ఆదివారం 24 మే 2020
Hyderabad - Feb 16, 2020 , 03:53:22

చేయూతనిచ్చారు..సౌకర్యాలు కల్పించారు

చేయూతనిచ్చారు..సౌకర్యాలు కల్పించారు

బిరుదు చందర్‌ బడంగ్‌పేట,నమస్తే తెలంగాణ : ప్రభుత్వ సంకల్పానికి.. దాతలు సహకారం అందిస్తున్నారు.  ప్రాఠశాలలను అభివృద్ధి చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి.  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ పాఠశాలలను దత్తతకు తీసుకుంటున్నారు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. బాలాపూర్‌ మండల పరిధిలో ఉన్న గుర్రంగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఈఎల్‌వీ ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, డైరెక్టర్‌ అశోక్‌ దత్తత తీసుకున్నారు. పాఠశాలలో చదువుతున్న 130 మంది విద్యార్థులకు ఉన్న సమస్యలను గుర్తించారు. ముగ్గురు ఉపాధ్యాయులతో ఇబ్బంది పడుతున్న విధానం చూసి వారు చలించి పోయారు. ఈఎల్‌వీ ఫౌండేషన్‌  ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలను మార్చివేసింది. శ్రీనివాస్‌, అశోక్‌ తల్లిదండ్రులు లక్ష్మమ్మ వీరయ్యల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 2008లో స్థాపించిన ఈఎల్‌వీ ఫౌండేషన్‌ ద్వారా లక్షల రూపాయలను ఖర్చు చేసి పాఠశాలను అభివృద్ధి చేస్తున్నారు. విద్యార్థులకు ఆట వస్తువులు, దుస్తులు, షూ అందించడంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్న అధ్యాపకులకు అవార్డులు అందజేస్తున్నారు.  


13 లక్షలతో సౌకర్యాలు..

బాలాపూర్‌ మండలం గుర్రంగూడ పభుత్వ పాఠశాలలో ఈఎల్‌ వీ ఫౌండేషన్‌ చైర్మన్‌  శ్రీనివాస్‌ డైరెక్టర్‌ అశోక్‌ రూ.13 లక్షలతో పాఠశాలను తీర్చిదిద్దుతున్నారు.  పాఠశాలలో ఉన్న ప్రహరీ ఎత్తు పెంచారు. ఫ్యాన్లు, కిటికీలు, తలుపులు, మంచినీటి వాటర్‌ ట్యాంక్‌, ఫ్లోరింగ్‌ బండలు, పాఠశాల ప్రధాన ముఖ ద్వారం దగ్గర పాఠశాల బోర్డు, చుట్టూ గ్రీనరీ, మురుగు దొడ్లు, మూత్ర శాలలు, కళా వేదిక, పాఠశాలకు రంగులు వేయించడం, గ్రంథాలయం ఏర్పాటు, గోడలకు సూక్తులు రాయించారు. బేంచీలు, కుర్చీలు అందజేశారు.  మొక్కలు నాటించి వాటికి నీళ్లు పోయడానికి నెలకు రూ.5 వేలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇద్దరు విద్యా వలంటీర్స్‌ను నియమించి వేతనం అందజేస్తున్నారు. బాలవికాస సంస్థ వారు  పుస్తకాలను అందజేశారు. దాదాపుగా 200 పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.   సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి బుధవారం గుర్రంగూడ పాఠశాలకు వచ్చి విద్యార్థులకు యోగా, ధ్యానం నేర్పిస్తుంటారు.  ప్రతి వారం ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తున్నారు. డాక్టర్‌ భాస్కర్‌ విద్యార్థులకు దంత పరీక్షలు చేయిస్తున్నారు. అవసరం అయిన వారికి శాస్త్ర చికిత్సలు చేయిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి తెలిపారు. 


logo