సోమవారం 13 జూలై 2020
Hyderabad - Feb 14, 2020 , 04:31:33

వేధించిన వాళ్లు.. ఒక్కకాల్‌తో జైలు పాలు

వేధించిన వాళ్లు.. ఒక్కకాల్‌తో జైలు పాలు
  • కొత్త ఏడాదిలో ‘ఆమె’ జోలికెళ్లిన 54 మంది అరెస్టు
  • ఏ అవకాశం దొరికినా సతాయించేందుకు వెనకాడని టీజర్లు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మహిళలు, యువతులను వేధిస్తున్న టీజర్లు ఒక్క ఫోన్‌ కాల్‌తో జైలుపాలవుతున్నారు. సైబరాబాద్‌ షీ టీమ్స్‌కు జనవరిలో మొత్తం 225 ఫిర్యాదులు రాగా 75 కేసులు నమోదు చేశారు. వీటిలో 17 క్రిమినల్‌, 58  పెట్టీ కేసులుగా ఫైల్‌ చేసి 54 మందిని అరెస్టు చేశారు. బస్‌ స్టాపులు, షాపింగ్‌ మాల్స్‌, రైల్వే స్టేషన్లు, కాలేజీల వద్ద మాటు వేసి 277 డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహించారు. 181 కార్యక్రమాల ద్వారా 33,229 మంది విద్యార్థులకు స్వీయ రక్షణపై అవగాహన కల్పించారు. 


మహిళలు, యువతులను వేధిస్తున్న అంశాలపై సైబరాబాద్‌ షీ టీమ్స్‌కు జనవరి నెలలో 225 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులు సోషల్‌ మీడియా, వాట్సాప్‌ ద్వారా, కొంత మంది నేరుగా షీ టీమ్స్‌ను సంప్రదించారు. వీటిని పరిశీలించిన షీ టీమ్స్‌ 75 కేసులను నమోదు చేసింది. వీటిలో 17క్రిమినల్‌ కేసులు, 54 మందిపై పెట్టీ కేసులను నమోదు చేసి అభియోగాలను మోపింది. బాధ్యులైన 52 మందిని అరెస్టు చేసింది. బస్సు స్టాపులు, షాపింగ్‌ మాల్స్‌, రైల్వే స్టేషన్‌, కాలేజీల వద్ద మాటు వేసి 277 డీకాయ్‌ ఆపరేషన్‌లను నిర్వహించి పోకిరీల భరతం పట్టింది. అదే విధంగా మహిళలు, యువతులు, విద్యార్థినుల్లో అవగాహన, వారికి ఉన్న చట్టాలు, హక్కులు, ఈవ్‌టీజర్స్‌ నుంచి రక్షించుకునే మెలుకువలను 181కార్యక్రమాలను నిర్వహించి 33,229 మందికి అవగాహన కల్పించారు. మహిళలు, యువతుల పట్ల పోకిరీలు, ఈవ్‌టీజర్‌లు అసభ్యంగా వ్యవహరించి పోలీసులకు చిక్కిన పలు ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి.


పీఈటీ టీచర్‌కు వేధింపులు...

షాద్‌నగర్‌ కంసాన్‌పల్లి ప్రాంతానికి చెందిన ఆవ బాలారాజు స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో పీఈటీ టీచర్‌గా పని చేస్తున్నది. ప్రతి రోజు ఆమె పాఠశాలకు వెళ్లే సమయంలో వెంటపడుతూ ఫోన్‌లో మాట్లాడాలని, ప్రేమించాలని, తనతో గడపాలని ఓ యువకుడు వేధించాడు. ఈ విషయాన్ని టీచర్‌ తల్లిదండ్రుల దృష్టకి తీసుకువచ్చింది. దీంతో తల్లిదండ్రులు అతనిని నిలదీశారు. ఆయన తీరు మార్చుకోకుండా అదేవిధంగా వెంటపడడంతో టీచర్‌ షీటీమ్స్‌ను ఆశ్రయించింది. దీంతో షీ టీమ్స్‌ వేధిస్తున్న సమయంలో ప్రత్యక్షంగా పట్టుకుని షాద్‌నగర్‌ పోలీసు లకు అప్పజెప్పి జైలుకు పంపింది.


