారం 30 మార్చి 2020
Hyderabad - Feb 16, 2020 , 03:55:08

మాతృదేవోభవ పితృదేవోభవ

మాతృదేవోభవ పితృదేవోభవ

కవాడిగూడ: భాగ్యనగర్‌ సంస్కార్‌ సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం)లో శనివారం రాత్రి తల్లిదండ్రుల పూజా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు తమ తల్లిదండ్రులకు నుదుట తిలకం దిద్ది, మెడలో పూలమాలవేసి, పాదపూజ చేశారు. అనంతరం వారికి హారతి ఇచ్చి ఆశ్సీసులు అందుకున్నారు. మరపురాని ఈ మధురమైన ఘట్టాన్ని తిలకించిన వారితో పాటు పిల్లలతో  పూజలందుకున్న తల్లిదండ్రులకు, గురువులకు కళ్లు చెమర్చాయి.. ఆనంద బాష్పాలు జాలువారాయి. అపురూపమైన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సంత్‌ శ్రీఆశారామ్‌ జీ బాపు శిష్యురాలు సాద్వి రేఖాబహెన్‌, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ముషీరాబాద్‌ శాసన సభ్యులు ముఠా గోపాల్‌, ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్‌ ముఠా పద్మలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాద్వి రేఖాబహెన్‌ మాట్లాడుతూ సనాతన సంస్కృతి సంప్రదాయాలకు ప్రసిద్ధి మన భారతదేశం అన్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని తల్లిదండ్రులను, గురువులను గౌరవించే ప్రాముఖ్యతను తెలియజెప్పే దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఒక్క భారతదేశమేనని వివరించారు. నిత్యం తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి గౌరవించుకోవాలన్నారు. 


ప్రస్తుతం పాశ్చాత్య వ్యామోహంలో పడి మన సంస్కృతీసంప్రదాయాలను విస్మరిస్తున్నారని ఇది సరికాదని అన్నారు.  జీవించి ఉన్నంత కాలం ఫిబ్రవరి 14న తల్లిదండ్రుల దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య మాట్లాడుతూ మనిషి జీవితంలో ప్రధానమైన వారు తల్లిదండ్రులేనని వారి తర్వాతే ఏదైనా అని పేర్కొన్నారు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించుకోవడం మన అదృష్టంగా భావించాలన్నారు. తల్లిదండ్రులే మనకు ప్రత్యక్ష దైవాలని వారిని పూజించుకోవాలన్న సందేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ముషీరాబాద్‌ శాసన సభ్యుడు ముఠాగోపాల్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులను మించిన దైవం లేదన్నారు. వారిని పూజించుకొని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.   కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు దినేశ్‌దేవ్డా, కార్యదర్శి ఎ.కె.పంతంగే, డాక్టర్‌ సుమిత్ర, విశాల్‌గోయల్‌, యజ్ఞేశర్వర్‌ నాయుడు తదితర పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.


logo