శనివారం 30 మే 2020
Hyderabad - Feb 15, 2020 , 01:55:36

మరిన్ని సోలార్‌ స్టేషన్లు..

మరిన్ని సోలార్‌ స్టేషన్లు..
  • పర్యావరణ పరిరక్షణ..ఇంధన పొదుపే ధ్యేయం
  • పూర్తి స్థాయి సౌరవిద్యుత్‌ వినియోగంపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దక్షిణ మధ్య రైల్వే సోలార్‌ సొబగులద్దుకొని.. సౌరశక్తిని చక్కగా వినియోగించుకుంటున్నది. ఎనర్జీ న్యూట్రల్‌ స్టేషన్లు అనే నూతన ఆలోచన తెచ్చి.. అమల్లో పెట్టింది. మిగతా జోన్లకు ఆదర్శంగా నిలిచింది. వంద శాతం ఇంధన అవసరాలన్నింటికీ సోలార్‌ ఫొటో వోల్టాయిక్‌ (ఎస్‌పీవీ) ఫలకలతో ఉత్పత్తి చేసే సౌరశక్తిని ఉపయోగించుకొని అగ్రగామిగా నిలిచింది. ఇప్పటికే జోన్‌లో విద్యుశ్చక్తి వాడకుండా కేవలం సోలార్‌పైనే ఆధారపడే విధానం 13 స్టేషన్లలో అమలువుతున్నది. సికింద్రాబాద్‌-బీబీనగర్‌ మార్గంలో 10 కిలోవాట్ల శక్తితో సౌర ఫలకాలను ఏర్పాటు చేసి విద్యుత్‌ అవసరాలను తీర్చుకుంటున్నది. ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద నెలకొల్పిన వ్యవస్థ ద్వారా సికింద్రాబాద్‌, బీబీనగర్‌ మార్గంలోని స్టేషన్లను ఆపరేట్‌ చేస్తున్నారు. అదేవిధంగా  సికింద్రాబాద్‌-బీబీనగర్‌, సికింద్రాబాద్‌-వికారాబాద్‌, సికింద్రాబాద్‌ కాజీపేట హైదరాబాద్‌ డివిజన్‌లోని నిజామాబాద్‌-ముద్‌ఖేడ్‌ రూట్‌ల్లో సోలార్‌ స్టేషన్లు ఉన్నాయి. తాజాగా ఘట్‌కేసర్‌ తరహాలో మిగతా ప్రాంతాల్లో సోలార్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రతి మార్గంలో  ఎనర్జీ న్యూట్రల్‌ రైల్వే స్టేషన్లు సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అధికారులు ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నారు.


logo