బుధవారం 12 ఆగస్టు 2020
Hyderabad - Feb 14, 2020 , 04:21:35

సమన్వయంతో ముందుకు సాగుదాం

సమన్వయంతో ముందుకు సాగుదాం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నిత్యం వివిధ రకాల వేడుకలు, పం డుగలు, వీఐపీల పర్యటనలు తదితర కార్యక్రమాలతో బిజీగా ఉండే మన నగరంలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరమని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. సమన్వయం లేకపోతే అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురవుతాయని, అవి ముందుకుసాగే ఆస్కారం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసు తదితర శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు గురువారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో లోకేశ్‌కుమార్‌ అధ్యక్షతన ఆయా విభాగాల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, హైదరాబాద్‌ పేరుప్రతిష్టలను ఇనుమడింపజేసేందుకు అన్ని శాఖల మధ్య సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ ఏడాది మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని సంకల్పించినట్లు, దీనికి అవసరమైన నిధులు కూడా సమకూర్చుకున్నట్లు చెప్పారు. ఇందులోభాగంగా వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ)కు సంబంధించిన 24ప్రాజెక్టులతోపాటు 35లింకు రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. అంతేకాకుండా శివారు ప్రాంతాల్లో 350కి.మీ.ల పొడవున కొత్త బీటీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 474 ట్రాఫిక్‌ సిగ్నళ్లను ఆధునీకరణ కోసం అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని కమిషనర్‌ చెప్పారు. 


టీఎస్‌ రెడ్కో ద్వారా 34 జీహెచ్‌ఎంసీ కార్యాలయ భవనాలకు సోలార్‌ విద్యుత్‌ ప్యానళ్లను ఏర్పాటు చేశామన్నారు. బహుళ అంతస్తుల పార్కింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి కృషిచేస్తున్నట్తు తెలిపారు. సీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం హైదరాబాద్‌ నగరాన్ని సేఫ్‌ సిటీ ప్రాజక్టుకు ఎంపిక చేసిందన్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం నగరాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. సున్నితమైన అంశాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్‌, శాంతిభద్రతలు, స్పెషల్‌ బ్రాంచ్‌, వీఐపీ సెక్యూరిటీ తదితర విభాగాలను గురించి ఆయన వివరించారు. హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మమంతీ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల రక్షణకు జియోట్యాగింగ్‌తో ల్యాండ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీ, పోలీసు, రెవెన్యూ విభాగాల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.logo