పని చేసే చోట వేధింపులు

శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్‌గూడ హాస్టల్‌లో వెంకటేశ్‌ అనే వ్యక్తి సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. అతని కింద పని చేసే ఓ ఉద్యోగినిని తరచూ ఫోన్‌లో మాట్లాడాలని వేధిస్తున్నాడు. దీని కోసం ప్రతి రోజు ఫోన్‌లు చేసి హింసిస్తున్నాడు. లేదంటే ఆమె కొడుకును చంపేస్తానని బెదిరించాడు. భయాందోళనకు గురైన బాధిత ఉద్యోగిని షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన అధికారులు వెంకటేశ్‌ను అరెస్టు చేసి శంషాబాద్‌ పీఎస్‌ ద్వారా రిమాండ్‌కు తరలించారు.


దోస్తు భార్యకు వేధింపులు

సూరారం కాలనీ ప్రాంతానికి చెందిన సొంపల్లి మహేశ్‌ దోస్తు భార్య వెంట పడ్డాడు. ఆమెకు సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేశాడు. తనకు సన్నిహితంగా ఉండకపోతే మార్ఫింగ్‌ చేసిన ఫొటోలను భర్తకు, బంధువులకు పంపించి పరువు తీస్తానని బెదిరించాడు. దీంతో బాధిత మహిళ మానసిక వేదనకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వెంటనే తన బాధను షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి అతనిని బాలానగర్‌ పీఎస్‌ నుంచి రిమాండ్‌కు పంపారు.


మీట్‌ యాప్‌తో వేధింపులు

కూకట్‌పల్లి ప్రాంతానికి చెంది నీరజ్‌ రాహుల్‌దేవ్‌ ప్రైవేటు ఉద్యోగి. అతను మీట్‌ మీ యాప్‌లో నకిలీ ఐడీని సృష్టించాడు. దాని ద్వారా తనకు పరిచయమున్న మహిళకు ఫోన్‌ చేసి లైంగిక వాంఛ తీర్చాలని వెంటపడ్డాడు. బాధితురాలు అతని వేధింపులను భరించలేక షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో కూకట్‌పల్లి పోలీసులు అతనిని అరెస్టు చేశారు.


కేక్‌ను కొనుగోలు చేసి చిక్కిపోయింది

సంగారెడ్డి జిన్నారం ప్రాంతానికి చెందిన మర్రి వివేకానందరెడ్డి స్థానికంగా బేకరీని నిర్వహిస్తున్నాడు. ఓ మహిళ ఇటీవల అతని బేకరీలో కేక్‌ను కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన డబ్బును గూగుల్‌ పే ద్వారా చెల్లించింది. అలా దొరికిన ఫోన్‌ నంబరుతో వివేకానందరెడ్డి మహిళను వేధింపులకు గురి చేశాడు. భయాందోళనకు గురైన బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో దర్యాప్తు చేసి అతన్ని దుండిగల్‌ పీఎస్‌ ద్వారా జైలుకు పంపారు.సైబరాబాద్‌ పరిధిలోని ఫోన్‌ నంబర్లు

బాలానగర్‌ షీటీమ్స్‌ : 9490617349, గచ్చిబౌలి ఐటీ కారిడార్‌ : 9490617352, మాదాపుర్‌ షీ టీమ్స్‌ : 8333993519, కూకట్‌పల్లి షీటీమ్స్‌: 949 3626811, జగద్గీర్‌గుట్ట షీ టీమ్స్‌ :9493624561, మియాపుర్‌ షీ టీమ్స్‌:9491051421, పేట్‌బషీరాబాద్‌ షీ టీమ్స్‌:7901114137, రాజేంద్రనగర్‌ షీ టీమ్స్‌:7901114140, శంషాబాద్‌ షీ టీమ్స్‌:9490 617354, చేవెళ్ల షీ టీమ్స్‌:9493625379, షాద్‌నగర్‌ షీ టీమ్స్‌:9492624147, సైబరాబాద్‌ వాట్సాప్‌ : 9490617444, డయల్‌ 100, sheteam.cybe [email protected], ఫేసుబుక్‌ ఐడీ షీ టీమ్‌ సైబరాబాద్‌లో సంప్రదించి ఫిర్యాదులను నమోదు చేయవచ్చని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కోరారు.


అరెస్టు అయిన వారి వివరాలు..

మైనర్లు : 09 

19-24 : 16

25-35 : 23

36-50 : 05

50పైన వారు :01

12 మంది ఈవ్‌టీజర్‌లను ప్రత్యక్షంగా విద్యార్థులు, యువతులను వేధిస్తుండగా, షీ టీమ్స్‌ పట్టుకున్నారు. పెట్టీ కేసుల వారికి కుటుంబ సభ్యులు సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇవ్వగా, క్రిమినల్‌ కేసులు నమోదైన 17 మందిని జైలుకు పంపారు.  


logo