గురువారం 13 ఆగస్టు 2020
Hyderabad - Feb 14, 2020 , 04:23:20

సైనికులకు విరాళమిచ్చేద్దాం..

సైనికులకు విరాళమిచ్చేద్దాం..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : శత్రుదేశాల నుంచి సరిహద్దులను రక్షించడం.. దేశంలో శాంతిని నెలకొల్పడంలో సైనికుల శ్రమ వెలకట్టలేనిది. యుద్ధాల్లో ధైర్యసహసాలు ప్రదర్శించడం.. ఉగ్రమూకలను ఏరిపారేయడంలో సైనికుల త్యాగాలు అజరామరం. ఆర్మీ, నౌకా, వైమానిక దళాలకు చెందిన సైనికులు భూతలం, గగనతలం, సముద్రతలమన్న తేడాల్లేకుండా విధులు నిర్వహిస్త్తూ మనల్ని అనునిత్యం కాపాడుతున్నారు. ఇలా మాతృభూమి సేవలో తరిస్తూ అసువులు బాసిన సైనిక కుటుంబాలను ఆదుకోవడం మనందరి బాధ్యత. ఆయా కుటుంబాలకు అండగా ఉండడం మనందరి కర్తవ్యం. ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నదే ‘సాయుధ దళాల పతాక నిధి’. సైనికులకు సంఘీభావాన్ని ప్రకటించడంతో పాటు, మాజీ సైనిక కుటుంబాలకు పునరావాసం కల్పించడం కోసం ఉద్ధేశించిన ఈ నిధికి విరాళాలివ్వడం ద్వారా ఆదాయపు పన్ను రాయితీని పొందవచ్చు. 50 శాతం వరకు పన్ను రాయితీ పొందవచ్చు. 


పన్ను మినహాయింపు..

ఈ నిధికి విరాళం సమర్పించిన వారికి సెక్షన్‌ 80జీ ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం 50 శాతం ఆదాయపన్ను రాయితీ కలదు. ఉదాహరణకు ఎవరి ఆదాయమైనా రూ.5.03 లక్షలు ఉన్నట్లయితే వారు రూ.12,500 ఆదాయపు పన్నుగా చెల్లించాలి. ఇలాంటి వారు రూ.6 వేలను సాయుధ దళాల పతాక నిధికి విరాళంగా ఇచ్చినట్లయితే రూ.3 వేలు (50శాతం) రాయితీ లభిస్తుంది. ఇప్పుడు సదరు వ్యక్తి ఆదాయం రూ.5 లక్షలే అవుతుంది. ఆదాయపు పన్నుశాఖ ఆదేశాల ప్రకారం రూ.5 లక్షలు అంతకంటే లోపు ఆదామున్నవారు పన్ను కట్టాల్సిన అవసరంలేదు. తన వంతు బాధ్యతగా 6 వేలు విరాళమిస్తే.. మరో రూ.6, 500 లబ్ధిచేకూరుతుంది. ఒక వేళ ఆదాయం రూ.5 లక్షలకు మించిన వారు పతాకనిధికి విరాళమిస్తే 50 శాతం రాయితీని పొందవచ్చు. ఆదాయపు పన్ను మినహాయింపు పొందాలనుకునేవారు బ్యాంక్‌ అకౌంట్‌లో జమచేసిన ఆన్‌లైన్‌ రశీదును సోమాజిగూడలోని సైనిక సంక్షేమ కార్యాలయంలో సమర్పించి పన్నురాయితీ రశీదును పొందవచ్చు. లేదంటే డిమాండ్‌ డ్రాఫ్ట్‌ (డీడీ)ని నేరుగా కార్యాలయంలో సమర్పించి అక్కడే రశీదును పొంది, రాయితీని పొందవచ్చు.


ఎవరెవరు ఇవ్వవచ్చు..

సామాన్యులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, వ్యాపారస్తులు, కార్పొరేట్‌ ఉద్యోగులు, పింఛన్‌దారులు సహా దాతృత్వ గుణం ఉన్నవారు, బాధ్యత గల పౌరులు ఎవరైనా ఇవ్వవచ్చు. అంతేకాకుండా హుండీల ద్వారా, స్టిక్కర్లు, కార్‌ ఫ్లాగ్‌లను విక్రయించడం ద్వారా సైతం నిధులను సేకరిస్తారు.


ఎలా ఇవ్వాలి.. 

  • విరాళం ఇవ్వాలనుకునే వారు చెక్కులు, డీడీల రూపంలో ఇవ్వవచ్చు. నేరుగా అకౌంట్‌లో జమచేయవచ్చు.
  • ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్లాగ్‌డే ఫండ్‌ (ఏఎఫ్‌ఎఫ్‌డీ), అకౌంట్‌ నెంబర్‌ 62076718524
  • ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ SBIN0020063
  • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బెల్లావిస్టా బ్రాంచ్‌ (రాజ్‌భవన్‌రోడ్‌)
  • ఇతర వివరాల కోసం 87907 38657 నంబర్‌ను సంప్రదించవచ్చు.


గవర్నర్‌ చైర్‌పర్సన్‌గా..

రాష్ట్రస్థాయిలో సాయుధ దళాల పతాకనిధికి గవర్నర్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైస్‌చైర్మన్‌గా, సైనిక సంక్షేమశాఖ సంచాలకులు సెక్రటరీగా, ఇతర సైనిక ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ నిధి నుంచి యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు, గాయపడిన మాజీ సైనికులు, సైనిక వితంతువులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేస్తారు.


చేయి చేయి కలపండి.. విరివిగా విరాళాలు ఇవ్వండి..

మాజీ సైనికులు, సైనిక కుటుంబాల పునరావాసం కోసం సేకరించే ‘సాయుధ దళాల పతాక నిధి’కి  గతేడాది రూ.52లక్షలను సేకరించాం. ఇంత మొత్తం సేకరించడం ద్వారా హైదరాబాద్‌ జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా విరాళాలు సేకరించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఏడాది సైతం అంతే మొత్తంలో విరాళాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. హైదరాబాదీలు ముందుకువచ్చి విరివిగా విరాళాలు అందజేసి.. తమ బాధ్యతను చాటుకోవాలి. చేయిచేయి కలిపి విరాళాలు అందజేసి సైనికులకు అండగా నిలవాలి.

-నోరి శ్రీనేశ్‌కుమార్‌ ( ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి, హైదరాబాద్‌) 


logo