ఆదివారం 24 మే 2020
Hyderabad - Feb 16, 2020 , 03:48:52

మాటలు నేర్పుతారు.. వైకల్యం పోగొడుతారు

మాటలు నేర్పుతారు.. వైకల్యం పోగొడుతారు

వర్కాల కిష్టయ్య (అంబర్‌పేట,నమస్తే తెలంగాణ) : మానసిక వైకల్యంగల చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. పలు రకాల ఫిజియోథెరపి సేవలతో తోడ్పాటునిస్తున్నారు. చిన్నారులతో పాటు పెద్దలకు కూడా ఇక్కడే నామమాత్రపు రుసుముతో థెరపి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆ సంస్థనే అంబర్‌పేట నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్‌ తులసీనగర్‌ కాలనీ పార్కులో ఉన్న ‘ధీమహి’ ప్రైమరీ రిహాబిలిటేషన్‌ కేంద్రం. 

సక్షమ్‌, ఇంక్లూసివ్‌ ఇండియా, సహార హెల్త్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీల సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటైంది ధీమహి సంస్థ. ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు, నగరాల్లో తమ సేవలను అందజేస్తున్నది. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ సంస్థ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా 19 ఏండ్లలోపు వారికి ఎక్సర్‌సైజ్‌ , స్పీచ్‌ థెరపి, పోస్టర్‌ కరెక్షన్‌, ప్రొప్రియోసెప్షన్‌, వెస్టిబులర్‌ థెరపి, సెన్సరీ ఇంటిగ్రేషన్‌ థెరపి, ఫైన్‌ మోటార్‌ , బిహేవియర్‌ మోడిఫికేషన్‌, మోటార్‌ డెవలప్‌మెంట్‌ థెరపిలు, సెరబల్‌ పల్సీ, మెంటల్లీ రిటోర్డెడ్‌, లోకోమోటార్‌, స్పీచ్‌, మల్టిపుల్‌ డిజబిలిటీస్‌, ఇంటలెక్చువల్‌ డిజబిలిటి, డీఎండీ వంటి వాటిల్లో ఉచితంగా సేవలు అందిస్తున్నారు. 19 నుంచి 60 ఏండ్ల గల వారికి విజిట్‌కు రూ.100, 60 నుంచి 100 ఏండ్ల వరకు వారికి రూ.50 తీసుకొని స్ట్రోక్‌ మేనేజ్‌మెంట్‌, పెరాలసిస్‌ మేనేజ్‌మెంట్‌, జాయింట్‌ పెయిన్స్‌కు సేవలు అందిస్తున్నారు. గోల్నాకలోని ఈ సెంటర్‌లో సేవలన్నీ లభిస్తాయి.


నగరంలోని పలు ప్రాంతాల్లో..

నగరంలోని గోల్నాక, యూసుఫ్‌గూడ, ఈసీఐఎల్‌, విజయనగర్‌ కాలనీలలో ఈ సెంటర్లు ఉన్నాయి. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు, సంగారెడ్డి, జోగిపేట, ఎనుకొండ, నవాబ్‌పేట, జడ్చర్ల, హన్వాడ, కోయిల్‌కొండ, మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌లలో ఈ కేంద్రాలు ఉన్నాయి. 

ఎమ్మెల్యే సహకారంతో..

గోల్నాకలోని తులసీనగర్‌ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ సహకారంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ చిన్నారులకు అన్ని రకాల థెరపి సేవలను ఉచితంగా అందజేస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రజలను కోరుతున్నారు.


logo