ఆదివారం 24 మే 2020
Hyderabad - Feb 16, 2020 , 03:46:31

మరో 17 ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్‌ లైన్లు

మరో 17 ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్‌ లైన్లు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరంలో పలు ప్రాంతాల్లో ఓవర్‌ హెడ్‌ విద్యుత్‌ లైన్ల స్థానంలో భూగర్భ విద్యుత్‌లైన్లు ఏర్పాటు కానున్నాయి. ఇలా గ్రేటర్‌లోని 17 ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్‌ లైన్లు వేయనున్నారు. ఇందుకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ పనులకు ఇప్పటికే ఉన్నతాధికారుల ఆమోదం లభించగా, త్వరలోనే పనులను ప్రారంభించనున్నారు. నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌(ఎస్‌ఆర్‌డీపీ)ను చేపట్టిన విషయం తెలిసిందే. ఎస్‌ఆర్‌డీపీతో నగర రవాణా వ్యవస్థ మహర్దశ పట్టడంతోపాటు విద్యుత్‌లైన్లకు సైతం మహర్దశ పట్టనున్నది.


ఈ ప్రాజెక్ట్‌ విద్యుత్‌శాఖకు కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్‌ కింద పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌లు నిర్మిస్తున్నారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్న ప్రాంతాల్లో విద్యుత్‌ లైన్లు, తీగలు, స్తంభాలు సైతం ఉండటంతో వాటిని తొలగించాల్సి వస్తున్నది. తొలగించిన వాటి స్థానంలో తిరిగి ఓవర్‌హెడ్‌ లైన్లు వేయకుండా, భూగర్భ కేబుళ్లను వేసేందుకు డిస్కం అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మేరకు గ్రేటర్‌ పరిధిలో 17 ప్రాంతాల్లో భూగర్భ కేబుళ్లు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి ఆయా ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన భూగర్భ కేబుళ్లు వేయబోతున్నారు. ఇప్పటికే ట్రాఫిక్‌, జీహెచ్‌ఎంసీ అధికారుల ఆమోదం లభించగా, మరో రెండు నెలల్లో భూగర్భ కేబుల్స్‌ పనులు పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.


logo