శనివారం 30 మే 2020
Hyderabad - Feb 15, 2020 , 02:11:42

నిర్లక్ష్యం..అభద్రత..

నిర్లక్ష్యం..అభద్రత..
  • విద్యార్థులను స్కూల్‌కు తరలించే ఆటోలపై నజర్‌
  • రెండ్రోజుల్లో 3,221 కేసులు నమోదు
  • నిబంధనలు పాటించని వారిపై చర్యలు


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : విద్యార్థులను పాఠశాలలకు తరలించే ఆటోలలో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్నారు. ఆటో వాలాలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలంటూ పోలీసులు సూచిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. తల్లిదండ్రులు సైతం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. రెండు రోజులుగా స్కూల్‌ విద్యార్థులను తీసుకెళ్లే ఆటోల విషయంలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి నిబంధనలు పాటించని ఆటోలపై 3,221 కేసులు నమోదు చేశారు. ఇందులో ఏడుగురు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. బుధ, గురువారాలలో ఉదయం 7.30 నుంచి 9.30గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేకంగా స్కూల్‌ ఆటోలను తనిఖీ నిర్వహించారు. 


అందులో కొందరు పరిమితికి మించి విద్యార్థులను తరలించడం, మరికొందరు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండానే ఆటో నడుపడం, ఇంకొందరు ఆటోకు సంబంధించి సరైన పత్రాలు లేకుండానే నడుపడం, రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ ఇలా పలు నిబంధనలను ఉల్లంఘించారు. ఉల్లంఘనలపై కేసు నమోదు చేసిన ప్రత్యేక బృందాలు, ఆటో డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించారు. స్కూల్‌ యాజమాన్యాలతో కూడా విద్యార్థుల భద్రతపై చర్చించారు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు పిల్లల భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు పాటించే ఆటోలు, వ్యాన్లనే ఎంచుకొని పిల్లలను అందులో పంపించాలనే విషయంలో పాఠశాల యాజమాన్యం చొరవ తీసుకొని, తల్లిదండ్రులతో తరుచూ సమావేశాలు ఏర్పాటు చేస్తూ అవగాహన తీసుకురావాలన్నారు. పాఠశాలల వద్దకు వచ్చే ఆయా వాహనాలు నిబంధనలు పాటిస్తున్నాయా? లేదా? అనే విషయాలను గమనిస్తుండాలని సూచించారు. 


logo