ఆదివారం 24 మే 2020
Hyderabad - Feb 16, 2020 , 03:51:36

మహిళల రక్షణ కోసమే..‘మై క్యాబ్‌ ఈజ్‌ సేఫ్‌'

మహిళల రక్షణ కోసమే..‘మై క్యాబ్‌ ఈజ్‌ సేఫ్‌'

బేగంపేట: మహిళల భద్రతను మరింత పటిష్టం చేసే క్రమంలో నగర్‌ పోలీస్‌ వ్యవస్థ  ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుందని నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. ‘మై క్యాబ్‌ ఈజ్‌ సేఫ్‌' పేరిట నగరంలోని క్యాబ్‌లకు పోలీస్‌ రిజిస్ట్రేషన్‌ సేవలను శనివారం బేగంపేట ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(టీటీఐ)లో ఆయన ప్రారంభించారు. పలు క్యాబ్‌లకు ఆయన రిజిస్ట్రేషన్‌ స్టిక్కర్లు వేశారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని రకాల ప్రైవేట్‌ టాక్సీలు, క్యాబ్‌ ఆపరేటర్లు ‘మైక్యాబ్‌ ఈజ్‌ సేఫ్‌'లో భాగంగా పోలీస్‌ శాఖ నుంచి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. 35 రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి  పేరు,వాహన నంబర్‌, ఫోన్‌ నంబర్‌, బార్‌కోడ్‌తో కూడిన  స్టిక్కర్లు, సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. దీంతో క్యాబ్‌కు సంబంధించి పూర్తి వివరాలు  పోలీస్‌ కంట్రోల్‌ రూంకి కనెక్ట్‌ చేయబడుతాయని తెలిపారు. దీని ద్వారా క్యాబ్‌లో ప్రయాణించే వారికి ,ఆ వాహనానికి సంబంధించి  పూర్తి స్థాయి భద్రత ఉంటుందన్నారు. క్యాబ్‌ ఆపరేటర్లకు సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధుల్లో  బేగంపేట ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ కేంద్రంతో పాటు ఎల్‌బీనగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లలో రిజిస్ట్రేషన్‌ సేవలు అందుతాయన్నారు.  ఇప్పటికే ఆటో ఈజ్‌ సేఫ్‌ ద్వారా 85వేల ఆటోలు రిజిస్ట్రేషన్‌ చేయించామన్నారు.కార్యక్రమంలో ట్రాఫిక్‌ డీసీపీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌, ఏసీపీ గోవర్థన్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌లు, అర్లప్ప, నాగేశ్వర్‌రావు, ముత్తు పాల్గొన్నారు.


logo